Thursday, April 1, 2010

ఇకపై కార్లకు కొత్త నిబంధనలు

బీఎస్‌-4 ప్రమాణాలుంటే ఓకే
ఇంకా అందుబాటులోకి రాని ఆ తరహా కార్లు
బీఎస్‌-3 వాహనాలకు ఇక చెల్లు
జంటనగర వాసులకు కొత్త కష్టాలు
ఇతర జిల్లాల్లో జులై నుంచి బీఎస్‌-2పై వేటు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: జంటనగరాల్లో మీరు కొత్త కారు కొనబోతున్నారా?.. అయితే ఒక్క క్షణం ఆగండి. మీరు కొనబోతున్న కారుకు బీఎస్‌-4 ప్రమాణాలున్నాయో లేదో తెలుసుకోండి. ఆ ప్రమాణాలు లేని కార్లను హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాల పరిధిలో ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి రవాణా శాఖ అధికారులు రిజిస్ట్రేషన్‌ చేయకూడదని నిర్ణయించారు.

ఎందుకిలా..: కాలుష్యాన్ని నిరోధించడానికి దేశంలోని 13 నగరాల్లో బీఎస్‌-4 కాలుష్య ప్రమాణాలతో కూడిన పెట్రోల్‌, డీజిల్‌ను మాత్రమే విక్రయించాలని చమురు కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. దీనివల్ల పెట్రోల్‌ లీటరుకు 40 పైసలు, డీజల్‌కు 29 పైసలు ధర పెరుగుతోంది. ఏప్రిల్‌ ఒకటి నుంచి ఈ అమ్మకాలు మొదలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన నగరాల్లో రాష్ట్ర రాజధాని కూడా ఉంది. ఇదే విధంగా బీఎస్‌-4 ప్రమాణాలున్న ఇంజన్లతో తయారైన వాహనాలను మాత్రమే ఈ నగరాల్లో వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది. దీనిలో భాగంగానే ఏప్రిల్‌ ఒకటి నుంచి ఆ ప్రమాణాలున్న వాహనాలనే రిజిస్ట్రేషన్‌ చేయాలని నిర్ణయించినట్లు రవాణా శాఖ కమిషనర్‌ రేమండ్‌ పీటర్‌ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. బీఎస్‌-3 ప్రమాణాల గల కార్ల రిజిస్ట్రేషన్‌ను హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లోని అయిదు ఆర్టీవో కార్యాలయాల పరిధిలో ఏప్రిల్‌ ఒకటి నుంచే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇక లారీల విషయంలోనూ ఈ ప్రమాణాలు అమలు చేయాలని చూస్తున్నారు. జాతీయ రహదారులపై వాటికి మినహాయింపు ఇచ్చి రాష్ట్రంలో తిరిగే లారీలకు బీఎస్‌-4 వర్తింపజేయాలని చూస్తున్నారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

ఇతర ప్రాంతాల్లో..: ప్రస్తుతం జంటనగరాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో బీఎస్‌-2 ప్రమాణాల వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. జులై నుంచి ఈ ప్రాంతాల్లో కేవలం బీఎస్‌-3 ప్రమాణాలున్న వాహనాలనే రిజిస్ట్రేషన్‌ చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. అంటే బీఎస్‌-2 ప్రమాణాల వాహనాల రిజిస్ట్రేషన్‌ అక్కడ నిలిచిపోతుంది.

కొనుగోళ్లపై ప్రభావం: చాలా కార్ల కంపెనీలు బీఎస్‌-4 ప్రమాణాలతో కూడిన మోడల్స్‌ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయడానికి జూన్‌ వరకు సమయమివ్వాలని కేంద్రాన్ని ఇప్పటికే కోరారు. ప్రస్తుతం చాలా వరకూ బీఎస్‌-3 ప్రమాణాలతో ఉండే కార్లే తయారవుతున్నాయి. యజమానుల విజ్ఞప్తికి కేంద్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విధంగా ఏప్రిల్‌ ఒకటి నుంచి రిజిస్ట్రేషన్‌ నిబంధనను అమలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. బీఎస్‌-4 ప్రమాణాలతో కూడిన మోడల్స్‌ వెంటనే దొరికే అవకాశం లేనందున జంటనగరాల్లో కొత్త కార్ల కొనుగోలు ప్రశ్నార్థకంగా మారింది.

'బీఎస్‌-4' ఎందుకంటే..: ఈ ప్రమాణం గల ఇంజన్లున్న వాహనాల వినియోగం వల్ల ప్రమాదకర కాలుష్యమైన సల్ఫర్‌ విడుదల శాతం బాగా తగ్గుతుంది. బీఎస్‌-3 ఇంజన్ల నుంచి సల్ఫర్‌ .005 పీపీఎం (పార్టికిల్స్‌ ఫర్‌ మిలియన్‌) విడుదలైతే బీఎస్‌4లో అది .001 పీపీఎంకు తగ్గుతుంది. దీని వల్ల ఆమ్లవర్షాలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. కాలుష్య వాయువుల్లో కాన్సర్‌ కారక మూలకాల శాతం కూడా పడిపోతుంది. దీనికి తగిన విధంగానే చమురు కంపెనీలు కూడా బీఎస్‌-4 ప్రమాణాలున్న ఇంధనాన్ని తయారు చేస్తున్నాయి. ఈ తరహా ఇంధన ఉత్పత్తి కోసం అవి రూ.32 వేల కోట్ల మేర వ్యయం చేశాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.