కుంభకోణం బయటపడ్డాక వెనక్కి తీసుకోవడం వూరట
అదృష్టవశాత్తు సత్యం ఆడిటింగ్ కుంభకోణం బయటపడి, ప్రభుత్వం భూకేటాయింపులను రద్దు చేయడంతో ఆ భూమి సురక్షితంగా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక దశలో ప్రైవేటు సంస్థలకు ఎంత అడ్డగోలుగా భూముల పందేరాలు జరిపిందో తెలుసుకోవడానికి సత్యం భూముల కేటాయింపులపై కాగ్ నివేదిక మంచి ఉదాహరణ.
కాపులుప్పాడలో పోలీసు విభాగానికి చెందిన 25 ఎకరాలు, వుడాకి చెందిన 25 ఎకరాలు కలిపి మొత్తం 50 ఎకరాల్ని సత్యం కంప్యూటర్స్‌కు 2008 డిసెంబరులో ప్రభుత్వం కేటాయించింది. భూమి విలువ రూ.4 కోట్లు పలుకుతోందని జిల్లా కలెక్టర్ నివేదిక కూడా ఇచ్చారు. సత్యంకు భూముల కేటాయింపుల రికార్డుల్ని కాగ్ 2009 ఫిబ్రవరిలో పరిశీలించి లోపాల్ని పసిగట్టింది. 50 ఎకరాల కేటాయించే ముందు ప్రభుత్వం ఎలాంటి దరఖాస్తులనూ ఆహ్వానించలేదు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న నిబంధనకు ఇది విరుద్ధమని కాగ్ తేల్చింది. సత్యంకు భూమి కేటాయింపు పారదర్శకంగా జరగలేదని స్పష్టం చేసింది. 2005 మార్చిలో ప్రకటించిన రాష్ట్ర 'ఐసీటీ' విధానానికి కూడా విరుద్ధమని తెలిపింది. ప్రతీ 100 ఉద్యోగాలకు 0.30 ఎకరాల భూమిని రాయితీపై (ఎకరం రూ.10 లక్షలు) ఇచ్చే అవకాశం ఉంది. సత్యం కంప్యూటర్స్ 7.5 ఎకరాల భూమి పొందడానికే అర్హురాలు. మిగతా 42.5 ఎకరాల్ని కూడా రూ.10 లక్షల రాయితీపై అందజేశారు. రూ.170 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు.
ఆ భూమి మాదగ్గరే ఉంది
సత్యం సంస్థకు కేటాయించిన భూములు ఆ సంస్థకు స్వాధీనం చేయలేదని భీమిలి ఎమ్మార్వో నారాయణ స్పష్టంచేశారు. ఆ భూములు ప్రస్తుతం ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయని 'న్యూస్‌టుడే'కి తెలిపారు. వీటిని ఎవరికీ స్వాధీనం చేయవద్దని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినట్టు వెల్లడించారు.