ఫిబ్రవరి ఎగుమతుల్లో 35% వృద్ధి
న్యూఢిల్లీ: గత నవంబరులో ప్రారంభమైన ఎగుమతుల ప్రగతి పయనం వరుసగా నాలుగో నెలా సానుకూలంగానే కొనసాగింది. పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థలు పునరుత్తేజం పొందుతుండటంతో ఫిబ్రవరి నెల ఎగుమతులు 34.8 శాతం పెరిగి 16.09 బిలియన్ డాలర్లకు చేరాయి. కిందటేడాది ఇదే నెలలో వీటి విలువ 11.94 బి. డాలర్లు మాత్రమే. ఇక 2009 ఏప్రిల్- 2010 ఫిబ్రవరి కాలంలో ఎగుమతులు 11 శాతం క్షీణించి 172 బి. డాలర్ల నుంచి 153 బి. డాలర్లకు పతనయ్యాయి. గత నవంబరు వరకు ఎగమతుల లావాదేవీల్లో కొనసాగిన బలహీన ధోరణే ఇందుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలనిస్తూ ఫిబ్రవరిలో దిగుమతులు 66.1 శాతం ఎగబాకి 15.08 బి. డాలర్ల నుంచి 25.06 బి.డాలర్లకు ఎగిశాయి. ఇక ఏప్రిల్-ఫిబ్రవరి కాలంలో దిగుమతులూ నేలచూపులు చూడక తప్పలేదు.. అంతక్రితం ఏడాది ఇదే 11 నెలల కాలంతో పోల్చుకుంటే అవి 13.5 శాతం క్షీణించి 287 బి.డాలర్ల నుంచి 248 బి.డాలర్లకు తగ్గాయి. ఇంజినీరింగ్ వస్తువులు, వస్త్రాలు, జనుము, కార్పెట్లు, హస్తకళా వస్తువులు, లెదర్ రంగాల మందగమనం కొనసాగింది. అంతర్జాతీయ ఆర్థికమాంద్యం ప్రభావంతో 2008 అక్టోబరు నుంచి గత అక్టోబరు వరకు ఎగుమతులు కుదేలైన సంగతి తెలిసిందే.
వస్త్ర రంగానికి వరాలు
మరోవైపు వస్త్రాలు, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి రంగాలకు రూ.625 కోట్ల ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. వీటి ఉత్పత్తులకు పశ్చిమ దేశాల్లో గిరాకీ ఇంకా పూర్తిస్థాయిలో పుంజుకోకపోవడంతో సర్కారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఆనంద్ శర్మ బుధవారమిక్కడ వెల్లడించిన వివరాలివీ.. ' వస్త్రరంగానికి చెందిన దాదాపు 300 వస్తువులను ఆర్థిక ప్రోత్సాహకాల పరిధిలోకి రానున్నాయి. ఇది చేస్తున్న ఎగుమతుల విలువలో ఈ వస్తువుల వాటా 2 శాతం మేర ఉంటుంది. మార్కెట్ లింక్‌డ్ ఫోకస్ ప్రోడక్ట్(ఎమ్‌ఎల్‌ఎఫ్‌పీ) పథకం ఆధారంగా అమెరికా, ఐరోపా దేశాలకు చేసే వస్త్ర ఎగుమతులకు చేయూతను అందిస్తాం' అని ఆనంద్ శర్మ పేర్కొన్నారు. దుస్తుల రంగానికి ప్రకటించిన ఈ ప్రోత్సాహకాలు ఏప్రిల్ 1 నుంచి ఆరు నెలల పాటు కొనసాగొచ్చని అభిజ్ఞవర్గాల సమాచారం. ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయ రసాయనాలు-ఎరువుల విభాగాల్లోని మరో 200 ఉత్పత్తులనూ ఎమ్‌ఎల్‌ఎఫ్‌పీ పథకం పరిధిలోకి తెచ్చామన్నారు. తద్వారా వాటికి రూ.225 కోట్ల ప్రభుత్వ సాయం లభించనుంది. ప్రోత్సాహకాలపై చేసే వ్యయాలన్నింటినీ వాణిజ్య మంత్రిత్వ శాఖ భరించనుంది. విదేశీ మార్కెట్లలో గిరాకీ పడిపోవడంతో వస్త్ర ఉత్పత్తుల ఎగుమతులు గత జనవరిలో 14 శాతం కుంగి 862 మిలియన్ డాలర్లకు క్షీణించడం గమనార్హం. వాణిజ్య,పరిశ్రమల శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4,000 కోట్ల బడ్జెట్‌ను వెచ్చించనుంది.