Friday, April 16, 2010

ఇన్ఫోసిస్ పోచారం సెజ్ రెడీ మే నుంచి వెయ్యి మంది ఉద్యోగులతో కార్యకలాపాలు!

హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగంలోని అగ్రశేణి సంస్థ ఇన్ఫోసిస్ ఐటి సెజ్ ప్రాజెక్టు సిద్ధమైంది. కంపెనీ రంగారెడ్డి జిల్లా పోచారం వద్ద 447 ఎకరాల్లో ఐటి సెజ్‌ను అభివృద్ధి చేస్తోన్న సంగతి తెలిసిందే. వెయ్యి మంది ఉద్యోగులకు సరిపడిన క్యాంపస్‌లో మే నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అయితే కంపెనీ అధికారికంగా ఐటి సెజ్ తొలి దశ ప్రాజెక్టును ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఐటి శాఖ వర్గాలు తెలిపాయి. తొలి దశలో కంపెనీ ఈసెజ్‌లో 600 నుంచి 750 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది.

పదేళ్ళ కాలంలో ఈ ప్రాజెక్టులో కంపెనీ మొత్తం 1250 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడంతోపాటు...మొత్తం మీద 25 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. తొలి దశలో పోచారం సెజ్‌లో కంపెనీ పది వేలమందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఇన్ఫోసిస్‌కు ఎకరా 12 లక్షల రూపాయల లెక్కన పోచారంలో 447 ఎకరాలు కేటాయించారు.

తొలుత ఈ కంపెనీకి రంగారెడి ్డజిల్లాలోని మామిడిపల్లిలో భూమి కేటాయించగా...ఇది ఎయిర్‌ఫన్నెల్ జోన్‌లో ఉండడటంతో కంపెనీ తనకు ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని ప్రభుత్వాన్ని కోరింది. దీంతో సర్కారు గృహ నిర్మాణ శాఖకు చెందిన భూమిని తీసుకుని ఇన్ఫోసిస్‌కు అప్పగించింది. తర్వాత కేంద్రం నుంచి సెజ్ అనుమతులు పొంది...పనులు ప్రారంభించింది.