మే 1 నుంచి అమల్లోకి
ముంబయి: కంపెనీలు పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)ను ముగించిన తరువాత స్టాక్ ఎక్స్ఛేంజిలలో నమోదు చేసుకోవలసిన (లిస్టింగ్) గడువును దాదాపుగా సగానికి మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' కుదించివేసింది. ఐపీఓ పూర్తి అయిన 12 రోజుల లోపల లిస్ట్ అవ్వాలని తెలిపింది. విధిగా పాటించవలసిన ఈ కొత్త నియమం మే ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ చర్య వల్ల మదుపుదారుల డబ్బు వేగంగా కదలి, ఇతర ఇష్యూల్లో పెట్టుబడి పెట్టడానికి వీలు ఏర్పడుతుంది. 'ఇపుడు ఉన్న పబ్లిక్ ఇష్యూ ప్రక్రియను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలనేదే మా ప్రయత్నం. పబ్లిక్ ఇష్యూ ముగింపునకు, నమోదుకు మధ్య వ్యవధిని ఇంతవరకు ఉన్న 22 రోజుల నుంచి 12 రోజులకు తగ్గించాలని ప్రతిపాదిస్తున్నాం' అని ఒక సర్క్యులర్‌లో సెబీ స్పష్టంచేసింది. మే ఒకటో తేదీన గాని, ఆ తరువాత గాని ప్రారంభం అయ్యే పబ్లిక్ ఇష్యూలకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. కాగా, డాటా ఎంట్రీలో కచ్చితత్వానికి, మదుపరుల సమస్యల పరిష్కారానికి లీడ్ మేనేజర్‌లు, లేదా వారి ఏజెంట్‌లు బాధ్యత తీసుకోవలసి ఉంటుందని తాజా సర్క్యులర్‌లో పేర్కొన్నారు.సెబీ నిర్ణయం, ఇష్యూల్లో పెట్టుబడి పెట్టడానికి డబ్బును అప్పు తెచ్చుకొన్న ఇన్వెస్టర్‌లకు అలాంటి రుణంపైన చెల్లించాల్సిన వడ్డీని మిగుల్చుకోనిచ్చేదిగా ఉంది.