Thursday, April 1, 2010

3జీ వేలానికి తొమ్మిది సంస్థలకు అర్హత

న్యూఢిల్లీ: 3జీ సేవల స్పెక్ట్రమ్‌ కోసం దరఖాస్తు చేసిన 9 సంస్థలూ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అర్హత పొందినట్లు ప్రభుత్వం తెలిపింది. వచ్చే నెల 9న నిర్వహించనున్న 3జీ వేలంలో పాల్గొనేందుకు ఎయిర్‌సెల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎతిసలాథ్‌, ఐడియాసెల్యులార్‌, రిలయన్స్‌, ఎస్‌ టెల్‌, టాటా టెలీసర్వీసెస్‌, వీడియోకాన్‌ టెలీకమ్యూనికేషన్స్‌, వొడాఫోన్‌ ఎస్సార్‌లు అర్హత సాధించినట్లుగా టెలికాం మంత్రిత్వ శాఖ(డీఓటీ) అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. 3జీ వేలం తరువాత జరగనున్న బ్రాడ్‌బ్యాండ్‌ వైరెలెస్‌ సేవల(బీడబ్ల్యూఏ) వేలానికి 11 టెలికాం సంస్థలు అర్హత పొందినట్లుగా కూడా డీఓటీ వివరించింది. ఇందులో ఎయిర్‌సెల్‌, అవ్‌గిగి, భారతీ ఎయిర్‌టెల్‌, ఐడియా సెల్యులార్‌, ఇన్ఫోటెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసెస్‌, క్వాలీకామ్‌, రిలయన్స్‌ వైమాక్స్‌, స్పైస్‌ ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌, టాటా కమ్యూనికేషన్స్‌ ఇంటర్‌నెట్‌ సర్వీసెస్‌, టికోనా డిజిటల్‌ నెట్‌వర్క్స్‌, వొడాఫోన్‌ ఎస్సార్‌ ఉన్నాయి. పంజాబ్‌, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్ము కాశ్మీర్‌ రాష్ట్రాల్లో ప్రభుత్వం 3జీ సేవల కోసం అయిదు ప్రైవేటు సంస్థల్ని అనుమతించనుంది. మిగతా 22 టెలికాం సర్కిళ్లలో మొత్తం మూడు ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.