భెల్ రామచంద్రాపురం వ్యాపారం రూ.5,004 కోట్లు
హైదరాబాద్, న్యూస్‌టుడే: బీహెచ్‌ఈఎల్ (భెల్) రామచంద్రాపురం యూనిట్ గత ఆర్థిక సంవత్సరానికి (2009-10) రికార్డు స్థాయిలో మొత్తం వ్యాపారాన్ని (టర్నోవర్) నమోదు చేసింది. అంతేకాకుండా రూ.5,000 కోట్ల నగదు వసూళ్లను నమోదు చేయడం కూడా మరొక ప్రత్యేకత. గత ఆర్థిక సంవత్సరం పనితీరు, ఆదాయ వివరాలను బీహెచ్‌ఈఎల్ రామచంద్రాపురం యూనిట్ జనరల్ మేనేజర్ (ఇన్‌ఛార్జి) ఆర్.కృష్ణన్ సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2009-10లో కంపెనీ యూనిట్ అంత క్రితం ఆర్థిక సంవత్సరం కన్నా 21 శాతం అధికంగా రూ.5,004 కోట్ల టర్నోవర్‌ను సాధించినట్లు, దీనిపై లాభం కూడా 24 శాతం అధికంగా రూ.930 కోట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆర్థిక మందగమనంలో అంతర్జాతీయ పోటీ, కొన్ని కీలకమైన విడిభాగాల లభ్యత సమస్యగా ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో టర్నోవర్, ఆదాయాలను నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీహెచ్‌ఈఎల్ విదేశాలకు సైతం విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బీహెచ్‌ఈఎల్ రామచంద్రాపురం యూనిట్ రూ.6,651 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరం టర్నోవర్‌తో పోల్చి చూస్తే ఇది 33 శాతం అధికం. సంస్థ చేతిలో రూ.15,264 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి. ఇంత పెద్దఎత్తున ఉన్న ఆర్డర్లను నిర్వహించడం సవాలేనని, దీనికి పూర్తిగా సన్నద్ధం అవుతున్నామని ఆర్.కృష్ణన్ వివరించారు. బీహెచ్‌ఈఎల్ రామచంద్రాపురం యూనిట్ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొత్త యంత్రపరికరాలు, విడిభాగాలను అందించడం ప్రారంభించిందని తెలిపారు.