నిబంధనలకు నిలువునా పాతర
వైఎస్ సర్కారు నిర్వాకం
వేలెత్తిచూపిన కాగ్
* 2007-09 మధ్యకాలంలో ప్రచురణ ప్రారంభించిన రెండు పత్రికలను నిర్దేశిత ప్రమాణాలకు విరుద్ధంగా ప్రచురణ ప్రారంభించిన తేదీ నుంచి ఆరు నెలలు పూర్తికాకముందే ప్రకటనలు ఇచ్చే జాబితాలో చేర్చారు. రెండు పత్రికలు ప్రారంభమై ఆరు నెలలు తిరక్కముందే రూ.91.45 లక్షల విలువచేసే 16 ప్రకటనలను ఇచ్చారు.
* 2007 అక్టోబరు 22న ప్రారంభమైన సూర్యకు 2008 మార్చి నాటికి (5నెలల్లో) రూ.31.79 లక్షలు విలువ చేసే 9 ప్రకటనలు ఇచ్చారు.
* 2008 మార్చి 23వ తేదీన ప్రారంభమైన సాక్షికి అదే ఏడాది జూన్ నాటికి (మూడు నెలల్లో) రూ.59.66 లక్షల విలువచేసే 7 ప్రకటనలు ఇచ్చారు (రెండు పత్రికల పేర్లకు బదులు వాటి ప్రారంభ తేదీలను కాగ్ పేర్కొంది).
* సెప్టెంబరు నాటికి (ఆరు నెలల్లో) రూ.6.90 కోట్ల విలువైన ప్రకటనలు ఇవ్వడంవల్ల ఆరంభం నుంచీ సాక్షి పత్రిక అధిక సర్క్యులేషన్‌తో రాగలిగింది. ప్రకటనల జాబితాలోకి రాకముందే తమకు మద్దతు ఉంటుందన్న భరోసా ఆ పత్రికకు లభించింది. దీనివల్ల ఇతర పత్రికల వ్యాపారావకాశాలు దెబ్బతిన్నాయి.
* ప్రభుత్వ ఉత్తర్వుల (1989 మే) ప్రకారం చిన్నా, పెద్ద వార్తా పత్రికలకు వంతుల వారీ (రొటేషన్) పద్ధతిలో ప్రకటనలు విడుదల చేయాలి. కానీ ఈ పద్ధతిని పాటించలేదు. అత్యావశ్యకం అనే సాకును కొన్ని ఎంపికచేసిన పత్రికలకు ప్రయోజనం చేకూర్చారు.
* పత్రికలకు ప్రకటనలు ఇవ్వడంలో ఖర్చును నియంత్రించలేదు. 32 ప్రకటనల్లో 29 చోట్ల పొదుపును పాటించలేదు. తొమ్మిది పత్రికలకు పెద్ద సైజులో ప్రకటనలు ఇచ్చి ప్రయోజనం చేకూర్చారు. పెద్ద సైజు ప్రకటనలపై అయిన అదనపు వ్యయం రూ.10.41 కోట్లు.
* 2007-08లో జారీచేసిన 11 ప్రకటనలను, 08-09లో ఇచ్చిన 21 ప్రకటనలను వివిధ పత్రికల్లో కొన్ని ప్రముఖ భాగాల్లో ముద్రణ కోసం ఇచ్చారు. వీటికోసం అదనంగా రూ.23.61 కోట్లు వెచ్చించారు.
* ప్రభుత్వం, ప్రభుత్వ శాఖల విజయాల గురించి చెప్పుకుంటూ జారీ చేసిన ప్రకటనలపై ఖర్చు 2004-05లో రూ.18.75 కోట్లు. అదే 2007-08లో రూ.55.04 కోట్లు, 2008-09లో (జనవరివరకూ) రూ.81.07 కోట్లు ఖర్చు చేశారు.
* ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల వద్ద ప్రకటనల కోసం నిధులున్నాయా? లేవా? అని నిర్ధారించుకోకుండానే వాటి తరఫున నోడల్ సంస్థగా ఉన్న సమాచార, పౌర సంబంధాలశాఖ అడ్డగోలుగా ప్రకటనలు జారీ చేసింది. చివరకు ఆ ఖర్చును ప్రభుత్వమే భరించాల్సి వచ్చింది.