
కొత్త ఎఫ్‌డీఐ విధానంలో మార్పులుండవ్
వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కొత్త విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) విధానం చాలా బాగా పనిచేస్తోందని ప్రభుత్వం సోమవారమిక్కడ పేర్కొంది. దీంతో ప్రైవేటు రంగ బ్యాంకులైన ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు విదేశీ సంస్థలుగా పరిగణించే అవకాశం ఉన్నట్లు సంకేతాలు పంపింది. ఎందుకంటే ఆయా బ్యాంకుల్లో అధిక(మెజారిటీ) వాటా విదేశీ పెట్టుబడుదారులదే.
'..ప్రస్తుతానికి ఈ విధానం చాలా బాగా పనిచేస్తోంద'ని వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఆనంద్ శర్మ పేర్కొన్నారు. గతేడాది ఫిబ్రవరిలో నోటిఫై చేసిన ఎఫ్‌డీఐ నిబంధనల ప్రకారం కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకులను విదేశీ సంస్థలుగా పరిగణించవచ్చా అన్న ప్రశ్నకు ఈ సమాధానం చెప్పారు.
ప్రెస్ నోట్లు 2,3,4లో ఏముందంటే: పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం(డీఐపీపీ)నకు చెందిన ప్రెస్‌నోట్లు 2, 3, 4 ప్రకారం ఏదైనా కంపెనీ లేదా సంస్థలో అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్//గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్, విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్లు, కన్వర్టబుల్ ప్రిఫరెన్షియల్ షేర్లు, ఎన్‌ఆర్‌ఐల ద్వారా కానీ వచ్చే విదేశీ పెట్టుబడులు 50 శాతం కంటే తక్కువగా ఉంటే దాన్ని భారతీయ ంపెనీగానే పరిగణించాలి. దీని ప్రకారం ఏడు ప్రైవేటు బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడులు 50 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి కాట్టి వీటిని దేశీయ సంస్థలుగా గుర్తించడానికి అర్హత ఉండదు. దీనిపై ఐసీఐసీఐ బ్యాంకు వంటి బ్యాంకులు ప్రభుత్వాన్ని, రిజర్వు బ్యాంకును సైతం కలిశాయి.
అవును.. నిజమే కానీ..: 'రిజర్వు బ్యాకు, ఆర్థిక శాఖ, వాణిజ్య-పరిశ్రమల శాఖలతో కొన్ని బ్యాంకులు చర్చిస్తున్న మాట నిజమే కానీ.. ప్రస్తుతానికి మాత్రం ఆ విధానం బాగానే ఉంద'ని శర్మ ఇక్కడ జరిగిన అసోచామ్ కార్యక్రమంలో పేర్కొంటూ.. పరోక్షంగా ఆయా బ్యాంకుల వినతులను తోసిపుచ్చారు.
విదేశీ బ్యాంకుగా పరిగణిస్తే..: ఒక వేళ ఆయా బ్యాంకులను విదేశీ బ్యాంకులుగా ప్రభుత్వం గుర్తించిందంటే... అవి బీమా వంటి అనుబంధ సంస్థలకు 26 శాతం పరిమితితో మళ్లించే పెట్టుబడులపై ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఆ పెట్టుబడులను విదేశీ పెట్టుబడులుగా పేర్కొనాల్సి వస్తుంది కనుక. ఈ సమస్యపై శర్మను అడగ్గా 'ఇప్పటిదాకా విదేశీ యాజమాన్యం, నియంత్రణ విషయంలో ఎఫ్‌డీఐ నియామావళిలో స్పష్టత ఉంది. సరళంగా ఉంది. కాబట్టి వాటిని సంకుచిత దృష్టితో చూడాల్సిన అవసరం లేద'ని వివరించారు.
ఆ ఏడు బ్యాంకులివీ
ఏడీఆర్లు, జీడీఆర్‌ల వంటి వివిధ విధానాల్లో విదేశీ పెట్టుబడులు 50 శాతం కంటే ఎక్కువగా ఉన్న బ్యాంకులు కొన్ని ఉన్నాయి. వీటిపై కొత్త ఎఫ్‌డీఐ విధాన ప్రభావం పడే అవకాశం ఉంది. అవేంటంటే.. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యెస్ బ్యాంకు, ఇండస్‌ఇండ్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, ఐఎన్‌జీ వైశ్యా, డెవలప్‌మెంట్ క్రెడిట్ బ్యాంకు.
వీటిపై ప్రభావం ఉండదు
ఫిబ్రవరి 2009 కంటే ముందు బీమాతో పాటు ఆర్థిక సేవల్లో పెట్టిన పెట్టుబడులపై కొత్త నిబంధనల ప్రభావం ఉండదు.
విదేశీ వాటా ఎంత ఉండొచ్చంటే..
సెకండరీ మార్కెట్ కొనుగోళ్లు, లేదా గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్, లేదా అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ ద్వారా ప్రైవేటు బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడుదార్లు 74 శాతం వరకూ పెట్టుబడులు పెట్టొచ్చు.
''మేం భారత దేశానికి చెందిన బ్యాంకుగానే కొనసాగుతాం. అంతకు మించి షేర్‌హోల్డర్ల వర్గీకరణ(విదేశీ బ్యాంకుగా పరిగణన) మాపై ఏమంత ప్రభావం చూపదు. ఎందుకంటే ఇతర కంపెనీల్లో మేం భారీ స్థాయిలో ఏమీ పెట్టుబడులు పెట్టడం లేదు. కాబట్టి పెద్ద మార్పేమీ ఉండదు.'' - ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ, ఎండీ, చందా కొచ్చర్ |
ఎఫ్‌డీఐ విధానం బ్యాంకుకు ఎలాంటి సమస్యనూ తీసుకురాదు. మేం ఓ భారత బ్యాంకుగానే కొనసాగుతాం. కాబట్టి ఎవరైనా అలా(విదేశీ బ్యాంకు అని) ఎలా అంటారు? - హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎండీ ఆదిత్యపురి |

