Monday, April 19, 2010

బీఎస్‌ఎన్‌ఎల్‌ మిస్‌డ్‌ కాల్‌ !

బీఎస్‌ఎన్‌ఎల్‌ మిస్‌డ్‌ కాల్‌ !
తొలిసారి నష్టాల్లోకి!
పడిపోయిన మార్కెట్‌ వాటా
త్వరిత నిర్ణయాలు లేకే కష్టాలు
సర్కారుదే ఈ పాపమంతా
దూసుకుపోతున్న ప్రైవేటు కంపెనీలు
కంపెనీ కొన్నేళ్ల క్రితం వరకూ టెలికాం రంగంలో ఏకఛత్రాధిపత్యం కొనసాగించింది. పైగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ కూడా. ఆ తర్వాత క్రమంగా తన ప్రభను కోల్పోతూ ఇప్పుడు తొలిసారిగా నష్టాలను నమోదు చేసే స్థితికి వచ్చేసిందని విశ్లేషకులు అంటున్నారు. మరో పక్క మార్కెట్‌ వాటా సైతం సగానికి సగం తగ్గిపోయినట్లు స్వయానా ప్రభుత్వమే వెల్లడించింది. ఆ సంస్థే భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌). మరో పక్క ఉద్యోగ సంఘాలు 20న దేశవ్యాప్త సమ్మె చేపడుతోంది. ఇలాంటి కష్టాల నడుమ కంపెనీ ప్రైవేటు కంపెనీల పోటీని తట్టుకోవడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ద్యోగస్వామ్యం, ట్రేడ్‌ యూనియన్ల కారణంగా వ్యాపారకార్యకలాపాలను సరిగ్గా విస్తరించలేకపోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంస్థ ఖాతాల ప్రకారం మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.2,611 కోట్ల నష్టాన్ని పొందొచ్చని ఓ పత్రిక తన కథనంలో పేర్కొంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం కంపెనీ రూ.575 కోట్ల లాభం నమోదు చేసుకోవడం గమనార్హం. ఆదాయం సైతం 7.9% క్షీణించి రూ.32,966 కోట్లకు పరిమితం కావచ్చని తెలుస్తోంది. కాగా, సంస్థ ఇంకా అధికారికంగా ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. లాండ్‌లైన్‌ వ్యాపారాల సబ్సిడీ కింద ప్రభుత్వం నుంచి రూ.2,600 కోట్లను పొందుతున్నా కూడా నష్టం నమోదుకానుంది. అంతేకాదు బ్యాంకు డిపాజిట్ల వల్ల కంపెనీ మరో రూ.3,080 కోట్లు కూడా పొందుతోంది. అయినా నష్టాల కష్టాలు తప్పకపోవడం గమనార్హం.

అడ్డంకులెన్నో
'కంపెనీని ప్రభుత్వమే ఈ స్థాయికి తీసుకొచ్చింది. బోర్డునెపుడూ స్వతంత్రంగా వ్యవహరించడానికి అవకాశం ఇవ్వలేద'ని దువా కన్సల్టింగ్‌ సీనియర్‌ ప్రిన్సిపాల్‌, వీఎస్‌ఎన్‌ఎల్‌ మాజీ ఛైర్మన్‌ బి.కె. సింగాల్‌ అంటారు. 'సంచార్‌ భవన్‌ నుంచే బీఎస్‌ఎన్‌ఎల్‌ను నడుపుతున్నార'ని ఆయన పేర్కొనడం గమనార్హం.(సంచార్‌ భవన్‌లో టెలికాం శాఖ ఉంది). భారతీ ఎయిర్‌టెల్‌ వంటి ప్రైవేటు కంపెనీలు త్వరిత నిర్ణయాలతో దూసుకుపోతూంటే బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం వివిధ ఉద్యోగస్వామ్య స్థాయుల్లో ఎదురవుతున్న అడ్డంకుల మూలంగా వేగంగా విస్తరించలేకపోతోంది. దశాబ్ద కాలం కిందట దేశవ్యాప్త సేవలకు అనుమతి ఉన్న ఒకే ఒక కంపెనీ ఇది. అయితే విస్తరిస్తున్న మార్కెట్‌కు అనుగుణంగా సరైన సామగ్రిని మాత్రం కొనలేకపోతోంది. మరో పక్క ప్రైవేటు కంపెనీలు మాత్రం నెలకు లక్షల కొద్దీ వినియోగదార్లను కొత్తగా చేర్చుకుంటూ పోతున్నాయి. 2006లో జీఎస్‌ఎమ్‌ లైన్ల కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ వేసిన 6.3 కోట్ల లైన్ల కోసం వేసిన ప్రాథమిక టెండర్‌ కాస్తా టెలికాం మంత్రి రాజా జోక్యంతో 1.2 కోట్లకు పరిమితమైంది. దాని తర్వాత వచ్చిన 9.3 కోట్ల జీఎస్‌ఎమ్‌ లైన్ల టెండర్‌ సైతం వివాదాల కారణంగా రద్దు అయింది.

అమలుకాని పిట్రోడా సిఫారసులు: దీపక్‌ పరేఖ్‌, టెలికాం కార్యదర్శి పి.జె. థామస్‌ సభ్యులుగా పిట్రోడా కమిటీ బీఎస్‌ఎన్‌ఎల్‌ భవిష్యత్‌ కోసం చేసిన సిఫారసులు ప్రభుత్వం చెవికెక్కించుకోవడం లేదు. నిర్ణయాత్మక వాటా విక్రయం, 3 లక్షల మంది ఉద్యోగుల కోత, పబ్లిక్‌ ఇష్యూ ద్వారా 30 శాతం వాటా అమ్మకం వంటి సూచనలు చేశారు. ట్రేడ్‌ యూనియన్లు ఉద్యోగ కోతలు, వాటా విక్రయాల విషయంలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో కమిటీ సూచనలు కాగితానికే పరిమితమయ్యాయి.
సగానికి సగం తగ్గిన మార్కెట్‌ వాటా
మంత్రి రాజా
న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్‌ మార్కెట్‌ వాటాసగానికి సగం తగ్గిపోయింది. 2006-07లో ఉన్న 31.29 శాతం వాటా కాస్తా ఈ ఏడాది ఫిబ్రవరి 28 చివరి నాటికి 15.75 శాతానికి పరిమితమైందని ఇటీవలే ప్రభుత్వం పేర్కొంది. 'ల్యాండ్‌లైన్‌ వినియోగదార్లను అట్టిపెట్టిఉంచుకోవడానికి కంపెనీ అన్ని చర్యలూ తీసుకుంటోందని.. వాడకం పెంచడానికి విలువ జోడించిన సేవలను పెంచుతోంద'ని టెలికాం మంత్రి ఎ. రాజా చెబుతున్నారు. వైమాక్స్‌ సేవలను తీసుకొచ్చే ప్రయత్నాల్లో కంపెనీ ఉందని.. గ్రామీణ భారతానికి వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్రాండ్‌ సేవలను 2010-11 కల్లా తీసుకురావడానికి కృషి చేస్తోందని రాజా తెలిపారు.
ప్రస్తుతానికి ఇష్యూ లేనట్లేనా..!
కంపెనీ పునర్నిర్మాణం పూర్తయ్యేంత వరకూ పబ్లిక్‌ ఇష్యూ అంశాన్ని పక్కనబెడితే మంచిదని టెలికమ్యూనికేషన్ల విభాగం(డాట్‌) ప్రతిపాదించింది. బోర్డులో మార్పుచేర్పులు, భారత టెలికాం సర్వీసు ఆఫీసర్లను తీసుకోవడం వంటి పిట్రోడా ప్యానెల్‌ సూచనల అమలు తర్వాత ఆలోలించాలని అంటోంది. ఎందుకంటే ఆయా సిఫారసుల అమలు తర్వాత కంపెనీ ఎంటర్‌ప్రైజ్‌ విలువ పెరుగుతుంది. అపుడే వాటా విక్రయం ప్రభుత్వానికి తగిన ఆదాయం తేగలదని డాట్‌ భావిస్తోంది.