Friday, April 16, 2010

10 శాతానికి చేరువగా..

గత నెల ద్రవ్యోల్బణం 9.9 శాతం
17 నెలల గరిష్ఠ స్థాయి ఇది
ఆహార ద్రవ్యోల్బణం ఒకింత తగ్గింది
ఆర్‌బీఐ కీలక రేట్లు పెంచుతుంది: విశ్లేషకులు
న్యూఢిల్లీ
నెలవారీ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారంగా లెక్కగట్టే ద్రవ్యోల్బణం వార్షిక రేటు మార్చి నెలలో ఒక మోస్తరుగా ఎగసి, 9.9 శాతానికి చేరింది. ఇది 17 నెలల గరిష్ఠం. ఫిబ్రవరిలో ఇది 9.89 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. చక్కెర, పప్పు ధాన్యాల ధరలు పెరిగిన ఫలితంగా ద్రవ్యోల్బణం ఎగబాకినట్లు గురువారం ఇక్కడ విడుదల చేసిన అధికారిక సమాచారం వెల్లడించింది. నెలవారీ ద్రవ్యోల్బణ సమాచారాన్ని బట్టి చూస్తే క్రితం సంవత్సరం మార్చి నెలలో కన్నా పంచదార ధరలు కిందటి నెలలో 48.75 శాతం, పప్పు ధాన్యాల ధరలు 31.40 శాతం హెచ్చాయి. అంతే కాకుండా, కొన్ని తయారు చేసిన సరకులు కూడా ఖరీదయ్యాయి. కాటన్‌ వస్త్రాలు 13.92 శాతం, రసాయనిక ఉత్పత్తులు 8.14 శాతం చొప్పున ప్రియమయ్యాయి. కాగా జనవరి ద్రవ్యోల్బణాన్ని ఇదివరకు అంచనా వేసిన 8.56 శాతం నుంచి తాజాగా 9.44 శాతానికి సవరించారు.

ఇక ఆహార ద్రవ్యోల్బణం ఈ నెల 3వ తేదీతో ముగిసిన వారానికి అంత క్రితం వారం నమోదైన 17.70 శాతం కన్నా కొద్దిగా తగ్గి, 17.22 శాతానికి పరిమితం అయింది. బంగాళదుంపలు, ఉల్లిపాయల ధరల్లో తగ్గుదల ఆహార ద్రవ్యోల్బణం దిగిరావడానికి ప్రధాన కారణం అయింది.

రిజర్వ్‌ బ్యాంకు గత ఆర్థిక సంవత్సరం ఆఖరుకు ద్రవ్యోల్బణం 8.5 శాతం వద్ద ఉండవచ్చని తలపోయగా, ఆ స్థాయిని ద్రవ్యోల్బణం మించిపోయి 10 శాతానికి సమీపించింది. ఈ నెల 20న ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్షను చేపట్టనుంది. ద్రవ్యోల్బణానికి కళ్లెం వేసే ఉద్దేశంతో అది తన రుణ రేట్లను పెంచవచ్చని, తద్వారా నగదు సరఫరాలను నియంత్రించే ప్రయత్నం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్‌బీఐ మంగళవారం నాటి ద్రవ్య విధాన సమీక్షలో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సుమన్‌ కె.బెరీ అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ రేట్లను పెంచగలదన్న భయాలు స్టాక్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌ను 180 పాయింట్లకు పైగా పతనం అయ్యేటట్లు చేసింది. అధిక వడ్డీ రేట్లు రుణాలకు గిరాకీని తగ్గించివేయవచ్చు; ఫలితంగా వినియోగదారులు తక్కువగా ఖర్చు పెడతారు. దీంతో వస్తువులకు డిమాండు తగ్గి, ధరలు దిగివచ్చే అవకాశం ఉంటుంది.

మరో రెండు నెలలు ద్రవ్యోల్బణం ఒత్తిడి: ప్రణబ్‌
గత నెలలో ద్రవ్యోల్బణం 10 శాతాన్ని తాకకపోయినప్పటికీ.. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఇదివరకు మాట్లాడుతూ, మార్చి నెలలో ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరినా తాను ఆశ్చర్యపోనని వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా ఆయనే గురువారం విలేకరలతో మాట్లాడుతూ ధరలపై ఒత్తిడులు మరో రెండు నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. 'ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిని తాకుతుందని అంతా భయపడ్డారు.. అది కొద్దిగానే పెరిగింది. కానీ ద్రవ్యోల్బణ ఒత్తిడి జూన్‌ వచ్చే వరకు కొనసాగుతుంద'న్నారు. రబీ కోతలు పూర్తి అయిన తరువాత ద్రవ్యోల్బణం నెమ్మదిస్తుందని, ఈసారి వర్షాలు బాగుండవచ్చని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని తెలిపారు. గోధుమలు, బంగాళదుంపలు, చెరకు, ఇంకా కొన్ని పప్పు ధాన్యాలకు చెందిన రబీ పంటల కోతలు మే నెల మధ్య నాటికల్లా పూర్తి కానున్నాయి. '9.9 శాతానికి, 10 శాతానికి పెద్ద తేడా ఏముంది? ఇది ప్రాథమిక సమాచారమే.. సవరించిన గణాంకాలు 10 శాతంగా తేలవచ్చు' అని క్రిసిల్‌ ప్రధాన ఆర్థికవేత్త డి.కె.జోషి వ్యాఖ్యానించారు.

4 నెలల కిందట సుమారు 20% ఆహార ద్రవ్యోల్బణం
గత డిసెంబరులో ఆహార ద్రవ్యోల్బణం దశాబ్దంలోనే అధిక స్థాయికి వెళ్లి, దాదాపు 20 శాతాన్ని తాకింది. ఆహార పదార్థాల అధిక ధరలు మొత్తంమీద ద్రవ్యోల్బణాన్ని సైతం పెంచివేశాయి. 2009 నవంబరులో మొత్తంమీద ద్రవ్యోల్బణం 4.78 శాతం మాత్రమే ఉండడం గమనార్హం.

నిర్దిష్ట చర్యల ప్రణాళిక ఏదీ?
అధిక ధరలకు ముఖ్యంగా తగినంత వర్షపాతం లోపించడమే కారణమని ప్రభుత్వం చెప్తోంది తప్ప ఆహార ద్రవ్యోల్బణ తీవ్రతను సడలించేందుకు కేంద్రం నిర్దిష్ట చర్యలను ఒకదాని వెంట మరొకటిగా తీసుకొన్న దాఖలాలు కనిపించడం లేదు.

ధరలకు ఇలా కళ్లెం వేయవచ్చు: ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి చేపట్టదగ్గ కొన్ని చర్యలపై పరిశీలకులు ఏమంటున్నారంటే..

ప్రభుత్వం వద్ద ఉన్న ఆహార నిల్వల్లో బియ్యం, గోధుమ నిల్వలు కూడా తగినన్ని ఉన్నాయి. వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా ఈ రెండింటి ధరలు దిగివచ్చేటట్లు చేయవచ్చు. వ్యవస్థలో చలామణి అవుతున్న అధిక ధనాన్ని అదుపు చేసే లక్ష్యంతో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచి అయినా సరే మార్కెట్‌లో నుంచి అదనపు సొమ్మును ఉపసంహరించే చొరవను తీసుకోవడం మరో మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.