అనేక పర్యాటక ప్రాంతాలు, అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ రాష్ట్ర పర్యాటక రంగం అవకాశాలను అందిపుచ్చుకోలేక పోతోంది. అత్యధిక దేశీయ పర్యాటకులు సందర్శిస్తున్న రాష్ట్రమే అయినా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆదాయపరంగా అయిదారు స్థానాల్లో ఉంటోంది. దీనికి కారణం కేరళ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల తరహాలో రాష్ట్ర పర్యాటక ప్రదేశాల గురించి పటిష్ఠమైన ప్రచారం (ప్రమోషన్) చేపట్టక పోవడమేనని రాష్ట్ర పర్యాటక శాఖ గుర్తించింది. అంతేకాకుండా రాష్ట్రానికి విచ్చేస్తున్న పర్యాటకుల్లో అధిక శాతం మంది గుళ్లు, గోపురాలు దర్శించుకునే వారే ఉంటున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి పర్యాటక రంగాన్ని బహుముఖంగా అభివృద్ధి చేయనున్నారు. ఎక్కువ ఖర్చు చేసే (హై-ఎండ్) విహార పర్యాటకులను ఆకర్షించడానికి రాష్ట్ర పర్యాటక శాఖ రంగం సిద్ధం చేస్తోంది.ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే పర్యాటక కేంద్రంగా (టూరిజం హబ్)గా తీర్చిదిద్దే లక్ష్యంతో కొత్త పర్యాటక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇందులో ప్రయివేటు రంగానికి పెద్ద పీట వేయడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్నారు.
పర్యాటక రంగంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
ఎక్కువ ఖర్చు పెట్టేవారిపై దృష్టి
హెలీ టూరిజం.. ఫిలిం టూరిజం
50కేంద్రాల్లో మినీ కాంప్లెక్స్‌లు
త్వరలో కొత్త విధానంహైదరాబాద్ - న్యూస్‌టుడే
అనుమతుల బాధ్యత ప్రభుత్వానిదే: దాదాపు పదేళ్ల కిందట అమలులోకి వచ్చిన పర్యాటక విధానం స్థానంలో రెండు మూడు నెలల్లో కొత్త పర్యాటక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇందులో ప్రయివేటు రంగంలోని కంపెనీలకు పూర్తిగా అవకాశం కల్పించి ప్రభుత్వం కేవలం సమన్వయకర్త పాత్రను పోషించనుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో నగదు పరమైన ప్రోత్సాహకాలను భారీగా ఇవ్వనప్పటికీ.. ప్రాజెక్టుకు అవసరమైన స్థలాన్ని సమకూర్చడంలోనూ, అన్ని రకాల అనుమతులు పొందడంలోనూ ప్రభుత్వమే బాధ్యత వహించనుంది. 'గత విధానంలోనే అనుమతులకు సింగిల్ విండో(ఏకగవాక్ష) విధానాన్ని ప్రవేశపెట్టినా అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఈ సారి దీన్ని పటిష్ఠంగా అమలు చేస్తాం. నిర్ణీత సమయంలో అన్ని అనుమతులను తీసుకు వచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. స్థలాన్ని కూడా ప్రభుత్వమే సమకూరుస్తుంది' అని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. కొత్త విధానం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇచ్చేదిగా, ప్రోత్సహించేదిగా రూపొందనుంది. అయితే.. 1998 విధానంలో ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. వాటిని అమలు చేయడంలో మాత్రం విఫలమైందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
ఆ మూడు ప్రాంతాలకే 90 శాతం మంది: గత పదిహేనేళ్లుగా దేశీయ పర్యాటకులు అత్యధికంగా సందర్శిస్తున్న రాష్ట్రంగా మన రాష్ట్రం అగ్ర స్థానంలో ఉంది. గత ఏడాదిలో రాష్ట్రానికి 12.9 కోట్ల మంది దేశీయ పర్యాటకులు విచ్చేశారు. ఇందులో 90 శాతం మంది తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్ నగరాలను సందర్శించారు. రాష్ట్రంలో 37 గుర్తింపు పొందిన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అయినా పర్యాటకులు ఈ 3 ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. 2009లో రాష్ట్రానికి విచ్చేసిన విదేశీ పర్యాటకులు దాదాపు 6.9 లక్షల మంది ఉన్నా.. వీరిలో ఎన్నారైలు, వ్యాపార లావాదేవీల కోసం వచ్చే వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
* ఇప్పటికే ఉన్న పర్యాటక కేంద్రాల్లో మరిన్ని వినోద సదుపాయాలు కల్పించనున్నారు. ఎక్కువ సమయాన్ని గడిపేందుకు వీలుగా తీర్చిదిద్దబోతున్నారు.
* పర్యాటక కేంద్రాలకు సమీప దర్శనీయ ప్రదేశాలను అభివృద్ధి చేయనున్నారు.
* రాష్ట్రానికి 965 కిలో మీటర్ల పొడవున అతి పెద్ద కోస్తా తీరం ఉన్నా.. ఉన్న బీచ్ రిసార్ట్‌లు రెండే (సూర్యలంక, రుషికొండ) అభివృద్ధి అయ్యాయి. ఇక తీర ప్రాంతం వెంట కనీసం 20 రిసార్ట్‌లను అభివృద్ధి చేయనున్నారు.
* రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదులను, ఇతర సాగునీటి ప్రాజెక్టులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. దీనికి అనుగుణంగా త్వరలో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వరకు నౌకా (క్రూయిజ్) విహారాన్ని ప్రారంభించనున్నారు.
* హైదరాబాద్ నగరానికి ఉన్న అనేక ప్రత్యేకతలను పర్యాటక రంగం సద్వినియోగం చేసుకోనుంది. అంతర్జాతీయ సమావేశం మందిరం, అంతర్జాతీయ విమానాశ్రయం, బడ్జెట్ హోటళ్ల నుంచి అయిదు నక్షత్రాల హోటళ్ల వరకు ఇక్కడ నెలకొన్నాయి. దీంతో అంతర్జాతీయ సమావేశాలకు హైదరాబాద్ కేంద్రం అయింది. ఈ నేపథ్యంలో మైస్ (mice-meetings, incentives, conventions, exhibitions) పర్యాటకాన్ని ఇక్కడ అభివృద్ధి చేయనున్నారు.
* హై- ఎండ్ పర్యాటకులను ఆకర్షించడానికి హెలీ టూరిజంను ప్రవేశపెట్టనున్నారు. ముందుగా బెంగళూరు, పుట్టపర్తి, హైదరాబాద్, నాగార్జున సాగర్‌ల మధ్య ఈ సౌకర్యం కల్పించే వీలుంది.
* ప్రపంచ స్థాయి ఆసుపత్రులు, ప్రత్యేక నైపుణ్యం కలిగిన డాక్టర్లు అందుబాటును అవకాశంగా తీసుకుని వెల్‌నెస్ పర్యాటకాన్ని కూడా ప్రోత్సహించనున్నారు.
* అత్యాధునిక ఫిలిం స్టూడియోలు, చలనచిత్రాల చిత్రీకరణకు అనువైన అనేక ప్రదేశాలు, చలనచిత్ర నిర్మాణానంతర (పోస్ట్ ప్రొడక్షన్) కావాల్సిన సదుపాయాలు రాష్ట్రంలో ఉన్నందువల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన చిత్ర పరిశ్రమను ఆకర్షించే విధంగా ఫిలిమ్ టూరిజంపైన కూడా దృష్టి సారించనున్నారు.
* రాష్ట్రంలోని 50 పర్యాటక కేంద్రాల్లో మినీ టూరిజం కాంప్లెక్స్‌లను పర్యాటక శాఖ ఏర్పాటు చేయనుంది. అక్కడకు వచ్చే పర్యాటకులకు ఈ కాంప్లెక్స్‌ల్లో అన్ని సదుపాయాలు కల్పించనుంది.
