
ఆహార ధాన్యాల ఉత్పత్తి 152.93 లక్షల టన్నులు
20.69 లక్షల టన్నుల తగ్గుదల నిరుటితో పోలిస్తే
51.28 లక్షల టన్నులు తక్కువ
అర్థగణాంక శాఖ మూడో ముందస్తు అంచనాలు
హైదరాబాద్ - న్యూస్‌టుడే
ఈ ఏడాది రాష్ట్రంలో ఆహారధాన్యాల ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. ఖరీఫ్, రబీ కాలాలు రెండూ రైతులకు ప్రతికూలంగా మారడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఆలస్యంగా వచ్చిన వర్షాలు, ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు, చాలా ప్రాంతాల్లో కరవు పరిస్థితులు కర్షకుల ఆశలపై నీళ్లు చిమ్మాయి. దిగుబడులను హరించేశాయి. దీంతో గడచిన ఐదేళ్లుగా వ్యవసాయ ఉత్పత్తుల్లో కనిపించిన వృద్ధి ఈ ఏడాది తిరోగమనం పట్టింది. రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి ఆహార ధాన్యాల సాధారణ ఉత్పత్తి 173.62 లక్షల టన్నులు. ఈ ఏడాది ఇది దాదాపు 152.93 లక్షల టన్నులుగా ఉండవచ్చని అర్థగణాంక శాఖ అంచనా వేసింది. గత సంవత్సరం ఆహార ధాన్యాల ఉత్పత్తి 204.21 లక్షల టన్నులుగా ఉంది. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, కందులు, మినుములు, పెసలు, శనగలు, ఉలవలు, అలసందలను ఆహార ధాన్యాలుగా వ్యవహరిస్తారు.
అర్థ గణాంక శాఖ ప్రతి ఏటా అక్టోబరు, జనవరి, ఏప్రిల్ మాసాల్లో వ్యవసాయ ఉత్పత్తుల ముందస్తు అంచనాలను రూపొందిస్తుంటుంది. జూన్ నెలలో తుది అంచనాలను తయారు చేస్తుంది. సాధారణంగా ఏప్రిల్ నెలలో రూపొందించిన మూడో ముందస్తు అంచనాలు దాదాపు తుది అంచనాలకు దగ్గరగా ఉంటాయి.
అర్థగణాంక శాఖ అంచనాలు
వరి.. బేజారు: ఈ ఏడాది 33.52 లక్షల హెక్టార్లలో వరిసాగు చేయగా 106.50 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతాయని అంచనా కొచ్చింది. సాధారణ సాగు విస్తీర్ణం 38.84 లక్షల హెక్టార్లు కాగా ఉత్పత్తి 121.48 లక్షల టన్నులు. ఈ మేరకు 14.98 లక్షల టన్నుల ఉత్పత్తి తగ్గింది. నిరుటితో పోలిస్తే 35.91 లక్షల టన్నులు తగ్గిపోయింది. ఇది దాదాపు రూ.3700 కోట్ల ఉత్పత్తి నష్టం.
జారిన నూనె గింజలు: వేరుసెనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమలు, తదితరాలను నూనెగింజలుగా పరిగణిస్తారు. వీటి సాధారణ సాగు విస్తీర్ణం 26.77 లక్షల హెక్టార్లు. ఉత్పత్తి 21.48 లక్షల టన్నులు.ఈ ఏడాది వీటి సాగు విస్తీర్ణం భారీగా తగ్గి 14.53 లక్షల హెక్టార్లకు పడిపోయింది. దీంతో ఉత్పత్తి 15.28 లక్షల టన్నులు మాత్రమే అయింది. గతేడాది నూనెగింజల ఉత్పత్తి 20.57 లక్షల టన్నులు.
