Thursday, April 8, 2010

380 విభాగాల ఉద్యోగులకు ప్రత్యేక భత్యాలు

పీఆర్‌సీ సిఫార్సులపై 13 ఉత్తర్వులు
ఏప్రిల్‌1 నుంచి వర్తింపు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: తొమ్మిదో వేతన సవరణ సంఘం(పీఆర్‌సీ) సిఫార్సులకు అనుగుణంగా ఉత్తర్వుల జారీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఉద్యోగులకు వివిధ రకాల భత్యాలు, ఇతర చెల్లింపులకు సంబంధించి బుధవారం 13 ఉత్తర్వులను వెలువరించింది. ప్రత్యేక చెల్లింపుల(స్పెషల్‌పేస్‌) ఉత్తర్వులు వివిధ శాఖల్లోని 380 విభాగాల ఉద్యోగులకు వర్తిస్తాయి. మరికొందరు ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. ప్రత్యేక చెల్లింపుల్లో పెరుగుదల ఆయా ఉద్యోగుల స్థాయిని బట్టి నెలకు రూ.25 నుంచి రూ.100 వరకు ఉంది. ఇవి ఏప్రిల్‌ 1 నుంచి మాత్రమే వర్తిస్తాయి. మూలవేతనంలో ఫిబ్రవరి నుంచి పెరుగుదల ఉండనున్నప్పటికీ మిగతా భత్యాలు, ప్రత్యేక చెల్లింపులను ప్రభుత్వం ఏప్రిల్‌ 1కి పరిమితం చేసింది. తాజా ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలివీ..

* హైదరాబాద్‌లో పనులపై తిరిగే ఉద్యోగికి కిలో మీటర్‌కు రూ.1.5 చొప్పున ఒకవైపు ప్రయాణానికి గరిష్ఠంగా రూ.25. హైకోర్టు, కోర్టులకు పనిపై వచ్చే వారికి ఒక్కో విడతకు రూ.50 చొప్పున గరిష్ఠంగా నెలకు 20 విడతలకు రూ.వెయ్యి.

* కారు, మోటారు సైకిల్‌ గల వారికి ప్రయాణ భత్యం మూల వేతనంలో 20 శాతం. గరిష్ఠంగా రూ.850. సైకిల్‌కు రూ.200.

* రక్తనిధి కేంద్రాల్లోని స్టాఫ్‌ నర్సులకు నెలవారీ భత్యం ప్రస్తుత రూ.125 నుంచి రూ.150కు పెంపు. హైదరాబాద్‌ కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య పనులు చేసే కామాటీలు, మలేరియా ఫీల్డు వర్కర్లు, డ్రైనేజీ మజ్దూరులకు నెలకు రూ.125.

* కబేలాలో విధులు నిర్వర్తించే వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌కు భత్యం రూ.400 నుంచి రూ.500కు పెంపు. గ్రామాల్లో పెరుగుదల రూ.300.

* జాతీయ కుష్టు విద్యా కార్యక్రమం కింద పనిచేసే మెడికల్‌, పారా మెడికల్‌ సిబ్బందికి భత్యాల్లో రూ.50 వరకు పెరుగుదల.

* రాష్ట్రస్థాయి శిక్షణ సంస్థలైన ఎంసీహెచ్‌ఆర్‌డీ, పోలీస్‌ అకాడమీ, జ్యుడీషియల్‌ అకాడమీ, వాలంతరి సంస్థలకు డెప్యుటేషన్‌పై వచ్చే బోధకులకు వారి మూలవేతనంలో 20 శాతం, బోధనేతరులకు 5 శాతం భత్యం.

* సబ్‌ జైలు అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌కు భత్యం రూ.200.

* పురపాలక సంఘాల్లోని పారిశుద్ధ్య మేస్త్రి, సానిటరీ జవాన్‌కు పర్యవేక్షణ భత్యం నెలకు రూ.100.

* పోలీసు, ఇంజినీరింగ్‌, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్లు తదితర 36 శాఖల్లోని పలు విభాగాల ఉద్యోగులకు ప్రత్యేక చెల్లింపులు స్వల్పంగా పెంపు. ఇప్పటివరకు ఇలాంటి చెల్లింపులు వర్తించని కొన్ని విభాగాలను కూడా ఇప్పుడు చేర్చగా.. కొన్ని విభాగాలకు చెల్లింపులు రద్దు చేశారు. హైస్కూల్‌తో కలిసి ఉండే జూనియర్‌ కాలేజీలు ఇప్పుడు లేనందున ప్రిన్సిపాల్‌కు ఇప్పటివరకు ఇస్తూ వచ్చిన రూ.225 రద్దయ్యింది.

* నక్సల్స్‌ వ్యతిరేక స్క్వాడ్‌లోని సిబ్బందికి వారి మూలవేతనంలో 15 శాతం అదనంగా చెల్లింపు. వైద్య ఆరోగ్య శాఖలోని క్లినికల్‌, థియేటర్‌, గ్రామీణ, రాత్రి విధులు నిర్వర్తించే సిబ్బంది భత్యాల్లో స్పల్పంగా పెరుగుదల.