Monday, April 19, 2010

మ్యూచువల్‌ ఫండ్‌ల ఆస్తుల్లో రూ.1.6 లక్షల కోట్ల క్షీణత

జోష్‌ తగ్గింది!
మ్యూచువల్‌ ఫండ్‌ల ఆస్తుల్లో రూ.1.6 లక్షల కోట్ల క్షీణత
కార్పొరేట్లు, బ్యాంకుల విక్రయాలు ్ద ఈనెలలోనూ కొనుగోళ్లు తక్కువే
ముంబయి: మ్యూచువల్‌ ఫండ్‌లు నిర్వహిస్తున్న ఆస్తుల్లో (ఏయూఎం) ఈ మార్చి ఆఖరుకు రూ. 1.6 లక్షల కోట్ల తగ్గుదల నమోదైంది. మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ మొత్తం విలువలో ఇది దాదాపు 20% అని చెప్పాలి. ముందస్తు పన్ను చెల్లింపుల కోసం కార్పొరేట్‌ సంస్థలు, రుణాలకు డిమాండ్‌ పెరిగి బ్యాంకులు నిధులు వెనక్కి తీసుకోవడమే (రిడెంప్షన్‌) ఇందుకు కారణం. ఇంత భారీ స్థాయిలో నిధులు బయటకు వెళ్లడం మాత్రం ఇదే ప్రథమం. పైగా ఏప్రిల్‌లోనూ ఆ నిధులు తిరిగి రావడం తక్కువగా ఉంది.

ఆర్థిక త్రైమాసికం ముగింపు నెలల్లో రిడెంప్షన్లు అధికంగా ఉండటం మ్యూచువల్‌ఫండ్‌ పరిశ్రమలో మామూలు విషయమే. షార్ట్‌టర్మ్‌ పెట్టుబడులను ప్రధానంగా అతి తక్కువ వ్యవధి డెట్‌ స్కీముల నుంచి కార్పొరేట్‌ సంస్థలు ఈ సమయంలో వెనక్కు మళ్లుతాయి. ద్రవ్య లభ్యత వంటి తమ బ్యాలన్స్‌ షీట్‌ అవసరాల కోసం బ్యాంకులూ ఇదే బాటన నడుస్తున్నాయి. మార్చిలో ఇది మరింత ఎక్కువగా ఉన్నా, ఏప్రిల్‌లో మళ్లీ నిధులు మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమకు తిరిగి వస్తాయి. గత కొన్ని ఆర్థిక త్రైమాసికాలను పరిశీలిస్తే ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఈసారి ఏప్రిల్‌లో పక్షం రోజులు గడిచినా నిధులు రావడం తక్కువగా ఉంది.

ఇవిగో కారణాలు: రుణాలకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. మార్చి ద్వితీయార్థంలోనే మొత్తం రూ.1.16 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి.

* ఫిబ్రవరిలో మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో బ్యాంకుల పెట్టుబడులు రూ.1.09 లక్షల కోట్లు ఉంటే, మార్చి ఆఖరుకు ఇవి దాదాపు సగానికి తగ్గి రూ.0.56 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి.

నెలవారీ లెక్కలు పరిశీలిస్తే..: మార్చి ఆఖరుకు మ్యూచువల్‌ ఫండ్‌ల ఏయూఎంలు 4.3% తగ్గి, రూ.7.49 లక్షల కోట్లకు చేరాయి. ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మ్యూచువల్‌ ఫండ్‌ల ఆస్తులు 50% పెరిగి, రూ.6.14 లక్షల కోట్లకు చేరాయి. అతి తక్కువ వ్యవధి గల ఇన్‌కం ఫండ్‌లలోకి వచ్చిన నిధులు, స్టాక్‌ మార్కెట్‌ పెరుగుదల వల్ల, ఈక్విటీ ఫండ్‌ల విలువ పెరగడం ఇందుకు కారణం.

* గోల్డ్‌ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌లకు మాత్రం ఏడాది కాలంగా డిమాండ్‌ నిలకడగా ఉంటోంది. వీటి ఏయూఎంల విలువ రూ.736 కోట్ల నుంచి రెట్టింపునకు పైగా (రూ.1590 కోట్లు) పెరిగింది.

బ్యాంకులంటేనే ఇష్టం
ఫిబ్రవరి గణాంకాల ప్రకారం ఈక్విటీ స్కీముల పోర్టిపోలియోలను అనుసరించి, మ్యూచువల్‌ ఫండ్‌లకు బ్యాంకులే అత్యంత ఇష్టమైనవని తేలుతోంది. ఫండ్‌ల ఆస్తుల్లో దాదాపు 14% బ్యాంకు షేర్లవే. ఐటీ రంగానికి 7% వాటా లభించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 4% వాటాతో అత్యధిక ప్రాచుర్యం ఉన్నదిగా గుర్తింపు నిలబెట్టుకుంది. ఐసీఐసీఐకి 3.8%, ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌కు 2.9% వాటా లభిస్తోంది.