రమేశ్‌కు సొంత మొబైల్ ఉంది. కంపెనీ మరొకటి ఇచ్చింది. రెండు ఫోన్లూ వెంట తీసుకెళ్లడం అతడికి కష్టమయ్యేది. ఇప్పుడా ఇబ్బంది తప్పింది. ఒక ఫోనే రెండు పనులూ చేసిపెడుతోంది. కారణం అతని చేతిలో డ్యూయల్ సిమ్ (రెండు సిమ్‌లు) హ్యాండ్‌సెట్ ఉండటమే. రమేశ్ ఒక్కడే కాదు.. ఇప్పుడు డ్యూయల్ సిమ్‌లవైపు మొగ్గుచూపే వారి సంఖ్య నానాటికీ ఎక్కువవుతోంది. కంపెనీలు సైతం వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా విభిన్న మోడళ్లతో మార్కెట్లోకి వస్తున్నాయి.
డ్యూయల్ సిమ్ ఫోన్లకు పెరుగుతున్న గిరాకీ
మొత్తం హ్యాండ్‌సెట్ల విక్రయాల్లో వీటి వాటా 18 శాతం
పోటీ పడనున్న ఎల్‌జీ, సోనీ, స్పైస్‌లు! ్ద మన రాష్ట్రమే అతిపెద్ద విపణి

కొత్త కంపెనీల సందడి
కొత్తగా మొబైల్ వాడకాన్ని ప్రారంభిస్తున్న వారితో పాటు అదనపు సౌకర్యాల కోసం కొత్త మొబైల్ ఫోన్లను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య ఆకర్షణీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది 12.5 కోట్ల హ్యాండ్ సెట్లు విక్రయం కాగలవని అంచనా. దేశీయ మొబైల్ విపణి మార్కెట్‌లోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇప్పటికే హ్యాండ్ సెట్లను విక్రయిస్తున్న నోకియా, శామ్‌సంగ్, ఎల్‌జీ వంటి పెద్ద కంపెనీలతోపాటు అనేక దేశీయ కంపెనీలు ఈ విపణిలోకి అడుగు పెడుతున్నాయి. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న డ్యూయల్ సిమ్ మొబైల్ హ్యాండ్‌సెట్లపై ఈ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. లెమన్, సెల్‌కాన్, లావా వంటి అనేక బ్రాండ్‌లు 5-10 వరకు డ్యూయల్ మొబైల్ ఫోన్లను విక్రయిస్తున్నాయి. వీటి ధర రూ.1500 నుంచి రూ.5,000 వరకు ఉంటోంది.
దిగ్గజాల వ్యూహం: మొబైల్ హ్యాండ్‌సెట్ల మార్కెట్‌లో అగ్రగామి కంపెనీ నోకియా పోటీని తట్టుకుని తన స్థానాన్ని కాపాడుకునేందుకు త్వరలో డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్లను విడుదల చేయాలని యోచిస్తోంది. మొబైల్ ఫోన్ల అమ్మకాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన శామ్‌సంగ్ ఇటీవల ప్రవేశపెట్టిన రెండు కొత్త మోడళ్లు సహా మొత్తం ఆరు డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్లను విక్రయిస్తోంది. ఈ ఏడాది మొత్తం 50 మోడళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్న ఈ కంపెనీ మరిన్ని డ్యూయల్ సిమ్ ఫోన్లను విడుదల చేయనుంది. తమ ఫోన్ల అమ్మకాల్లో 12-15 శాతం వరకు ఇవే ఉండగలవని శామ్‌సంగ్ ఇండియా డైరెక్టర్ (మొబైల్) రంజిత్ యాదవ్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. శామ్‌సంగ్ డ్యూయల్ సిమ్ హ్యాండ్ సెట్ల ధర రూ.4,620 నుంచి రూ.10,650 వరకు ఉంది. శామ్‌సంగ్ ప్రధాన పోటీదారు కంపెనీ ఎల్‌జీ సైతం హ్యాండ్ సెట్ల విపణిపై పటిష్ఠ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. దాదాపు ఏడాదిన్నర క్రితం హ్యాండ్‌సెట్ల విభాగంలోకి ప్రవేశించిన ఎల్‌జీ ప్రస్తుతం 28 మోడళ్లను విక్రయిస్తోంది. ఈ ఏడాది భారీగా కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) వై.వి.వర్మ తెలిపారు. వివరాలు వెల్లడించడానికి ఆయన ఇష్టపడకపోయినప్పటికీ.. డ్యూయల్ సిమ్ ఫోన్లపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. 2010లో కోటి మొబైల్ హ్యాండ్ సెట్లను విక్రయించాలని ఎల్‌జీ లక్ష్యంగా పెట్టుకుంది. సోనీ ఎరిక్‌సన్, స్పైస్ వంటి ఇతర ప్రధాన కంపెనీలు కూడా అకర్షణీయమైన డ్యూయల్ సిమ్ ఫోన్ల విపణిలో వాటాను చేజిక్కించుకోవాలని భావిస్తున్నాయి. ఇటీవలే 14 మోడళ్లతో వీడియోకాన్ కూడా హ్యాండ్‌సెట్ల విపణిలోకి అడుగు పెట్టింది.
నాలుగు కంపెనీల చేతుల్లోనే 90% వాటా: టెలికాం చందాదారుల వృద్ధిరేటు భవిష్యత్తులో కొనసాగడానికి 3జీ సేవలు ఊతం ఇవ్వనున్నాయి. మొబైల్ చందాదారుల సంఖ్య 54 కోట్లకు చేరినప్పటికీ.. ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం సేవలకు మంచి అవకాశాలు ఉన్నాయి. సౌకర్యాలు, సదుపాయాల కోసం పాత ఫోన్ల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేస్తున్నందున హ్యాండ్‌సెట్ల విపణిలోకి కొత్త కంపెనీలు ప్రవేశించినా అందరికీ అవకాశాలు లభించగలవని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ప్రస్తుతం దాదాపు 30 కంపెనీలు హ్యాండ్‌సెట్లను విక్రయిస్తున్నాయి. నోకియా, శామ్‌సంగ్, సోనీ ఎరిక్‌సన్, ఎల్‌జీ కంపెనీలకే అమ్మకాల్లో 90 శాతం వాటా ఉంది.