Tuesday, April 13, 2010

రూ.35 కోట్లు హాంఫట్‌

శనగల్ని బొక్కేసిన పందికొక్కులు
రాయితీపై సరఫరా చేసిన వాటిలో 50 శాతం దాకా స్వాహా
అధికారులు, చోటామోటా నేతల చేతివాటం
రంగంలోకి విజిలెన్స్‌ అధికారులు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
పందికొక్కులేమిటి... శనగలు తినడమేమిటి అని అనుకోకండి! తేరగా వస్తే... రాష్ట్రంలో అవినీతితో తెగబలిసిన పందికొక్కులకు శనగలేమిటి... ప్రజల సొమ్మును నొక్కేయడానికీ, బొక్కేయడానికీ ఏదైనా ఒకటే. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మరో విత్తన కుంభకోణం వెలుగుచూసింది. రాయితీపై రైతులకు సరఫరా చేసిన శనగలను బహిరంగ మార్కెట్లో విక్రయించి కొందరు అక్రమార్కులు రూ.35 కోట్ల మేరకు సొమ్ము చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకూ కేవలం వేరుసెనగ విత్తన పంపిణీలోనే అక్రమాలు చోటుచేసుకున్నాయని భావిస్తూ వచ్చిన ప్రభుత్వానికి దీంతో తలబొప్పి కట్టింది. శనగల సరఫరాలో అవినీతి చోటు చేసుకుందని వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు రావడంతో 'విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌' అధికారులు రంగంలోకి దిగి విచారిస్తే... విస్మయం కలిగించే వాస్తవాలు వెలుగు చూశాయి. రైతులకు సరఫరా చేసిన శనగల్లో సగానికిపైగా శనగ విత్తనాలను మండల వ్యవసాయ అధికారులు, ఆగ్రోస్‌ రైతు సేవాకేంద్రాలు, డీసీఎంఎస్‌లు, విత్తన సరఫరాదారులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, చోటామోటా రాజకీయ నేతలు స్వాహా చేసినట్లుగా విజిలెన్స్‌ విచారణలో తేలింది. విజిలెన్స్‌ అధికారులు ప్రస్తుతం అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో విచారణ నిర్వహిస్తున్నారు.

గడచిన రబీ సీజనులో రాష్ట్ర వ్యాప్తంగా 4.25 లక్షల టన్నుల శనగలను రూ.74.78 కోట్ల రాయితీతో ప్రభుత్వం రైతుల కోసం సరఫరా చేసింది. ఇందులో 50 శాతం శనగలను పక్కా ప్రణాళికతో ఎవరికీ అనుమానాలు రానిరీతిలో అక్రమార్కులు స్వాహా చేసేసినట్లు విజిలెన్స్‌ అధికారులు భావిస్తున్నారు. అడిగినవారికి లేదనకుండా సరఫరా చేసిన వ్యవసాయ శాఖ చివర్లో లెక్క చూసుకుంటే సరఫరా చేసిన శనగలకూ, సాగైన విస్తీర్ణానికి ఎక్కడా పొంతన కుదరలేదు. ప్రభుత్వ విధివిధానాల ప్రకారం ఎకరాకు 25 కిలోల చొప్పున శనగ విత్తనాన్ని సరఫరా చేయాల్సి ఉంది. సాధారణంగా సాగు చేసిన రైతుల్లో సగం మంది కూడా రాయితీ విత్తనాలను కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. అలాంటిది 95 శాతానికిపైగా విత్తనాలను రైతులు కొనుగోలు చేసినట్లు వినియోగ పత్రాలు సమర్పించడం అనుమానాలను రేకెత్తించింది.

సాగు లేదు... అయినా..!
ఎక్కువగా ప్రకాశం, అనంతపురం, కడప, కర్నూలు, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో శనగ విత్తనాలను బహిరంగ మార్కెట్‌లో విక్రయించినట్లు తెలిసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ ప్రాతినిధ్యం వహించిన పులివెందుల నియోజకవర్గంలో శనగసాగు లేకపోయినా విత్తనాలు ఇక్కడ కూడా సరఫరా అయ్యాయంటే అవినీతి ఏ మేరకు జరిగిందో ఊహించవచ్చు.

కీలకపాత్ర పోషించిన వ్యవసాయ అధికారులు
పంటల సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకుని మండల వ్యవసాయ అధికారి సిఫారసుల ఆధారంగా సంయుక్త సంచాలకులు రాయితీ విత్తనాలను కేటాయిస్తారు. శనగల విషయంలో సాగువిస్తీర్ణం ఉన్నా లేకపోయినా తమకు కేటాయించాలని ఎక్కువమంది మండల వ్యవసాయ అధికారులు కోరారు. ఇందుకోసం వారు లారీ శనగల కేటాయించినందుకు రూ.5 నుంచి 10 వేలకు పైగా ఉన్నతాధికారులకు సమర్పించుకున్నట్లు సమాచారం. కేటాయించిన శనగలను ఆగ్రోస్‌, డీసీఎంఎస్‌లు, సరఫరాదారులు కలిసి మండల వ్యవసాయ అధికారి సహకారంతో బహిరంగ మార్కెట్‌కు తరలించారు. ఒక్కో లారీ శనగలను (17.50 టన్నులు) బహిరంగ మార్కెట్‌లో విక్రయించడం ద్వారా అసలు పోను... దాదాపు రూ. లక్ష రూపాయలు వరకూ వారు జేబులో వేసుకున్నారు. ప్రభుత్వం పరిశీలించినా ఎక్కడా పట్టుపడకుండా రైతులకు కూపన్లు కూడా అందజేశారు.

ఇలా చేశారు...: బహిరంగ మార్కెట్‌లో శనగలు కిలో రూ.23- 24 ఉన్న దశలో ప్రభుత్వం వాటిని కిలోకి రూ.35 చొప్పున కొన్నది. దీన్లో 50 శాతం రాయితీ ఇచ్చి అంటే కిలో శనగలను రూ. 17.50లకే రైతుల కోసం సరఫరా చేసింది.

రైతులకు ఇచ్చిన రాయితీ ధరకే శనగలను సేకరించిన అక్రమార్కులు వాటిని బహిరంగ మార్కెట్లో రూ.21 నుంచి రూ.22 రూపాయలకు అమ్మేశారు. బస్తా రూ.2,100 నుంచి రూ.2,200 విక్రయించడం ద్వారా ఒక్కో లారీకి అసలు పోను... రూ. లక్ష వరకు సొమ్ము చేసుకున్నారు. దాదాపు రూ.35 కోట్లను అక్రమార్కులు తినేసి ఉండొచ్చని విజిలెన్స్‌ అధికారులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. విచారణ పూర్తిస్థాయిలో జరిగితే కానీ ఎవరెవరు... ఎంతెంత మేరకు తిన్నారన్న విషయాలు పూర్తిస్థాయిలో బహిర్గతం కావు. దాదాపు అన్ని జిల్లాల్లో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్‌ అధికారుల పరిశీలనలో తేలింది.

విస్తీర్ణం పెరిగిందంటున్న వ్యవసాయ శాఖ
రాష్ట్రంలో రబీలో శనగ సాధారణ సాగు విస్తీర్ణం 5.14 లక్షల హెక్టార్లుగా ఉంది. గడచిన రబీలో 7.29 లక్షల హెక్టార్లలో సాగు చేసినట్లుగా వ్యవసాయ శాఖ చెబుతోంది. కరవు, వరదల కారణంగా ఒకటికి రెండుసార్లు సాగు చేయాల్సి వచ్చిందంటున్నారు. అదే సమయంలో 6.55 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మాత్రమే శనగ సాగయినట్లు అర్థ గణాంక శాఖ పేర్కొనడం కొసమెరుపు. వాస్తవానికి కొన్ని జిల్లాల్లో కరవు కారణంగా పంట లేనందున ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేయడానికి ముందే సాగు పూర్తయింది.

అక్రమార్కుల గుర్తింపు సులువే
విత్తన రాయితీ స్వాహా చేసిన మండల వ్యవసాయ అధికారులు, ఆగ్రోస్‌, డీసీఎంఎస్‌, సరఫరాదారులపై చర్యలు తీసుకోవాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే అక్రమార్కులను గుర్తించడం సులువేనని రైతులు అంటున్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో శనగ సాగు విస్తీర్ణాన్ని కచ్చితంగా గుర్తిస్తే ఏ మేరకు అవినీతి జరిగిందో అంచనా వేయడం కష్టం కాదు.

ఏజన్సీల కోసమేనా?
రాయితీ శనగలను సరఫరా చేసేందుకు ఏపీసీడ్స్‌, మార్క్‌ఫెడ్‌, హాకా, నాఫెడ్‌ సంస్థలు (సరఫరా ఏజన్సీలు) టెండర్లు దాఖలు చేశాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.22-23 లుగా ఉన్నా వ్యవసాయశాఖ సేకరణ, ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌, రవాణా ఖర్చులు కలిపి కిలో రూ.35లతో సరఫరా చేయాలని కోరింది. కేవలం విత్తన సరఫరా ఏజన్సీలను బతికించేందుకే ప్రభుత్వం ఈ విధంగా చేస్తోందన్న విమర్శలు వినవస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కిలోకు రూ.4-5 తేడా ఉన్నపుడు కొనుగోలు చేయడానికి రైతులు పెద్దగా ముందుకురారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగ అభివృద్ధి పేరుతో వెచ్చిస్తున్న నిధులు విత్తన సరఫరా ఏజన్సీలను నిలబెట్టేందుకు కాకుండా రైతులను ఆదుకునేలా చూడాల్సిన అవసరం ఉంది.