Wednesday, April 7, 2010

రూ.27లక్షల కోట్ల 'మౌలిక' పెట్టుబడి అవకాశాలు

ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ వెల్లడి
ముందుకు రావాలని అమెరికా ఇన్వెస్టర్లకు పిలుపు
భారత్‌ సహకారం కావాలన్న గీత్‌నర్‌
న్యూఢిల్లీ: రానున్న అయిదు సంవత్సరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమానికి 600 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.27 లక్షల కోట్లు) వెచ్చించనున్నామని, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని అమెరికా ఇన్వెస్టర్లకు భారత్‌ పిలుపునిచ్చింది. మరో వైపు ప్రపంచంలో ఆర్థిక స్థిరత్వాన్ని తిరిగి నెలకొల్పడంలో భారత్‌ నుంచి మరింత ఎక్కువ సహకారం అవసరమని అమెరికా కోరింది. రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు విచ్చేసిన అమెరికా ఆర్థిక మంత్రి టిమోతీ గీత్‌నర్‌, మంగళవారమిక్కడ ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గీత్‌నర్‌, ప్రణబ్‌లిద్దరూ కలసి విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. 'ద ఇండియా-యూఎస్‌ ఫైనాన్షియల్‌ అండ్‌ ఎకనమిక్‌ పార్ట్‌నర్‌షిప్‌'ను ఏర్పాటు చేసినట్లు వారు ప్రకటించారు. భారత్‌లో ఓడరేవులు, కమ్యూనికేషన్‌లు, రహదారులు వంటివి అభివృద్ధి చేయడానికి విస్తృతమైన అవకాశాలున్నాయని ప్రణబ్‌ అన్నారు. ఫైనాన్షియల్‌ రంగం, మౌలిక సదుపాయాల రంగం తదితర అంశాల్లో అవగాహన, ద్వైపాక్షిక సహకారం పటిష్ఠం కావడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరింత సమతుల్యమైన ప్రపంచ ఆర్థిక వృద్ధి, స్థిరమైన అంతర్జాతీయ ఫైనాన్షియల్‌ వ్యవస్థలు సాధ్యపడాలంటే ఈ విధమైన సహకారం కీలకమని గీత్‌నర్‌ కూడా అభిప్రాయపడ్డారు. 'భారత్‌, అమెరికా.. ఈ రెండు దేశాల్లోనూ మరింత ఎక్కువ వాణిజ్యం, మరింత ఎక్కువ పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కోసం భారత్‌తో మా సంబంధాలను సుదృఢం చేసుకోవలసి ఉంది' అని ఆయన వ్యాఖ్యానించారు. అణు భద్రత శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మన్మోహన్‌ ఆదివారం అమెరికాకు వెళ్లాల్సి ఉంది. ఈ సమయంలో గీత్‌నర్‌ భారత్‌ సందర్శన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. (గీత్‌నర్‌ తన చిన్నతనంలో అయిదేళ్లపాటు న్యూఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్‌ కాలనీలో ఉన్నారు.) ఆర్థిక సంక్షోభాన్ని భారత్‌ బలంగా ఎదుర్కోగలిగిందని, అనేక బడా దేశాల కన్నా సమర్థంగా, శీఘ్రంగా బయటపడగలిగిందని గీత్‌నర్‌ కొనియాడారు. విధానపరమైన సంస్కరణలను గురించి, భారత్‌, అమెరికాల ఆర్థిక విధానాలు, ప్రభుత్వ- ప్రయివేటు భాగస్వామ్యం వంటి అంశాలపై సమావేశంలో దృష్టి సారించినట్లు ప్రణబ్‌ తెలియజేశారు.