న్యూఢిల్లీ : అంతర్జాతీయ క్రూడాయిల్ మార్కెట్‌లో ఏర్పడే ఆటుపోట్లను తట్టుకునేందుకు ఇండియా 2011 అక్టోబర్ నాటికి తొలి వ్యూహాత్మక క్రూడాయిల్ నిల్వ ఏర్పాటు చేసుకోబోతోంది. దేశీయ క్రూడాయిల్ అవసరాల్లో 75 శాతం దిగుమతుల పైనే ఆధారపడుతున్న ఇండియా వ్యూహాత్మక నిల్వ ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో భాగంగా విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), మంగుళూరు, పడూర్‌లలో (కర్నాటక) 53.3 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం గల భూగర్భ స్టోరేజ్ వసతులు నిర్మించుకుంటోంది.
సరఫరాలపరంగా ఎలాంటి తారతమ్యాలు, ఆటుపోట్లు ఏర్పడినా 13 నుంచి 14 రోజుల దేశీయ అవసరాలను ఈ నిల్వ తీర్చగలుగుతుంది. విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న 13.3 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం గల స్టోరేజ్ వసతి 2011 అక్టోబర్ నాటికి పూర్తవుతుందని ప్రభుత్వ రంగంలోని ఇండియా స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ సిఇఒ రాజన్.కె.పిళ్ళై తెలిపారు.
ఈ స్టోరేజ్ వసతి పదంతస్తుల ఎత్తు, 3.3 కిలోమీటర్ల విస్తీర్ణంతో భూగర్భంలో నిర్మిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇది కాకుండా మంగుళూరులో 15.5 లక్షల టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న వసతి 2012 నవంబర్ నాటికి, మంగుళూరు సమీపంలోని పడూర్‌లో నిర్మిస్తున్న 25 లక్షల టన్నుల సామర్థ్యం గల వసతి 2012 డిసెంబర్ నాటికి పూర్తవుతాయని ఆయన వివరించారు.
ఈ వసతుల నిర్మాణానికి 2005 ధరల ప్రకారం 2397 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా అని, కాని అన్ని ముడి వస్తువులు, నిర్మాణ సామగ్రి ధరలు పెరిగినందు వల్ల ఇప్పుడు నిర్మాణ వ్యయం మూడు వేల కోట్ల రూపాయల వరకు అవుతుందని తాజా అంచనాలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇది స్టోరేజ్ వసతుల నిర్మాణానికి అయ్యే వ్యయం మాత్రమేనని, క్రూడాయిల్ కొనుగోలు బాధ్యతను ప్రభుత్వం చేపడుతుందని ఆయన చెప్పారు. ఈ నిల్వ ఏర్పాటు చేసుకోవడంతో ప్రపంచంలో వ్యూహాత్మక క్రూడాయిల్ నిల్వ కలిగి ఉన్న అమెరికా, జపాన్, చైనా వంటి దేశాల సరసన ఇండియా కూడా స్థానం సంపాదించుకుంటుంది.
సరఫరాల్లో వ్యత్యాసాలు ఏర్పడినప్పుడు మార్కెట్‌లోకి ఈ నిల్వల నుంచి క్రూడాయిల్ విడుదల చేయడమే కాకుండా అంతర్జాతీయ విపణిలో తక్కువ ధరలకు క్రూడాయిల్ అందుబాటులో ఉన్న సమయంలో కొనుగోలు చేసి నిల్వ చేసేందుకు కూడా వీటిని అమెరికా ఉపయోగించుకుంటోంది.