Wednesday, April 7, 2010

ఎగుమతులకు ఎన్నో ఆటంకాలు

లైసెన్సులు, ధ్రువీకరణ పత్రాల్లో జాప్యం
వసతులు అవసరమంటున్న ఎగుమతిదారులు
పశ్చిమ కృష్ణా - న్యూస్‌టుడే
భారత్‌ నుంచి ఏటా 80,000- 1 లక్ష టన్నుల వరకు మామిడికాయలు విదేశాలకు ఎగుమతి అవుతాయి. వీటి విలువ సుమారు రూ.170 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఉంటుంది. అలాగే మామిడి గుజ్జు సుమారు 2 లక్షల టన్నులు ఎగుమతి అవుతుంటుంది. దీని విలువ సుమారు రూ.800 కోట్లు. ఈ లెక్కలన్నీ వినడానికి బాగానే ఉన్నా.. మన మామిడి రైతులకు మాత్రం మంచి ధర రావడం లేదు. ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి నేరుగా ఇతర రాష్ట్రాలకు వెళుతున్న మామిడి 500 టన్నుల లోపే. ఎగుమతులకు అవకాశాలు లేక తక్కువ ధరకే ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులకు అమ్ముకుంటూ సంతృప్తిపడుతున్నారు. రాష్ట్రం నుంచి గుజరాత్‌, ఢిల్లీ, మహారాష్ట్రలకు తరలించుకువెళుతున్న వ్యాపారులు అక్కడున్న వసతులను వినియోగించుకొని మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయోత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ చిన్న ప్రయత్నం చేస్తే మన రైతులే ఎగుమతిదారులుగా నిలుస్తారు. మంచి గిట్టుబాటు ధర పొందుతారు. రాష్ట్రాన్నే ఒక ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దవచ్చని అందులోని నిష్ణాతులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ అడ్డంకులు
* ఎగుమతులకు లైసెన్సు ఇచ్చే డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ కార్యాలయం అందుబాటులో లేదు. న్యూఢిల్లీలో ఉంది. ప్రాంతీయ కార్యాలయాన్నైనా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
* వ్యవసాయోత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (అపెడా) కార్యాలయం కూడా హైదరాబాద్‌లో ఉంది. దీని ప్రాంతీయ కార్యాలయం కూడా రైతులకు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
* ఎగుమతులకు సంబంధించి ఫైటో శానిటరీ సర్టిఫికెట్‌ కార్యాలయం రాజమండ్రిలో మాత్రమే ఉంది. అక్కడ నుంచి ధ్రువీకరణ పత్రం సకాలంలో అందడం లేదు. ఫైజాబాద్‌లో ఉన్న నేషనల్‌ ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ ఒక కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నారు.
* అమెరికాకు మామిడి ఎగుమతులు చేయాలంటే ఇరాడియేషన్‌ విధానంలో కాయలను శుభ్రం చేసి పంపాలి. ఇటువంటి ప్లాంట్‌ ఖరీదు రూ.3 కోట్లు మించి కాదని ఎగుమతిదారులు అంటున్నారు. దీనివల్ల వారం రోజుల పాటు నిల్వ ఉండే కాయ పక్షం రోజులు వరకు చెడిపోదు. ఎక్కువ రోజులు నిల్వ సౌకర్యం వల్ల కార్గో విమానాల్లో కాకుండా షిప్పుల ద్వారా తక్కువ ఖర్చుతో ఎగుమతి చేయవచ్చు. దీనివల్ల ధర తగ్గి విదేశాల్లోనూ మన కాయకు గిరాకీ ఏర్పడుతుంది. ప్రస్తుతం నాసిక్‌లోనూ, గుజరాత్‌లోనూ మాత్రమే ఈ కేంద్రం ఉండటంతో అక్కడి వ్యాపారులు ఆంధ్ర ప్రదేశ్‌లో కొనుగోలు చేసి ఆ కేంద్రాల్లో శుభ్రం చేసి పంపుతున్నారు. ఇటువంటి కేంద్రాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే ఇక్కడి రైతులే ఎగుమతిదారులవుతారని శ్రీ వెంకటేశ్వర ఎక్స్‌పోర్ట్సు యజమాని కొత్తపల్లి పూర్ణచంద్రశేఖరరావు అభిప్రాయపడ్డారు.
* జపాన్‌కు ఎగుమతి చేయాలంటే ప్రస్తుతం నూజివీడులో ఉన్న వేపర్‌ హీట్‌ ట్రీట్‌మెంటు ప్లాంటు ద్వారా శుభ్రపరచి పంపాలి. టన్నుకు రూ.8,000 ధర ఉందిక్కడ. సబ్సిడీ ఇస్తే కొంత మేర ఈ ప్లాంటును ఉపయోగించుకునే వీలుంటుందని రైతులు తెలిపారు.
* అమెరికా, జపాన్‌లకు ఎగుమతి కావాలంటే ముందుగా అక్కడి వ్యాపారులకు కొన్ని కాయలను నమూనాగా పంపాలి. వారు పరిశీలించి ధ్రువీకరణ పత్రం అందించేలోపు పంట సమయం దాటిపోతోంది. అక్కడి ఎగుమతిదారులను ముందుగా పిలిపించి తోటలను చూపిస్తే ఇక్కడే ఒప్పందాలు చేసుకుంటారు. ఇందుకు అపెడా, మార్కెటింగ్‌ సంస్థలు కృషి చేయాలి.

కృష్ణా జిల్లా నుంచి ఏటా 500 టన్నులు ఎగుమతి లక్ష్యంగా ఉన్నప్పటికీ గత ఏడాది 81 టన్నులే వెళ్లింది. చిత్తూరు జిల్లా నుంచి 300 టన్నుల లోపే ఎగుమతి అయింది. మలేషియా, సింగపూర్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక తదితర ప్రాంతాలకు పరిమితంగా వెళుతోంది. సౌకర్యాలను కల్పిస్తే మన మామిడి అంతర్జాతీయ గిరాకీకి తిరుగుండదు.

ఢిల్లీకి పండ్ల రారాజు..
హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: పిల్లా పెద్దా అందరినీ తన మధురమైన రుచితో కట్టి పడేసేది మామిడి పండు.. కృష్ణా జిల్లాలో అధికంగా పండించే ఈ మధుర ఫలాల రవాణాను నూజివీడు నుంచి న్యూఢిల్లీకి మంగళవారం ప్రారంభించారు. మొట్టమొదటగా 42 రైల్వే వ్యాగన్‌లతో కూడిన ర్యాక్‌ ఇక్కడి నుంచి ఢిల్లీలోని ఆదర్శనగర్‌ (నయా ఆజాద్‌పూర్‌)కు బయలుదేరివెళ్లింది. మొత్తం 1176 టన్నుల బంగినపల్లి రకాన్ని అట్టపెట్టెల్లో ప్యాక్‌ చేసి ఇందులో తరలించారు.