వాటిని గ్యారేజీలో పడేయడం మంచిది
'ఫోర్బ్స్, ఫార్చ్యూన్'లపై ఇంద్ర నూయి విసుర్లు
షికాగో: 'పెప్సికో' ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) ఇంద్ర నూయి ఓ తమాషా చేశారు. అంతర్జాతీయ ప్రముఖ పత్రికలు ఫోర్బ్స్, ఫార్చ్యూన్‌లు వెలువరించే జాబితాల్లో ఎప్పుడూ చోటు చేసుకొనే ఈమె, అలాంటి జాబితాలను గ్యారేజిలో పడేయడమే మంచిదని చమత్కరించారు. అలాంటి కిరీటాల వల్ల తనకు జరిగిన మేలు ఏమీ లేదని, ఆ జాబితాలు కేవలం ఆయా మ్యాగజైన్‌లను అమ్ముకోవడానికి ఒక ఆకర్షణగా పనికివస్తాయని ఆమె వ్యాఖ్యానించారు. ఇక్కడ జరిగిన ఒక ఎకనామిక్ క్లబ్ సమావేశానికి ఇంద్ర నూయి హాజరై, ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమెను ఫోర్బ్స్, ఫార్చ్యూన్‌ల వంటి ప్రచురణలు రూపొందించే జాబితాల్లో మీ పేరు తరచుగా వస్తూ ఉంటుంది కదా.. దీనిపై మీకేమనిపిస్తుంది? అని అడిగారు. నూయి జవాబిస్తూ, 'ఆ లిస్టులు పత్రికలను అమ్ముకోవడానికి ఒక మంచి మార్గం. కానీ, వ్యక్తిగతంగా మాత్రం అవి ఏమైనా మంచి చేస్తాయన్న దానిపైన నాకు నమ్మకం లేదు..' అన్నారు. అంతే కాదు, తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను గురించి కూడా ఆమె చెప్పుకొచ్చారు.. 2001లో తనను పెప్సికో ప్రెసిడెంట్‌గా నియమించినపుడు ఆ సంగతిని తన తల్లికి చెప్దామని ఇంటికి వెళ్తే ''నువ్వు ఇంట్లోకి అడుగుపెట్టావంటే నువ్వొక కూతురివి, కోడలివి, ఇల్లాలివి, తల్లివీ అని జ్ఞాపకం పెట్టుకో. మరొకసారి ఇల్లు చేరేసరికి నీ కిరీటాన్ని గ్యారేజిలో వదిలిపెట్టేసెయ్, తెలిసిందా..'' అని తన తల్లి సలహా ఇచ్చినట్లు నూయి వివరించారు. ఫోర్బ్స్ 2008, 2009ల్లో ప్రపంచంలో అత్యంత శక్తిమంతులైన 100 మంది జాబితాలో నూయికి మూడో స్థానం కట్టబెట్టింది. ఫార్చ్యూన్ 2006 నుంచి వరుసగా వ్యాపార రంగంలో అత్యంత శక్తిమంతులైన 100 మంది మహిళల జాబితాలో అగ్ర స్థానాన్ని నూయికే కేటాయించడం విశేషం.