Wednesday, April 7, 2010

ఆరోగ్య బీమా అందరికీ ఎన్నడో?

2% భారతీయులకే ఆ రక్షణ సదుపాయం
నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
భారత దేశంలో ఆరోగ్య బీమా పరిశ్రమ 2000వ సంవత్సరం నుంచి ప్రతి ఏటా 35 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేస్తోంది. 2015కల్లా ఈ వ్యాపారం స్థాయి దాదాపు రూ.28,000 కోట్లకు చేరుకొంటుందని భావిస్తున్నారు. అయినప్పటికీ ఇతర దేశాలతో పోల్చి చూసినపుడు మన దేశంలో ఆరోగ్య బీమా పరిధి ఇంకా తగినంతగా వ్యాప్తి చేందలేదనే చెప్పుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు, దేశంలో తలసరి ఆరోగ్య బీమా స్థాయి 1.1 డాలర్లు (సుమారు రూ.50.6) ఉన్నట్లు ఒక అంచనా. అదే అమెరికాలో అయితే 2,300 డాలర్లు (దాదాపు రూ. 1,05,800, బ్రెజిల్‌లో అయితే 63 డాలర్లు (రూ.2,898)గా ఉంది. బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏ) వద్ద 2007-08 సంవత్సరంలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం- ఆరోగ్య బీమా విభాగం స్థాయి రూ.5,125 కోట్లు. అయితే దేశ జనాభాలో ప్రతి వంద మందిలో ఇద్దరికి (2 శాతం) మాత్రమే ఆరోగ్య బీమా రక్షణ లభిస్తోంది. కాగా భారత దేశ జనాభా 120 కోట్లు అన్నది తెలిసిందే.

* 2000వ సంవత్సరంలో బీమా రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టి, ప్రయివేట్‌ రంగాన్ని అనుమతించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ వ్యాపారం శీఘ్రగతిన ఎదుగుతోంది. 2005లో మొత్తం సాధారణ బీమా ఆర్జనలో ఆరోగ్య బీమా రంగ వాటా పది శాతం ఉండగా, కేవలం నాలుగేళ్లలో.. 2009 వచ్చేసరికి .. 25 శాతానికి చేరుకొంది.
*దేశంలో ఆరోగ్య సంరక్షణకు ఖర్చు చేస్తున్న మొత్తంలో ఆరోగ్య బీమా వాటా 3 శాతం కన్నా తక్కువగా ఉంది. చైనాలో ఇది 5 శాతంగా ఉంది.
*ఆరోగ్య బీమా వ్యాపారం ఎదగడంలో కంపెనీల పాత్ర ఎంతగానో ఉంటోంది. (కంపెనీలు తమ ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాయి.) దేశంలో నమోదు అవుతున్న మొత్తం ఆరోగ్య బీమా ప్రీమియం ఆదాయంలో దాదాపు సగం వాటా కార్పొరేట్‌ విభాగానిది కాగా మిగతా వాటాలో ప్రభుత్వ, రిటైల్‌ విభాగాలు సమకూరుస్తున్నది చెరి సగం ఉంటోంది. కార్పొరేట్‌ బీమా ప్రీమియంల వ్యయం ఏటా పది శాతం చొప్పున పెరుగుతున్నా, కంపెనీలు తమ సిబ్బంది వేరే చోట్లకు వలస పోకుండా తమ కంపెనీలోనే అట్టిపెట్టుకోవాలన్న ఉద్దేశంతో అధిక బీమా వ్యయాన్ని భరించడానికి వెనుకాడడం లేదు.
* మన దేశంలో తలసరి ఆరోగ్య సంరక్షణ వ్యయం రూ.944. అదే అమెరికాలో రూ.1,20,000కు పైచిలుకుగా ఉంది.
*ప్రపంచంలో ప్రతి 1,000 మందికి సగటున నాలుగు పడకలు ఉంటే, భారత దేశంలో ఈ నిష్పత్తి కేవలం 1000: 0.7గా ఉంది.