Tuesday, April 13, 2010

ఖాళీలే..ఖాళీలు

ఈ ఏడాది 30వేల మంది
ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ
వచ్చే ఏడాదీ దాదాపు ఇదే సంఖ్యలో
ఎక్కడి సమస్యలు అక్కడే
తాత్కాలిక ఉద్యోగులతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
ప్రభుత్వ కొలువుల్లోని ఖాళీల సంఖ్య మరింతగా పెరగబోతోంది. ఉద్యోగుల్లో పలువురు పదవీ విరమణ వయస్సుకు (58 ఏళ్లు) దగ్గర పడ్డారు. ఈ ఏడాది దాదాపు 30 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయబోతున్నారు. వచ్చే ఏడాదీ దాదాపు ఇదే సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ చేస్తారు. ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో వివిధ పథకాలు, కార్యక్రమాలపై ఇప్పటికే తీవ్రస్థాయిలో ప్రభావం పడుతోంది. రానురాను ఈ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉన్నా... సమస్య తీవ్రతను సర్కారు గుర్తించటంలేదు. అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు మానవ వనరుల లోటును భర్తీచేయలేకపోతున్నారు. ప్రభుత్వం మాత్రం తాత్కాలిక ఉద్యోగులతోనే పోస్టులను నింపుతూ ఖాళీలను తక్కువగా చూపించే ప్రయత్నాలు చేస్తోంది.

ఉద్యోగులెలా పెరిగారు?
రాష్ట్రంలో ఏటా సాధారణంగా 20 వేల నుంచి 22 వేల మంది వరకు ఉద్యోగులు పదవీ విరమణ చేస్తుంటారు. ఈ ఏడాది మాత్రం ఆ సంఖ్య 30 వేలను దాటబోతోంది. గతంలో ఒకే సమయంలో నియామకాలు ఎక్కువగా జరగటం వల్లనే ఇలా ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో పదవీ విరమణలకు ఆస్కారం ఏర్పడింది. ఖాళీలకు ధీటుగా ఎప్పటికప్పుడు నియామకాల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టడంలేదు. పై స్థాయిలో ఏర్పడే ఖాళీలను.. దిగువ స్థాయిలోని వారికి పదోన్నతులను కల్పించటం ద్వారా భర్తీ చేస్తోంది. దిగువ స్థాయి పోస్టుల్లో కొన్నింటిని ఏకంగా రద్దు చేస్తోంది. మరికొన్నింటిని అలాగే ఖాళీగా విడిచిపెడుతోంది. కొన్ని చోట్ల అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించి ఖాళీల సంఖ్యను తక్కువగా చూపిస్తోంది. అందువల్ల ఉద్యోగుల సంఖ్యపై ప్రభుత్వం ఇచ్చే గణాంకాలు వాస్తవాలను ప్రతిబింబించటంలేదు. శాసనసభకు గత ఏడాది అందజేసిన ద్రవ్య విధాన పత్రంలో 2008, డిసెంబరు నాటికి ప్రభుత్వోద్యోగుల సంఖ్య 6.52 లక్షలుగా సర్కారు పేర్కొంది. తాజా ద్రవ్యవిధాన పత్రంలో 2009, డిసెంబరు నాటికి వారి సంఖ్య 7.94 లక్షలుగా చూపించింది. అంటే ప్రభుత్వ లెక్క ప్రకారం ఏడాది వ్యవధిలో ఉద్యోగులు 1.42 లక్షలు పెరిగారు. మరి ఏడాది కాలంలో నియామకాలు వేళ్లమీద లెక్కించే సంఖ్యలో ఉన్నప్పుడు ఇంతమంది ఉద్యోగులు ఎలా పెరిగారనేది ప్రశ్న. ఏ కార్యాలయానికి వెళ్లిచూసినా అనేక పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా తేటతెల్లమవుతుంది. పదవీ విరమణలు కారణంగా ఇక ముందు ఇటువంటి ఖాళీలు మరింతగా కనిపించనున్నాయి.

పాపం ఆర్థిక శాఖ!
శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డ చందంగా.. ఖాళీలను నింపటానికి చర్యలు చేపట్టాల్సిన ఆర్థిక శాఖలోనే భారీ సంఖ్యలో ఖాళీలు పేరుకుపోయాయి. బడ్జెట్‌ తయారీ, నిధులపై పర్యవేక్షణ అస్తవ్యస్థంగా ఉండటానికి ఈ ఖాళీలే కారణమని ఇటీవల తేలింది. సచివాలయంలోని ఆర్థికశాఖలో సహాయ సెక్షన్‌ అధికారి (ఏఎస్‌వో) పోస్టులు 70 ఖాళీగా ఉన్నాయి. జిల్లా ఖజానా కార్యాలయాల్లో 505 సీనియర్‌, జూనియర్‌ అకౌంటెంట్‌ క్యాడర్‌ పోస్టులు చాలా కాలంగా భర్తీకాకుండా ఉన్నాయి. హైదరాబాద్‌లోని పే అండ్‌ అకౌంట్స్‌ విభాగంలో ముఖ్యమైన ఆడిటర్‌ క్యాడర్‌లో 147 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖజానాశాఖలో ఈ ఏడాది 23 మంది గజిటెడ్‌ అధికారులు పదవీ విరమణ చేయబోతున్నారు.

ఇదీ ప్రభావం
* ఆర్థిక శాఖలోను, దాని అనుబంధ విభాగాలైన ఖజానా, పే అండ్‌ అకౌంట్స్‌ వంటి వాటిలోను అనేక ఖాళీలు పేరుకు పోవటం వల్ల అనేక అనర్ధాలు ఏర్పడుతున్నాయి. నడ్డి విరిచే పన్నులు, అప్పులతో భారీ బడ్జెట్లను ప్రవేశపెడుతున్నప్పటికీ అందులోని నిధుల పంపిణీని పర్యవేక్షించే యంత్రాంగం కొరవడింది. దీంతో నిధుల దుర్వినియోగానికి ఆస్కారం ఏర్పడుతోంది.

* వివిధ శాఖల్లో సిబ్బంది లేక పలు కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. చాలా చోట్ల.. పేరుకుపోతున్న దస్త్రాల్లోంచి ఏదైనా దస్త్రాన్ని బయటకు తీసి పైస్థాయి అధికారి వరకు దాన్ని పంపాలంటే ముడుపులు ముట్టజెప్పాల్సిందే.

* ప్రభుత్వం ఏదైనా చట్టాన్ని తేదలచుకొంటే దాని రూపకల్పనకు నిపుణులైన సిబ్బంది గతంలో ఉండేవారు. ఇటీవల కాలంలో చట్టాల తయారీ బాధ్యతలను సైతం కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించాల్సిన దుస్థితి నెలకొంది. భూభారతి చట్టం తయారీ బాధ్యతలను సర్వేశాఖ నాలుగేళ్ల కిందట ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించగా అదిప్పటికీ ఓ కొలిక్కిరానేలేదు.

* మండల రెవెన్యూ కార్యాలయాల్లో ధ్రువీకరణ పత్రాలను పొందాలంటే ప్రజలు అష్టకష్టాలు పడాల్సిందే.