Thursday, April 8, 2010

మాకే పాపం తెలియదు

క్లయింట్లను మోసం చేయలేదు
మాంద్యం ముందు, తర్వాత ఎటువంటి తప్పూ చేయలేదు
ఆరోపణల నేపథ్యంలో గోల్డ్‌మాన్‌ శాచ్స్‌ వివరణ కంపెనీ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్‌) పెట్టిందనుకోండి.. అందులో ఏముంటుంది.. కంపెనీ తన కార్యకలాపాలు, భవిష్యత్‌ కార్యాచరణ గురించి వివరిస్తుంది. లేదా డివిడెండ్లు, బోనస్‌లు, ఆర్థిక ఫలితాల ప్రస్తావన ఉంటుంది.

కానీ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం గోల్డ్‌మాన్‌ శాచ్స్‌ మాత్రం వాటాదార్ల సమావేశంలో ఎప్పుడో 9 నెలల క్రితం ఓ పత్రికలో వెలువడ్డ కథనానికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అది కూడా సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ లాయిడ్‌ బ్లాంక్‌ఫీన్‌ సంతకం చేసిన ఎనిమిది పేజీల సుదీర్ఘ లేఖ కావడం విచిత్రం. అందులో క్లయింట్ల డబ్బులేమీ వాడుకోలేదంటూ పేర్కొంది. మాంద్యం ముందు, ఆ సమయంలోనూ, తర్వాత ఎప్పుడూ ఎలాంటి తప్పూ చేయలేదంటూ ఈ వాల్‌స్ట్రీట్‌ బ్యాంకు చెప్పుకొచ్చింది.
ఈ పరిస్థితులకు కారణం ఏమిటి? ఆ బ్యాంకు అంతలా భుజాలు తడుముకోవాల్సిన సంఘటనలు ఏం జరిగాయి..

అసలేం జరిగిందంటే
'మానవత్వం ముసుగేసుకున్న అతిపెద్ద దయ్యం.. 'అంటూ తొమ్మిది నెలల క్రితం రోలింగ్‌ స్టోన్‌ జర్నలిస్టు మాత్‌ తయిబీ రాసిన కథనానికి అప్పట్లో విశేష స్పందన లభించింది. ఆర్థిక మాంద్యం పరిస్థితులను అడ్డుపెట్టుకుని చాలా సార్లు కంపెనీ లాభాలను జేబులో వేసుకుందన్నది ఆ కథనం సారాంశం. దయ్యం మానవత్వం ముసుగేసుకున్నట్లు డబ్లులనే రక్తాన్ని పీల్చేసిందని అందులో తీవ్రమైన విమర్శలున్నాయి. అంతేకాదు గత దశాబ్దకాలంలో గృహాలకు ఎక్కడా లేని డిమాండు(హౌసింగ్‌ బూమ్‌)ను తీసుకొచ్చిందనీ.. మిలియన్ల డాలర్ల కొద్దీ గృహ రుణాలను నష్టభయం ఎక్కువగా ఉండే కొల్లేటరల్‌ డెట్‌ ఆబ్లిగేషన్స్‌(సీడీఓ)ల్లో పెట్టుబడులు పెట్టిందని అందులో ఉంది. ఈ సీడీఓలను గృహ సంక్షోభం సమయంలో భారీ నష్టాలను ఎదుర్కొంటున్న ఇతర బ్యాంకులు, పెట్టుబడుదార్లు, పెన్షన్‌ ఫండ్లకు విక్రయించిందని కథనం. 2007 వేసవికి ముందు అంటే సంక్షోభానికి ముందు ఈ విక్రయాల(షార్ట్‌ సెల్లింగ్‌) చేయడం ద్వారా భారీ లాభాలు ఆర్జించి పరోక్షంగా మాంద్యానికి కారణమైందని ఆ కథనం దుయ్యబట్టింది.

ఆరోపణల చిట్టాకు అంతు లేదు
అమెరికా ప్రభుత్వం సహాయ ప్యాకేజీని ప్రకటించిన సమయంలో అతిపెద్ద ప్రయోజం పొందింది గోల్డ్‌మాన్‌ శాక్సేనంటున్నారు. ఏఐజీ నుంచి బీమా కాంట్రాక్టులు పొందిన వివిధ సంస్థల్లో అధిక భాగం(12.9 బిలియన్‌ డాలర్లు) పొందింది ఈ సంస్థే కావడం గమనార్హం. అప్పటి ఆర్థిక మంత్రి హాంక్‌ పాల్సన్‌ 90 బిలియన్‌ డాలర్ల ప్రజాధనాన్ని వివిధ బ్యాంకులకు చెల్లించడంపై కూడా విమర్శకులు దుమ్మెత్తిపోశారు. ఎందుకంటే ఈయన అంతక్రితం గోల్డ్‌మాన్‌ శాక్స్‌లో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కావడం ఆపైన సంస్థకు ప్రధాన పోటీదారైన లేమన్‌ బ్రదర్స్‌ కుప్పకూలిన కొన్ని వారాల తర్వాత పాల్సన్‌ ఈ నిర్ణయం తీసుకోవడం వారికి అనుమానాలు తెప్పించింది.

కంపెనీ లేఖలో ఏం చెప్పింది
ఏఐజీ నుంచి తాను పొందిన 12.9 బిలియన్‌ డాలర్ల విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని ఆ లేఖలో వివరణ ఇచ్చుకుంది సంస్థ. బీమా దిగ్గజం ఏఐజీ కుదేలైనపుడు అమెరికా ప్రభుత్వం ఆ కంపెనీకి భారీ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తయిబీ చేసిన కొన్ని ఆరోపణలకుసవివరంగా జవాబిచ్చుకుంది. తన లేఖలో మొత్తం 56 సార్లు 'క్లయింట్లు' అన్న పదం వాడిన సంస్థ గృహ మార్కెట్లో షార్ట్‌ సెల్లింగ్‌ చేసిన విషయాన్ని అంగీకరిస్తూనే.. ఆ తర్వాత తనఖా ఉన్న షేర్లను తన క్లయింట్లకు ట్రేడింగ్‌ చేయడం కొనసాగించినట్లు చెప్పుకొచ్చింది. ఇది తప్పుకాదనీ.. ఒక్కో పెట్టుబడిదారు ఒక్కోలా ఆలోచిస్తాడనీ సమర్థించుకుంది.

'2007 తొలి అర్థభాగంలో గృహ మార్కెట్‌ భవితవ్యం గురించి మాకు నిజంగా ఏమీ తెలియదు. అసలు ఎవరికీ తెలియదు. మేం విక్రయించిన సెక్యూరిటీల విలువ పెరుగుతుందా.. లేదా తగ్గుతుందా అన్న విషయం మాకు తెలియదు. 2007 మొదట్లో గృహ మార్కెట్‌ క్షీణించిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే అది మరింత పతనమవుతుందన్న విషయం గోల్డ్‌మాన్‌ శాచ్స్‌తో సహా ఎవరికీ తెలియద'ని అందులో రాసింది.

స్వరూపమిదీ
రకం: ప్రభుత్వ సంస్థ స్థాపితం: 1869
వ్యవస్థాపకులు: మార్కస్‌ గోల్డ్‌మాన్‌
ప్రధాన కార్యాలయం: న్యూయార్క్‌(అమెరికా)
ఛైర్మన్‌, సీఈఓ: లాయిడ్‌ సి. బ్లాంక్‌పీన్‌
ఉత్పత్తులు: ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌, ప్రైమ్‌ బ్రోకరేజీ, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌, కమిర్షియల్‌ బ్యాంకింగ్‌ కమోడిటీస్‌
ఆదాయం: 45.173 బిలియన్‌ డాలర్లు(2009)
మొత్తం ఆస్తులు: 849 బిలియన్‌ డాలర్లు వెబ్‌సైట్‌: www.GS.com

కొసమెరుపు: స్వయనా న్యూయార్క్‌ మాజీ గవర్నర్‌ ఎలియన్‌ స్పిట్జర్‌ సైతం పాల్సన్‌ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఎలాంటి కారణమూ లేకుండానే ఏఐజీ నుంచి భారీ స్థాయిలో చెల్లింపులు జరిగాయని వీటివెనుక లోపాయకారీ పనులు చాలా ఉన్నాయని ఆయన గతేడాదే విమర్శించారు.