Wednesday, April 14, 2010

ఈ ఏడాది 30 వేల ఉద్యోగాలు

ఆఖరు త్రైమాసికంలో తగ్గిన లాభం
భవిష్యత్ అంచనాలు ఆశాజనకం
నగదు నిల్వలు 350 కోట్ల డాలర్లు

బెంగళూరు : ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ భవిష్యత్‌పై ఆశాజనకమైన అంచనాలతో ఉంది. ఈ ఏడాది కొత్తగా 30వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్టుగా ప్రకటించింది. ఇప్పటికే కంపెనీ ఉద్యోగుల సంఖ్య 1,13,796 కి చేరింది. ఇదిలా ఉండగా కంపెనీ 2009-10 ఆఖరు త్రైమాసికంలో 1,613 కోట్ల రూపాయల నికరలాభం సాధించింది.

గత ఏడాది ఇదే కాలంతో (1,613 కోట్ల రూపాయలు) పోలిస్తే నికర లాభం స్వల్పంగా (0.25 శాతం) మాత్రమే పెరిగింది. రాబడి మాత్రం 5.5 శాతం వృద్ధితో 5,635 కోట్ల రూపాయల నుంచి 5,944 కోట్ల రూపాయలకు చేరింది. వాస్తవానికి ఆఖరు త్రైమాసికం లాభంలో 48 కోట్ల రూపాయల అసాధారణ రాబడి (ఆన్‌లైన్ మొబైల్ సిస్టమ్స్‌లో వాటాల విక్రయం వల్ల లభించింది) కూడా కలిసి ఉంది.

దీనిని మినహాయించి చూస్తే ఆఖరు త్రైమాసిక నికర లాభం (1,569 కోట్ల రూపాయలు) దాదాపు 3 శాతం తరుగుదల ఉంటుంది. అయితే ఐటి రంగానికి పూర్తి స్థాయి గడ్డుకాలంగా చెప్పదగిన ఆర్థిక సంవత్సరంలోనూ మార్జిన్లను కాపాడుకున్నట్లు ఇన్ఫోసిస్ సిఇవో ఎండి గోపాలకృష్ణన్ తెలిపారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో వృద్ధి జోరుగా ఉంటుందని వెల్లడించారు.

అలరించిన అంచనాలు
ఇన్పోసిస్ 2009-10 పూర్తి సంవత్సరానికి సంస్థ 22,742 కోట్ల రూపాయల రాబడిపై 6,266 కోట్ల రూపాయల లాభాన్ని ప్రకటించింది. పూర్తి సంవత్సరానికి రాబడి, లాభంలో 5 శాతం వృద్ధి ఉంది. ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి కంపెనీ నగదు నిల్వల మొత్తం 350 కోట్ల డాలర్ల మేర ఉన్నాయి. ఫలితాల్లో గొప్ప ఆకర్షణ లేనప్పటికీ కొత్త ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫోసిస్ ప్రకటించిన అంచనాలు మాత్రం మార్కెట్‌ను అలరించాయి.

ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో జీతభత్యాల భారం, డాలర్ విలువలో ఆటుపోట్ల కారణంగా మార్జిన్లపై వత్తిడి ఉండే అవకాశం ఉన్నప్పటికీ, 2010-11లో రెండంకెల వృద్ధి రేటు ఖాయమని ఇన్ఫోసిస్ తెలిపింది. 2010-11లో స్థూల రాబడి 10-11 శాతం వృద్ధితో 24,796 -25,239 కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది.

తొలి త్రైమాసికంలోనే (2010 ఏప్రిల్-జూన్)లోనే రాబడి 9 శాతం వృద్ధితో 5,919-5,963 కోట్ల రూపాయలమధ్య ఉండవచ్చని అంచనావేసింది. మార్కెట్ డల్‌గా ఉన్నప్పటికీ ఇన్ఫోసిస్ భవిష్యత్ అంచనాల వల్ల ఐటి కంపెనీల షేర్లలో మాత్రం ఉత్సాహం కనిపించింది. ఇన్ఫోసిస్ షేరు ధర కూడా బిఎస్ఇలో 99 రూపాయల లాభంతో ముగిసింది.

15 రూపాయల డివిడెండ్
ప్రతి 5 రూపాయల ముఖ విలువగలషేరుకు 15 రూపాయల తుది డివిడెండ్‌ను ఇన్ఫోసిస్ బోర్డు ప్రతిపాదించింది. ఈ ఏడాది 30 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నట్టుగా తెలిపింది. ఇందులో 2,000 మంది విదేశీయులు కూడా ఉంటారు. ఆఖరు త్రైమాసికంలో కంపెనీ 9,313 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. ఉద్యోగాలు వదిలి వెళ్లిన వాళ్లను పరిగణలోకి తీసుకుంటే ఆఖరు త్రైమాసికంలో నికరంగా కల్పించిన ఉద్యోగాల సంఖ్య 3,914 అని ఇన్పోసిస్ తెలిపింది.