Tuesday, April 13, 2010

వివాదం ఏమవుతుంది

యులిప్‌లపై ప్రణబ్‌ జోక్యం చేసుకొంటారా?
లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ కింకర్తవ్యం
బీమా కంపెనీలు అమలు చేస్తున్న యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ (యులిప్‌)లపై తాజా వివాదం తీవ్రతరం అవుతోంది. స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ 'సెబీ'తో, బీమా నియంత్రణ- అభివృద్ధి ప్రాధికార సంస్థ 'ఐఆర్‌డీఏ'తో 'లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌' సంప్రదింపులు జరపనుంది. ఈ కౌన్సిల్‌ జీవిత బీమా కంపెనీల ప్రాతినిధ్య సంస్థ. తొలుత బీమా కంపెనీల అభిప్రాయాలను సేకరించడానికి నేడు ముంబయిలో ఈ కౌన్సిల్‌ సమావేశం జరపనుంది. అటు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ సైతం విషయ ప్రాధాన్యాన్ని గ్రహించి, వివాదం గురించి వివరాలు విని పరిస్థితులు అదుపు తప్పకుండా జోక్యం చేసుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.

యులిప్‌లు మ్యూచువల్‌ ఫండ్‌ల లాంటివని సెబీ, వాటిని కొనసాగించాలంటే మ్యూచువల్‌ ఫండ్‌లకు వర్తించే నిబంధనల ప్రకారం తన ముందస్తు అనుమతిని బీమా కంపెనీలు తీసుకోవాలని సెబీ ఆదేశించింది. అలా అనుమతిని తీసుకోనందుకు ఎల్‌ఐసీ మినహా 14 జీవిత బీమా కంపెనీలకు యులిప్‌ల నిధుల వసూలు ఆపేయాల్సిందిగా సూచిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం విదితమే. అయితే యులిప్‌ల విక్రయాలను కొనసాగించవచ్చని ఐఆర్‌డీఏ అంటోంది. 1938 నాటి బీమా చట్టం కింద యులిప్‌లను ఆఫర్‌ చేయవచ్చని ఒక సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో చివరకు ఏం జరగనుంది?

సెబీ వెనుకకు తగ్గుతుందా..! అదే జరిగితే, ఇక వివాదమే ఉండదు. ఒకవేళ సెబీ వాదనదే పైచేయిగా నిలిస్తే?
సెబీ ఆదేశాల కారణంగా పరిస్థితులు అటు బీమా కంపెనీలకు.. ఇటు పాలసీదార్లకు కొంచెం కష్టం/నష్టం కలిగించేవిగా ఉండవచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఎలాగంటే సెబీ ఆదేశాల వల్ల మొత్తం బీమా పాలసీల పునరుద్ధరణ (రెన్యూవల్స్‌)ను ఆపివేయవలసి ఉంటుంది. అంతే కాదు ఇప్పటి దాకా కట్టించుకున్న ప్రీమియం మొత్తాన్ని కంపెనీలు వారికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఉన్నపళంగా పాలసీదార్లకు, బీమా కంపెనీలకు నష్టం. ఉత్పత్తుల అమ్మకాలను ఆపివేస్తే బీమా కంపెనీలకు ప్రధాన ఆదాయ మార్గాలు మూసుకుపోతాయ్‌. అంతే కాదు గడువు తీరిన తరువాత; లేదా పాలసీదారు మరణించినపుడు; ఇతర క్లెయిమ్‌ల విషయంలో కంపెనీలు జరిపే చెల్లింపులపై ఇది తీవ్ర ప్రభావం చూపవచ్చు.

కరెన్సీ ఫ్యూచర్స్‌ తరహాలో
యులిప్‌ పథకాల ద్వారా తాజా/అదనపు నగదును సేకరించడంపై సెబీ జారీ చేసిన ఆదేశాలను- బీమా కంపెనీలు అలాంటి పథకాలకు సెబీ ఆమోదాన్ని తీసుకున్న పక్షంలో- సడలించే అవకాశం ఉంది. మరో విధంగా చెప్పాలంటే.. కరెన్సీ ఫ్యూచర్స్‌ అటు రిజర్వు బ్యాంకు, ఇటు సెబీ రెండింటి పర్యవేక్షణలో జరుగుతున్న విధంగానే యులిప్‌లు సైతం ఇకపై సెబీ, ఐఆర్‌డీఏలు రెండింటి పర్యవేక్షణలో ఉండొచ్చు! ఒకవేళ బీమా చట్టం సెక్షన్‌ 34(ఐ) (ఎ) (బి) కిందే సెబీ చేసిన ఆదేశాలను బీమా కంపెనీలు బేఖాతరు చేస్తే ఆయా కంపెనీలను సెబీ న్యాయస్థానానికి లాగే అవకాశం ఉంది.

మార్కెట్లపై ప్రభావం ఉండదు: విశ్లేషకులు
ఒకవేళ బీమా కంపెనీలు ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసినా స్టాక్‌ మార్కెట్లపై పెద్ద ప్రభావం ఉండదన్నది విశ్లేషకుల అంచనా. 'ప్రస్తుత వివాదం వల్ల మార్కెట్లపై ప్రభావం ఉండదు. ఎందుకంటే ఏప్రిల్‌ నెల బీమా కంపెనీలకు అంతగా ప్రాధాన్యం లేనిద'ని వారంటున్నారు. మార్కెట్లు తాజా సంఘటనలను అర్థం చేసుకోవడానికి కావలసినంత సమయం (శని, ఆదివారాలు) దొరికింది కాబట్టి రాబోయే ట్రేడింగ్‌ సెషన్లలో దీని ప్రభావం తక్కువేనని చెబుతున్నారు. అదీ కాక ఇది ఈ రెండు సంస్థలు యులిప్‌ల విషయంలో గొడవపడుతున్న విషయం మార్కెట్‌కు కొత్త విషయమేమీ కాదన్నది గమనించాలని నిపుణులు వివరిస్తున్నారు. 'ఓ వారం రోజుల వ్యవధిలో సమస్య పరిష్కారం కావచ్చని అంచనా. ఒకవేళ యులిప్‌లు మార్కెట్‌ నుంచి బయటకు వచ్చేసినా కావలసినంత ద్రవ్య లభ్యత కారణంగా మార్కెట్లకు పెద్ద నష్టమేమీ ఉండద'ని వారు అభిప్రాయపడుతున్నారు

నిషేధం పరిధిలోకి ఎల్‌ఐసీ కూడా!
శుక్రవారం నిషేధం విధించిన 14 కంపెనీలతో పాటు మిగిలిన ఎల్‌ఐసీ సహా ఇతర 9 బీమా కంపెనీలను సైతం నిషేధం కిందకు తీసుకురావాలనుకుంటున్నట్లు 'మింట్‌'కు సెబీ తెలిపింది. 'నోటీసులు జారీ చేసిన 14 కంపెనీల విషయంలో మేం దర్యాప్తును నిర్వహించాం.. అందుచేతే ఒక నిర్ణయానికి రాగలిగామ'ని సెబీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె.ఎన్‌.వైద్యనాథన్‌ ఆ పత్రికకు తెలిపారు. ప్రస్తుతం సెబీ ఇతర కంపెనీల విషయంలోనూ దృష్టి సారిస్తోందని ఆయన చెప్పారు. యులిప్‌ వివాద వ్యవహారంలో విత్త మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
గతేడాది 16.7లక్షల యులిప్‌ల విక్రయం
యులిప్‌ పథకాలు క్షేమకరమేనని, వీటికి ఎటువంటి ఇబ్బంది లేదని ఐఆర్‌డీఏ స్పష్టంచేసిన నేపథ్యంలో..
* దేశంలో మొత్తం జీవిత బీమా వ్యాపారంలో యులిప్‌ల వాటా 50 శాతాని కన్నా అధికం.
* 2008-09లో యులిప్‌ పాలసీల మొత్తం ప్రీమియం రూ.90,645 కోట్లుగా ఉంది. ఇక 2009-10 (ఫిబ్రవరి వరకు)లో అమ్ముడుపోయిన మొత్తం 16.7 లక్షల పాలసీల ప్రీమియం మొత్తం రూ.44,611 కోట్లుగా ఉంది.
* సెబీ నిషేధం విధించిన 14 బీమా కంపెనీల పెట్టుబడులు మార్చి 2009 చివరి నాటికి రూ.16,281 కోట్లుగా ఉంది.
* దేశంలో 23 జీవిత బీమా కంపెనీలు ఉన్నాయి. వీటి మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.10 లక్షల కోట్లు. కొన్ని ప్రైవేటు బీమా కంపెనీలకు 90 శాతం ప్రీమియం వాటా యులిప్‌ల ద్వారా వస్తుండడం గమనార్హం.