ఈ ఏడాది 45 కొత్త మోడళ్లు
హైదరాబాద్, న్యూస్‌టుడే: మొబైల్ హ్యాండ్ సెట్ల విపణిలో పెరుగుతున్న పోటీకి అనుగుణంగా ప్రారంభ స్థాయి (ఎంట్రీ లెవల్)లో నోకియా నాలుగు మొబైల్ ఫోన్లను విడుదల చేసింది. వీటిలో మూడు మోడళ్ల ధర రూ.2,000 కంటే తక్కువ. వినియోగదారులు విభిన్న సదుపాయాలను ఆశిస్తున్నారని, ఈ ఫోన్లలో వాటిని అందించేందుకు ప్రయత్నించామని నోకియా ఇండియా ప్రాంతీయ జనరల్ మేనేజర్ (దక్షిణం) టి.ఎస్.శ్రీధర్ తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో దేశీయ విపణిలోకి వీటిని విడుదల చేశారు. 'నోకియా 2690' ఫోన్ వెంటనే మార్కెట్‌లో లభిస్తుంది. దీని ధర రూ.2,749. ఇందులో ఇంటర్నెట్ విహార (బ్రౌజింగ్) సదుపాయం ఉంటుంది. నోకియా 1800, 1616, 1280 మోడళ్లు రెండు మూడు వారాల్లో అందుబాటులోకి వస్తాయి. వీటి ధరలను ఇంకా నిర్ణయించలేదని, అయితే.. రూ.1,300-1,800 మధ్య ఉండగలవని శ్రీధర్ చెప్పారు. ఈ ఏడాదిలో 40-45 వరకు కొత్త మోడళ్లను కంపెనీ ప్రవేశపెట్టే వీలుందన్నారు. నగదు బదిలీ సేవలపై ఆశావహం: నోకియా చేపట్టిన ప్రయోగాత్మక నగదు బదిలీ కార్యక్రమం విజయవంతం అయితే.. ఆరు నెలల తర్వాత నోకియా ఫోన్లలో నగదు బదిలీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలు పొందడానికి మొబైల్ మనీ సేవల ఏజెంట్‌గా వ్యవహరించే నోకియా రిటైలర్ వద్ద పేరు నమోదు చేసుకోవాలి. బ్యాంకు ఖాతా నుంచి లేదా నగదు చెల్లిస్తే దాన్ని మీ మొబైల్ మనీ సేవల ఖాతాలోకి బదిలీ చేస్తారు. మొబైల్ మనీ ఖాతా నుంచి ఇతరులకు చెల్లింపులు, బదిలీ చేయొచ్చు.
8జీబీ విస్తార మెమొరీ కార్డు
సంగీతం, స్థానిక భాషల్లో సమయం (స్పీకింగ్ క్లాక్),
స్టీరియో ఎఫ్‌ఎం రేడియో,
22 రోజుల బ్యాటరీ స్టాండ్‌బై సమయం,
మల్టిపుల్ ఫోన్ బుక్స్ ఫ్లాష్‌లైట్, క్యాలెండర్, రిమైండర్లు