న్యూఢిల్లీ: 3జీ స్పెక్ట్రమ్ వేలం, బ్రాడ్ బ్యాండ్ వైర్‌లెస్ యాక్సెస్(బీడబ్ల్యూఏ) ద్వారా రూ.30,000-35,000 కోట్ల మేర సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 22 సర్కిళ్లలో వివిధ దశల్లో జరుగుతున్న ఈ వేలానికి తొలిరోజు అద్భుత స్పందన లభించింది. రిజర్వు ధర (దేశవ్యాప్త సేవలకు) రూ.3,500 కోట్ల కంటే 12 శాతం అధికంగా రూ.3,913.81 కోట్లు బిడ్ ధర పలికింది. టెలికమ్యూనికేషన్ల విభాగం(డాట్) వెబ్‌సైట్ సమాచారం ప్రకారం తొలిరోజున ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. 9 ప్రధాన కంపెనీలన్నీ వేలంలో పాల్గొన్నాయి. కాగా, ఈ వేలం పూర్తయేంత వరకూ ఆదివారాలు, జాతీయ సెలవుదినాల్లో తప్ప ప్రతీ రోజూ ఉదయం 9 గంటలకు మొదలై సాయంత్రం 7:30 వరకు కొనసాగుతుంది. ఆపరేటర్ల స్పందనను బట్టి మరో 10-12 రోజులు ఈ వేలం కొనసాగుతుందని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. ఆపరేటర్లు అమితాసక్తిని ప్రదర్శిస్తున్న కారణంగా రూ.40,000-45,000 కోట్ల సమీకరణ జరిగే అవకాశం ఉందని టెలికాం మంత్రి ఎ.రాజా ధీమా వ్యక్తం చేశారు.మొబైల్ ప్రపంచంలో ఒక విప్లవానికి శుక్రవారం తెరలేచింది. అధిక వేగంతో మొబైల్ సేవలనందించగల మూడో తరం(3జీ) రేడియో తరంగాల వేలం మొదలైంది. భారత్‌లో ఈ తరహా వేలం జరగడం ఇదే మొదటిసారి.
'3 జీ' వేలానికి తొలిరోజు అద్భుత స్పందన
రూ.45,000 కోట్ల సమీకరణ లక్ష్యం
సరైన ధర వచ్చేంత వరకూ కొనసాగింపు
ముందే పూర్తయినా కేటాయింపు సెప్టెంబరులోనే
సెప్టెంబరు 1 కల్లా సేవలు మొదలు!
ఇదీ తొలిరోజు స్పందన: ఢిల్లీ సర్కిల్‌లో అత్యధిక స్పందన లభించింది. అయిదో రౌండ్ ముగిసేసరికి రూ.320 రిజర్వు ధర కన్నా అధికంగా రూ.373.29 కోట్ల వద్ద వేలం ఆగింది. ఆంధ్రప్రదేశ్, ముంబయి, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల్లో రూ.362.66 కోట్లు పలగ్గా.. తొమ్మిది సర్కిళ్లలో ప్రతికూల డిమాండు కనిపించింది.
* భారత్‌లో మొత్తం 22 సర్కిళ్లు ఉండగా.. అందులో 17లో ప్రతీ సర్కిళ్లో మూడు స్లాట్ల వేలం జరుగుతుంది. మిగిలిన జోన్లలో మాత్రం నాలుగు స్లాట్ల వేలం ఉంటుంది. బ్రాడ్‌బ్యాండ్ వైర్‌లెస్(బీడబ్ల్యూఏ) కోసం ప్రతీ జోన్‌లో రెండు స్లాట్లు ఉంటాయి. వీటికీ వేలం ఉంటుంది. కానీ 3జీ వేలం అయిపోయిన రెండు రోజులకు దీన్ని ప్రారంభిస్తారు.
* ఇప్పటికే స్లాట్ల కేటాయింపు అయిపోయిన బీఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టీఎన్‌ఎల్‌లకు ఈ వేలం ఉండదు. ప్రతీ జోన్‌లో ఒక స్లాట్ చొప్పున వీటికి కేటాయించారు. ఆయా స్లాట్లలో అధిక బిడ్డర్ చెల్లించిన ధరనే ఈ కంపెనీలూ చెల్లిస్తాయి.
* 3జీ రేసులో ఆరు ప్రధాన ప్రైవేటు మొబైల్ ఆపరేటర్లు(భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ వైమాక్స్, వొడఫోన్, బీఎస్‌ఎన్‌ఎల్, టాటా టెలీ, ఐడియా)సహా మొత్తం 9 కంపెనీలు పోటీ పడుతున్నాయి. తొలి ఆరు ఆపరేటర్లకు అన్ని సర్కిళ్లలోనూ పాల్గొనే అర్హత ఉంది. కాగా, వీడియోకాన్, ఎస్ టెల్, ఎతిసలాట్‌లకు ఎంపిక చేసిన సర్కిళ్లలో మాత్రమే పాల్గొనడానికి అనుమతినిచ్చారు. కాగా, బీడబ్ల్యూఏ వేలంలో 11 బిడ్డర్లు పోటీపడుతున్నారు.
* అన్ని జోన్లకు కలిపి 3జీకి రూ.3,500 కోట్లు; బీడబ్ల్యూఏకు రూ.1,750 కోట్లుగా రిజర్వు ధరను ప్రభుత్వం నిర్ణయించింది.
* ఈ వేలం ద్వారా 7.9 బిలియన్ డాలర్ల(రూ.35,000 కోట్లు) ను సేకరించాలని నిర్ణయించింది.
* బిడ్‌లో గెలిచిన కంపెనీలు వేలం పూర్తయిన 10 రోజుల్లోగా నగదును జమ చేయాల్సి ఉంటుంది. వాణిజ్య ప్రాతిపదికన 3జీ సేవలు సెప్టెంబరు 1న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పూర్తి స్థాయి సేవలు మాత్రం 2010 చివర్లో కానీ 2011 మొదట్లో కానీ ప్రారంభమవ్వొచ్చు.
| * మొత్తం 22 సర్కిళ్లలో ఒకేసారి వేలం జరుగుతుంది. రిజర్వు ధరను పెంచడానికి బిడ్డర్లకు నియంత్రణ ఉండదు. ప్రతీ రౌండ్‌లో 10 శాతం నుంచి 1 శాతం దాకా ఇది పెరుగుతూ ఉంటుంది. ఒక సర్కిల్ నుంచి మరో సర్కిల్‌కు బిడ్డర్లు మారడానికి అవకాశం కూడా ఉంటుంది. * కేటాయించిన స్పెక్ట్రమ్ స్లాట్లతో బిడ్డర్ల సంఖ్య సమానమయ్యేంతవరకూ ధరను పెంచుకుంటూ పోతారు. * ప్రతీరోజూ వేలం సమయం పూర్తయిన తర్వాత 22 సర్కిళ్లలో అధిక బిడ్ ఎంత.. ఎంత మంది ఆపరేటర్లు రేసులో మిగిలి ఉన్నారన్న విషయాన్ని డాట్ తన వెబ్‌సైట్లో ఉంచుతుంది. * మొత్తం వేలం పూర్తికావడానికి నెలరోజుల వ్యవధిపట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని టెలికాం అధికారి ఒకరు పేర్కొన్నారు. |
| ఏడు సెకన్లలో పాట డౌన్‌లోడ్: దీనికున్న అధిక స్పీడు(7 ఎమ్‌బీపీఎస్) కారణంగా కేవలం ఏడు సెకన్లలో 3 నిమిషాల వ్యవధి ఉండే ఎమ్‌పీ3 పాటను డౌన్‌లోడ్ చేసుకోవడం. పూర్తి సినిమా ఫైల్స్‌ను, సైతం అధిక స్పీడుతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్: ఏ సమయంలోనైనా.. ఎక్కడైనా(కనెక్టివిటీ లభ్యమయ్యేచోటల్లా) అధిక స్పీడు గల ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. |
