Monday, April 12, 2010

ఖజానాకూ సొరంగం


ప్రాణహిత-చేవెళ్లలో 'డిజైన్‌' దోపిడీ..!
గుత్తేదార్ల లబ్ధి కోసం ఇంజినీర్ల మాయాజాలం
రూ.వందల కోట్ల అక్రమాలకు రంగం సిద్ధం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు.. ఇంజినీర్లు తల్చుకుంటే 'డిజైన్‌'లకు కొరతేముంటుంది? వాళ్లు తల్చుకోబట్టే ఇప్పుడు ప్రాణహిత-చేవెళ్ల సొరంగాలు.. ఉన్నట్టుండి పొట్టివైపోతున్నాయి. వాళ్ల కను సన్నల్లో రకరకాలుగా సన్నబడిపోతున్నాయి. అందరి ముందే 'పల్చనా' కాబోతున్నాయి. గుత్తేదారుల ప్రయోజనాలకు కొమ్ముకాసే ఇంజినీర్ల సమక్షంలో.. నానా రకాలుగా సాగిలపడుతున్నాయి. జలయజ్ఞం అవినీతిలో ఇది తాజా కోణం. చిన్నగా కనిపించే పెద్ద కుంభకోణం!

ప్రాణహిత-చేవెళ్లలో మరో భారీ దోపిడీకి తెరలేచింది. డిజైన్ల మాయాజాలంతో గుత్తేదార్లకు కోట్ల రూపాయల ప్రయోజనం చేకూర్చే కార్యక్రమానికి ఇంజినీర్లు శ్రీకారం చుట్టారు. సొరంగ మార్గాల పొడవు, వ్యాసం తగ్గించడంతో పాటు, సొరంగ మార్గాల కాంక్రీటు లైనింగ్‌ మందాన్ని కూడా తగ్గించడానికి రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు గుత్తేదార్ల నుంచి ఇంజినీర్లకు, ఇంజినీర్ల నుంచి డిజైన్స్‌ అధికారులకు ప్రతిపాదనలు చేరాయి. కొన్ని ప్యాకేజీలకు సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ నుంచి ఇప్పటికే ఆమోదం కూడా లభించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

అంచనాల పెంపుతో ఆరంభం!
ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకానికి 2007 మేలో ప్రభుత్వం రూ.17,875 కోట్లతో పరిపాలనా అనుమతిచ్చింది. అనంతరం టెండర్లు పిలిచేందుకు ప్యాకేజీలవారీగా సమగ్ర వివరాలు తయారుచేసిన ఇంజినీర్లు మొత్తం అంచనాను రూ.38,500 కోట్లకు చేర్చారు. తాజాగా కేంద్ర జల సంఘానికి పంపిన ప్రతిపాదనల్లో ఈ ప్రాజెక్టు అంచనా ఏకంగా రూ.40,300 కోట్లకు చేరింది.

*మొత్తం పనులను 28 ప్యాకేజీలుగా విభజించి 2008-09లో టెండర్లు ఖరారు చేశారు. అన్ని ప్యాకేజీలకు అంచనాకన్నా 'ఎక్సెస్‌'కే గుత్తేదార్లు పనులు దక్కించుకొన్నారు.

మొదట్లో సొరంగం 'పొడవు' సాగింది
2008లో టెండర్ల ప్రారంభ సమయానికి 140 కి.మీ ఉన్న సొరంగ మార్గం... టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యే నాటికి 188.93 కి.మీ.లకు పెరిగింది. ప్రాణహిత అంచనాల్లో సొరంగ మార్గం తవ్వకానికే రూ.8283.31 కోట్లు వ్యయంగా నిర్ణయించారు. మొదట సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేసే పనిని ప్రభుత్వం వాప్కోస్‌ సంస్థకు అప్పజెప్పింది. టెండర్‌ ప్రక్రియ సమయంలో మాత్రం ప్యాకేజీల వారీగా అంచనాలు తయారు చేసే పనిని ఆర్వీ అసోసియేట్స్‌ అనే మరో కన్సల్టెన్సీకి అప్పగించారు. కాలువ, సొరంగ మార్గం, లైనింగ్‌ ఇలా అన్నింటికీ దేనికి ఎంత పని చేయాల్సి వస్తుందో నిర్ణయించి మరీ అంచనాలను తయారు చేశారు. ఉన్నతస్థాయి ఇంజినీర్లతో కూడిన కమిటీ పరిశీలించి వీటిని ఖరారు చేసింది. అంచనాల తయారీ కమిటీలో సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ కూడా సభ్యుడిగా ఉన్నారు. పనులు దక్కించుకొన్న గుత్తేదార్లు డిజైన్లను ప్రాణహిత ఇంజినీర్లకు సమర్పించడం, వారు డిజైన్స్‌ విభాగానికి పంపి ఆమోదం పొందే ప్రక్రియ కొన్నాళ్ల క్రితమే మొదలైంది. ఏడాది క్రితం నిర్ణయించిన అంచనాలకు, తాజాగా ఆమోదిస్తున్న అంచనాలకు ఎక్కడా పొంతనేలేదు.

అక్కడ్నించీ చిన్నబోవటం మొదలైంది!
ఆరవ ప్యాకేజీలో 10.3 మీటర్ల వ్యాసంతో సొరంగం తవ్వాల్సి ఉండగా.. తాజాగా దీనిని 10 మీటర్లకు తగ్గించి డిజైన్‌ ఆమోదించినట్లు తెలిసింది. సొరంగం పొడవు కూడా 0.625 కి.మీ తగ్గిపోయింది. నిజానికి ఈ ప్యాకేజీ అంచనా రూ.3722 కోట్లు కాగా, కాంట్రాక్టు సంస్థకు ఇవ్వటమే రూ. 3859.71 కోట్లకు అప్పగించారు. తాజాగా డిజైన్లు మార్చి మరోసారి వారికి భారీగా ప్రయోజనం కలిగించారు. ఇదొక్కటే కాదు, సొరంగం పొడవు- ఐదో ప్యాకేజీలో 0.45 కి.మీ, తొమ్మిదిలో 0.545 కి.మీ, పదవ ప్యాకేజీలో 0.665 కి.మీ, 11వ ప్యాకేజీలో 0.5 కి.మీ, 12వ ప్యాకేజీలో కిలో మీటర్‌ వరకూ తగ్గినట్లు సమాచారం.

సొరంగం స్థానే కాలువతో సరి!
టెండర్ల సమయంలో కాలువ 25 మీటర్ల కంటే ఎక్కువ లోతు తవ్వాల్సిన చోటల్లా సొరంగ మార్గాన్ని తవ్వాలని నిర్ణయించి అంచనాలు రూపొందించారు. ఇప్పుడు డిజైన్ల ఖరారుకు వచ్చేటప్పటికి 30 మీటర్ల కంటే ఎక్కువగా తవ్వాల్సి వచ్చిన చోట సొరంగ మార్గాన్ని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఫలితంగా సొరంగం తవ్వాల్సిన దూరం సుమారు పది కిలో మీటర్లకు పైగా తగ్గిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనివల్ల గుత్తేదారుకు రూ.కోట్లలో లబ్ధి తథ్యం. ఉదాహరణకు ఒక ప్యాకేజీలో ఎనిమిది కిలో మీటర్ల దూరం, 9.5 మీటర్ల వ్యాసంతో సొరంగం తవ్వడానికి అయ్యే వ్యయం రూ.353 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో కేవలం లైనింగ్‌కే రూ.123 కోట్లు కేటాయించారు. అంచనాల సమయంలో 0.6 మీటర్ల మందం కాంక్రీటు లైనింగ్‌ వేయాలని పేర్కొన్నారు. తాజాగా దీనిని 0.4 మీటర్లకు తగ్గించినట్లు తెలిసింది. అంటే ప్యాకేజీలో లైనింగ్‌ డిజైన్‌ మార్పు చేయడం ద్వారానే సుమారు రూ.40 కోట్ల వరకు గుత్తేదారుకు ప్రయోజనం చేకూరుతుంది. అర కిలోమీటర్‌ సొరంగ మార్గం తగ్గడం వల్ల మరో రూ.15 కోట్లు ఆదా అవుతుంది. ఒక్క లైనింగ్‌ డిజైన్‌ మార్చడం వల్లే గుత్తేదార్లకు వందల కోట్ల రూపాయల ప్రయోజనం కలగనుంది.

భూసేకరణ.. ప్రభుత్వం నెత్తిన బండ!
ఇవి చాలవన్నట్టు ఈ మార్పుచేర్పుల కారణంగా ప్రభుత్వం నెత్తిన భూసేకరణ భారం కూడా భారీగానే పడబోతోంది. కాలువ తవ్వాల్సిన చోట 200 మీటర్ల వరకు, సొరంగ మార్గం వద్ద 100 మీటర్ల వరకు భూసేకరణ చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు డిజైన్‌ మార్పుల కారణంగా.. సొరంగం తగ్గి కాలువ పెరగడం వల్ల భూసేకరణ ఎక్కువ చేయాల్సి వస్తోంది. ఇది ప్రభుత్వం నెత్తిన అదనపు భారం! కొన్నిచోట్ల మౌలిక కొలతలను కూడా మార్చేశారు. ఈపీసీ పద్ధతిలో టెండర్లు ఖరారు చేశారు కాబట్టి, డిజైన్‌ ఇచ్చే బాధ్యత కాంట్రాక్టు సంస్థది. అయితే ఏడాది క్రితం సమగ్ర అంచనాలతో సొరంగం పొడవు, వ్యాసం, లైనింగ్‌ నిర్ణయించిన ఇంజినీర్లు, ఇప్పుడు వాటిని తగ్గించి ఆమోదించడానికి ఎలా సిఫార్సు చేశారన్నది ప్రశ్న. అంచనాల ఖరారు కమిటీలో సభ్యులుగా సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ సి.ఇ.తో పాటు ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ కూడా ఉన్నారు. ఇప్పుడు డిజైన్లు ఆమోదించడంలో కూడా వీరిద్దరే కీలకం. గుత్తేదారుకు ప్రయోజనం కలిగించేలా డిజైన్లు మారిపోతుండటం.. నీటి పారుదల శాఖ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.