పరిశ్రమల్లో వినియోగం
గత ఏడాది రూ.25 కోట్ల వ్యాపారం
2 వేల మందికి ఉపాధి

60 శాతానికి తగ్గిన దిగుబడి
మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఒడిషా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చింత పండుతుంది. ఈ ఏడాది పూత సమయంలో వర్షాభావ పరిస్థితుల వల్ల సాధారణ దిగుబడిలో 60 శాతమే ఉత్పత్తి అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా మడకశిర, కళ్యాణదుర్గం, రాయదుర్గం, చిత్తూరు జిల్లా పుంగనూరుల్లో పంటగా చింత సాగవుతోంది. విశాఖపట్నం, నల్లమల ప్రాంతాల్లో గిరిజనులు అడవుల నుంచి పండు సేకరిస్తారు.
డిమాండు భళా..
డిసెంబరులో చింత దిగుబడి ప్రారంభమై జూన్‌తో ముగుస్తుంది. ఈ కాలంలోనే చింత కాయలను కూలీలతో ఒలిపించి, గింజలు, గుజ్జు వేరు చేస్తారు. ప్రస్తుతం నాణ్యమైన కరిపులి రకం చింతపండు కిలో రూ.70- 80 ఉంటే, గింజలు కూడా కిలో రూ.6.25 పలుకుతున్నాయి. రెండేళ్ల క్రితం గింజ ధర కిలోకు రూ.3.50 ఉండేది. గత ఏడాది వస్త్ర పరిశ్రమ నుంచి వచ్చిన డిమాండ్ వల్ల కిలో రూ.5కు చేరింది, ఈసారి మరికొంత పెరిగింది. పరిశ్రమల్లో పప్పుగా మార్చి కిలో రూ.15 చొప్పున, పౌడరు అయితే కిలో రూ.17 చొప్పున విక్రయిస్తున్నారు. గింజను పప్పు/పౌడరుగా మార్చే పనుల్లో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనే 2,000 మంది ఉపాధి పొందుతున్నారు.
రాష్ట్రం నుంచి గత ఏడాది నెలకు 200 లారీల వరకు చింతగింజల పప్పు/పౌడర్‌ను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశారు. లారీకి పది టన్నుల సరకు పడుతుంది. క్వింటా పప్పు ధర రూ.1500 అయితే లారీ సరకు రూ.1.50 లక్షలు అవుతుంది. అదే పౌడర్‌కు వచ్చేసరికి క్వింటా ధర రూ.1700 ప్రకారం లారీ సరకు రూ.1.70 లక్షలు అవుతుంది. అంటే సీజను 7 నెలల్లో సుమారు రూ.25 కోట్ల మేర వ్యాపారం జరిగిందని అంచనా. ఈ ఏడాది నెలకు 50 లారీలు పంపడమే కష్టమవుతోందని అనంతపురం జిల్లా, అమరాపురానికి చెందిన వ్యాపారి శేఖర్ గుప్తా తెలిపారు. రాష్ట్రం నుంచి సూరత్, అహ్మదాబాద్ ప్రాంతాల్లోని వస్త్ర మిల్లులకు ఈ పౌడర్ అధికంగా ఎగుమతి అవుతోంది. రాజస్థాన్‌లో 'గ్వార్‌గమ్' పంట ద్వారా లభించే జిగురును వస్త్రమిల్లుల్లో వాడేవారు. గత ఏడాది ఆ పంట దెబ్బతినడంతో వస్త్ర మిల్లులు చింతపౌడరుపై ఆధారపడ్డాయి. ఈ ఏడాది మళ్లీ గ్వార్‌గమ్ బాగా లభించడంతో, చింత పౌడర్‌కు డిమాండ్ తగ్గిందనేది వ్యాపారవర్గాల సమాచారం. అయితే పౌడర్‌కు డిమాండ్ వస్తుందని ఎదురుచూస్తూ, సేకరించిన చింతగింజలను పరిశ్రమల్లో నిల్వ ఉంచుతున్నారు.