Tuesday, April 13, 2010

3జీ ఒక మార్పు మాత్రమే


నంబర్‌ పోర్టబులిటీతో విప్లవం
రాష్ట్రంలో 30% మందికే మొబైళ్లు
వ్యాపార విస్తృతికి భారీ అవకాశాలు
యూనినార్‌ ఆంధ్ర ప్రదేశ్‌ అధిపతి దుష్యన్‌ వైద్యనాథన్‌
న్యూస్‌టుడే ఇంటర్వ్యూలో
త్వరలో అందుబాటులోకి వచ్చే మూడో తరం (3జీ) సేవ కొత్త విప్లవాన్ని తీసుకువచ్చే అవకాశం లేదని యూనినార్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యకలాపాల అధిపతి (ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌) దుష్యన్‌ వైద్యనాథన్‌ అంటున్నారు. ఇది ఒక కొత్త మార్పు మాత్రమేనని, 3జీ సేవల కన్నా మొబైల్‌ నంబర్‌ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ)యే పెద్ద మలుపు అని ఆయన అభిప్రాయపడుతున్నారు. 'న్యూస్‌టుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 3జీతో పాటు రాష్ట్ర టెలికాం మార్కెట్‌, కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలపై వైద్యనాథన్‌ ఏమన్నారంటే...

? 3జీ సేవలు టెలికాం రంగంలో ఎలాంటి విప్లవాన్ని తేనున్నాయి
3జీ టెక్నాలజీ కేవలం డేటాను త్వరగా బదిలీ చేయగలుగుతుంది. 2జీలో లభించనిది.. 3జీలో ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చేది ఒక్క వీడియో టెలిఫోనీ మాత్రమే. భవిష్యత్తులో టీవీ కార్యక్రమాలు బాగా వీక్షించేందుకు ఉపయోగపడుతుంది. ఇది ఆధునిక డేటా టెక్నాలజీ. ముఖ్యంగా భారత టెలికాం రంగంలో 3జీ హఠాత్తుగా విప్లవం తీసుకురాజాలదు. సంక్షిప్త సందేశ సేవలు (ఎస్‌ఎంఎస్‌) పెద్ద మార్పును తీసుకు వచ్చాయి. టెలికాం రంగంలో ఆ స్థాయి మార్పు నంబర్‌ పోర్టబులిటీ ద్వారా వచ్చే వీలు ఉంది. ప్రపంచంలో జపాన్‌, ఇటలీ కొరియా వంటి కొన్ని దేశాల్లో మాత్రమే 3జీ సేవలు బాగా విజయమంతం అయ్యాయి.

? మొబైల్‌ నంబర్‌ పోర్టబులిటీ (ఆపరేటరును మార్చుకున్నా నంబరు మారదు)తో ఎలాంటి మార్పులు రావచ్చనుకుంటున్నారు
ఎంఎన్‌పీ అందుబాటులోకి వస్తే ప్రధాన టెలికాం ఆపరేటర్ల మధ్య పోటీ పెరుగుతుంది. ఒక ప్రామాణిక స్థాయిలో నాణ్యమైన సేవలను అందించకపోతే చందాదారును ఆ కంపెనీ వదులుకోవాల్సి ఉంటుంది. చందాదారుకు ఆపరేటర్‌ను ఎంచుకొనే శక్తి లభిస్తుంది. మెరుగైన సేవలు చాలా కీలకంగా మారతాయి. ప్రస్తుతం చందాదారుల్ని ఆకర్షించడానికి ఈ పోర్టబులిటీ లేకపోవడం పెద్ద ఆటంకంగా ఉంది. ప్రయోగాత్మక ప్రాతిపదికన మే నెలలో కర్ణాటకలో ఎంఎన్‌పీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తరువాత ఇతర రాష్ట్రాల్లో దీనిని దశల వారీగా అమలు చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో జులై నాటికి అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి నెల కొత్తగా 20-30 లక్షల మంది కొత్త చందాదారులు వచ్చి చేరుతున్నారు. అదే స్థాయిలో నెట్‌వర్క్‌లు వృద్ధి చెందడం లేదు.

? రాష్ట్రంలో ఇప్పటికే 10 మంది ఆపరేటర్లు రంగంలో ఉన్నారు. ఇంకా కొత్త వారు ప్రవేశించే పరిధి ఉందా
ధరల పరంగా ఆంధ్ర ప్రదేశ్‌ పోటీ మార్కెట్టే. మరింత మంది ప్రవేశించడానికీ అవకాశాలు లేకపోలేదు. వచ్చే 2-3 నెలల్లో మరో 4 ఆపరేటర్లు రంగప్రవేశం చేసే వీలుంది. ఒకరిద్దరు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి వంద మందికి 37 మంది వద్దే సిమ్‌ కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో 30% మంది వద్ద మొబైళ్లు ఉన్నాయి. కాబట్టి వ్యాపారానికి బోలెడు అవకాశాలు ఉన్నాయి. వృద్ధిరేటు, చందాదారుల విస్తరణ, వ్యాపారం అంశాలు తీసుకుని ప్రతి కంపెనీ ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

? రాష్ట్రంలో మీ విస్తరణ ప్రణాళికలు..
గత డిసెంబరు 3న కార్యకలాపాలు ప్రారంభించాం. ఫిబ్రవరి ఆఖరుకు మా చందాదారుల సంఖ్య 5.75 లక్షలకు చేరింది. జనవరిలో రాష్ట్రంలో కొత్తగా చందాదారులైన వారిలో 11 శాతం మందిని ఆకర్షించాం. 2018 నాటికి దేశ వ్యాప్తంగా టెలికాం మార్కెట్‌లో 8 శాతం వాటాను చేజిక్కించుకోవాలన్నది మా లక్ష్యం. ప్రస్తుతం రాష్ట్రంలోని 440 పట్టణాల్లో 1500కు పైగా గ్రామాల్లో మా సేవలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో సేవల విస్తరణ నిరంతరం కొనసాగేది.

? ఎటువంటి చందాదారులను ఆకర్షించాలని మీ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది
ఒక స్థాయిలో, లేదా ఎక్కువ సమయం మాట్లాడే వారే మా లక్ష్యం. అందుకు అనుగుణంగా మా ప్యాకేజీలను రూపొందించాం. మీరు ఒక నిమిషమే మాట్లాడితే.. మా టారిఫ్‌ చందాదారుడికి ఖరీదే. అదే పది నిమిషాలు మాట్లాడితే చాలా చౌక. చందాదారులను ఆకర్షించడానికి కాలర్‌ టోన్‌లలో ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనున్నాం. విలువ జోడించిన సేవల్లో వినోదంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. అలాగే గ్రామీణ చందాదారుల కోసం సరుకుల ధరలను 3-4 నెలల్లో అందించనున్నాం. స్థూలంగా యువతను, ఎక్కువ సమయం మాట్లాడే వారిని ఆకర్షించడమే వ్యూహం.