
కొత్త చట్టంపై సందేహాలు
వ్యవస్థీకృత రుణాలతోనే కళ్లెం
ఈ కోణంలో కేంద్రం తాజా అధ్యయనం
హైదరాబాద్ - న్యూస్‌టుడే
రిజర్వు బ్యాంకు 2007 సర్వే ప్రకారం... రాష్ట్రంలో రైతులు తీసుకెళ్లే వ్యవసాయ రుణాలు వెయ్యి రూపాయిలనుకుంటే అందులో రూ.534 ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచే వెళ్తోంది. బ్యాంకులు అందజేసేది కేవలం రూ.200 మాత్రమే. సహకార సంఘాలు రూ.104 ఇస్తున్నాయి. మిగతాదంతా బంధువులు, మిత్రులు, వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారులు తదితరులు ఇస్తున్నారు. వడ్డీ వ్యాపారులపై ఇంతగా ఆధారపడటంవల్లే వారు అధిక వడ్డీలను గుంజుతున్నారు. వారిని అదుపులో పెట్టేందుకంటూ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా 'వడ్డీ వ్యాపారులు, గుర్తింపు పొందిన రుణ మంజూరీదార్ల చట్టం' అమల్లోకి తెస్తోంది. కొత్త చట్టంలోని ముఖ్యాంశాలివీ
*వడ్డీ వ్యాపారులు ఇక లైసెన్సులకు బదులు తమ పేరును నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్టరు కాని వ్యాపారులెవరూ అప్పులను ఇవ్వడానికి సాధ్యంకాదు. ప్రతి వ్యాపారి నగదు పుస్తకాన్ని, ఇతర ఖాతా పుస్తకాలు నిర్వహించాలి.
*వ్యాపారులు గరిష్ఠంగా ఎంత వడ్డీని వసూలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంది. అసలును వడ్డీ మించకూడదు.
*వడ్డీ వ్యాపారులతో పాటు బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని వాటిని తిరిగి అప్పులుగా ఇచ్చేవారూ ఈ చట్ట పరిధిలోకి వస్తారు.
*ఎరువులు, క్రిమి సంహారక మందులను అప్పుగా ఇచ్చి వడ్డీ రాబట్టే వ్యాపారులకూ ఈ చట్టం వర్తిస్తుంది.
కొత్త చట్టం కొందరికేనా...?
*రాష్ట్రంలో చాలామంది వడ్డీ వ్యాపారులు రుణ గ్రహీతలకు రాతపూర్వక పత్రాలివ్వకుండా అప్పుల్ని ఇస్తుంటారు. వారు రుణ గ్రహీతలతో సంతకాలు చేయించుకుని ఆయా పత్రాలను తమవద్ద భద్రపరచుకుంటారు. రిజిస్టరు అయి పక్కాగా పత్రాలద్వారా అప్పులను ఇచ్చే వ్యాపారులను మాత్రమే కొత్త చట్టం నియంత్రించగలుగుతుంది.
* రాష్ట్రంలో రైతులకు ఏడాదికి దాదాపుగా రూ.60వేల కోట్లదాకా రుణాలు అవసరమవుతాయని అంచనా. ఇందులో రూ.23,500 కోట్లనే బ్యాంకులు సమకూరుస్తున్నాయి. మిగతా రుణాల కోసం తప్పనిసరిగా రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. వీరంతా మోసపోతున్నవారే. బ్యాంకులు మొత్తం రూ.60వేల కోట్ల రుణాలను పంపిణీ చేయగలిగితే వడ్డీ బాధ తప్పుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు జరిగితే మేలు జరుగుతుంది తప్ప వడ్డీ వ్యాపారులను నియంత్రణద్వారా సాధించేది చాలా స్వల్పమే. ఇక బ్యాంకులు వడ్డీ వ్యాపారుల మాదిరిగా ఎప్పుడంటే అప్పుడు రుణాలు ఇవ్వవు. ఇదీ రైతులకు సమస్యగానే ఉంది. రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడానికి ఇదీ కారణమే.
* రాష్ట్రంలోని సాగుదారుల్లో 25శాతంపైగా (దాదాపుగా 25లక్షల మంది) కౌలు రైతులు ఉండగా వారికి బ్యాంకు రుణాలను అందజేసే ఏర్పాట్లను ప్రభుత్వం చేపట్టలేకపోతోంది. ఇటువంటి వారంతా వడ్డీ వ్యాపారులపైనే ఆధారపడుతున్నారు. రిజిస్టరు అయిన వ్యాపారి నుంచి కౌలుదారు అప్పును తీసుకెళ్తేనే వడ్డీపై నియంత్రణ సాధ్యమవుతుంది.
* ఎకరానికి కనీసం రూ.10వేలు రుణం అవసరమనుకుంటే కౌలుదార్లకు మొత్తం రూ.7,500 కోట్లు అవసరం. 2009-10లో రెండు పంటలకు కలిపి వారికి ఇచ్చింది కేవలం రూ.152 కోట్లు. మిగతా మొత్తమంతా వారు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి తెచ్చుకున్నారు. కౌలుదారుల చట్టాన్ని మార్చి భూ యజమానుల హక్కులకు భంగం కలగదని భరోసా ఇచ్చి కౌలుదారులకు వ్యవస్థీకృత రుణాలు ఇప్పించగలిగితే మేలు జరుగుతుంది. అప్పటిదాకా వడ్డీ నియంత్రణ చట్టం పెద్దగా ప్రయోజనం చేకూర్చదు.
* కేంద్ర ప్రభుత్వం ఇటీవల నాబార్డు ఛైర్మన్ సారంగి నేతృత్వంలో ఒక టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేసింది. ఇది జూన్ నెలాఖరుకల్లా కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. సన్న, చిన్నకారు రైతులకు, కౌలుదార్లకు వ్యవస్థీకృత రుణ మొత్తాలను పెంచకుండా వడ్డీ వ్యాపారుల నియంత్రణ సాధ్యం కాదని సారంగి ఇటీవల ఒక సందర్భంలో పేర్కొన్నారు.
సూక్ష్మరుణ సంస్థల మాటేమిటి?
రాష్ట్రంలో సూక్ష్మ రుణ (మైక్రో ఫైనాన్సు) సంస్థల ఆగడాలు చాలా ఎక్కువ. దాదాపు నాలుగేళ్ల క్రితం కృష్ణా జిల్లాలో పలువురు ఆత్మహత్యలు చేసుకోగా ప్రభుత్వం దర్యాప్తు జరిపించి నిజమేనని తేల్చింది. ఆ తర్వాత కూడా అవి అధిక వడ్డీలతో ఘోరాలకు పాల్పడుతూనే ఉన్నాయి. ఈ చట్టం తమకు వర్తించదనేది ఆయా సంస్థల వాదన. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
దేశంలోనే మొదటి ప్రయోగం
రాష్ట్రం తేబోయే చట్టం రిజర్వు బ్యాంకు 2007లో రూపొందించిన ఆదర్శ బిల్లుకు అనుగుణంగా ఉంటుంది. ఇలా ఆర్‌బీఐ ఆదర్శ బిల్లును అనుసరించి చట్టాన్ని తెస్తున్న మొదటి రాష్ట్రం మనది. అందువల్ల ఈ చట్టం అమలు తీరు యావత్ దేశానికే ఒక ప్రయోగం అవుతుంది. వడ్డీ వ్యాపారులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న నాలుగు చట్టాల గురించి చాలామందికి తెలియదు. ఇటువంటి దశలో కొత్త చట్టం అమలు కత్తిమీద సామే. కొత్త చట్టం రాకతో పాత చట్టాలన్నీ రద్దవుతాయి.