హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్ర రాజధానిలో కొత్తగా నాలుగు చక్రాల వాహనాలను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే భారత్ స్టాండర్డ్(బీఎస్)-3 వాహనాలను మాత్రం కొనుగోలు చేయొద్దు. బీఎస్-4 వాహనాలనే కొనండి. లేనిపక్షంలో మీరు కొన్న వాహనాన్ని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రవాణా శాఖ అధికారులు రిజిస్టర్ చేయరు. బీఎస్-4 వాహనాల్ని మాత్రమే రిజిస్టర్ చేసేలా రవాణా శాఖ ఆన్‌లైన్ నెట్‌వర్క్‌లో ఇప్పటికే మార్పులు చేశారు. అందుచేత వాహనాన్ని కొనేటపుడు ఒకసారి ఆలోచించి మరీ కొనుగోలు చేయాలని రవాణా శాఖ కమీషనర్ రేమండ్ పీటర్ కోరుతున్నారు. దేశంలోని 13 నగరాల్లో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే బీఎస్-4 వాహనాల్ని మాత్రమే రిజిస్టర్ చేయాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఇటీవల ఆదేశించింది. దీనికి రాష్ట్ర రవాణా శాఖ తగిన ఏర్పాట్లను కూడా చేసింది. అయితే గత నెల 31వ తేదీన ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అన్ని జిల్లాల్లో బీఎస్-2 ప్రమాణాల వాహనాల స్థానే బీఎస్-3 వాహనాలను రిజిస్టర్ చేయాలని ఇందులో కోరింది. అయితే ఇక్కడి అధికారులు 13 నగరాల్లో అమలుచేయాల్సిన బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్‌ను అక్టోబర్‌కు వాయిదా వేశారని భావించారు. ఇదే విషయాన్ని అధికారులు పత్రికల వారికి కూడా తెలియజేశారు. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జంట నగరాల్లో బీఎస్-3 వాహనాలనే రిజిస్టర్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ వ్యవహారంపై కేంద్ర ఉపరితల రవాణా శాఖ అధికారులతో రవాణా శాఖ కమిషనర్ రేమండ్ పీటర్ శనివారం టెలిఫోన్‌లో మాట్లాడారు. ముందుగా నిర్ణయించినట్లు 13 నగరాల్లో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్-4 వాహనాలనే రిజిస్టర్ చేయాలని పీటర్‌ను ఉపరితల రవాణా అధికారులు కోరారు. ఈ నిర్ణయాన్ని వాయిదా వేయలేదని స్పష్టీకరించారు. కేవలం మిగిలిన జిల్లాల్లో బీఎస్-2 బదులు బీఎస్-3 వాహనాలను రిజిస్టర్ చేసే సమయాన్ని అక్టోబర్‌కు పెంచినట్లు తెలిపారు. దీంతో శనివారం పీటర్ రంగంలోకి దిగారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బీఎస్-4 వాహనాలను మాత్రమే రిజిస్టర్ చేసేలా తక్షణం చర్యలు తీసుకున్నారు. బీఎస్-3 వాహనం రిజిస్టర్ చేయడానికి వాహనాల డీలర్లు ప్రయత్నించినా ఇకపై ఆన్‌లైన్ కంప్యూటర్ పోగ్రాం తిరస్కరిస్తుంది. రాజధాని పరిధిలోని ఖైరతాబాద్-సెంట్రల్, సికింద్రాబాద్-నార్త్‌జోన్, టోలిచౌక్-వెస్టుజోన్, మలక్‌పేట-ఈస్టుజోన్, బహుదూర్‌పురా-సౌత్‌జోన్ రవాణా కార్యాలయాల్లో కేవలం బీఎస్-4 వాహనాలను మాత్రమే రిజిస్టర్ చేస్తారు.
చిన్న మినహాయింపు
మార్చి 31వ తేదీ లోగా వాహనాల కంపెనీలు ఉత్పత్తిచేసిన బీఎస్-3 వాహనాలను రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు. మార్చి 31వ తేదీకన్నా ముందు తయారైన వాహనాలను 3 నెలల్లోగా డీలర్లు విక్రయించుకోవాలని కమీషనర్ పీటర్ ఆదేశించారు. లేనిపక్షంలో సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకుంటారు. అంతర్‌రాష్ట్ర పర్మిట్, జాతీయ పర్మిట్, అఖిలభారత టూరిస్టు పర్మిట్ ఉన్న రవాణా వాహనదారులు తప్ప మిగిలిన నాలుగు చక్రాల వాహనదారులంతా ఏప్రిల్ ఒకటి నుంచి బీఎస్-4 వాహనాలనే కొనుగోలు చేస్తేనే ఆ వాహనం రిజిస్టర్ అవుతుంది. అన్ని కంపెనీలు బీఎస్-4 వాహనాల తయారీని మొదలుపెట్టినా పెద్దఎత్తున తయారీ ఇంకా మొదలుకాలేదు. అందుచేత జంటనగారాల్లో వాహనాలను కొనుగోలు చేసే వారు తమకు కావాల్సిన బీఎస్-4 ప్రమాణ వాహనం కావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. లేనిపక్షంలో మార్చి 31వ తేదీలోగా తయారైన వాహనాలు అందుబాటులో ఉంటే వాటిని కొనుగోలుచేయాల్సి ఉంటుంది.