
లక్ష్యం.. 16,865 మెగావాట్లు
అందివచ్చేది 3,946 మెగావాట్లే
ఉన్న ప్రాజెక్టులది నత్తనడక
కాగితాల్లో ఏడు ప్రాజెక్టులు
ఇంధనం పేరుతో జెన్‌కోకు బ్రేకులు
కొనుగోళ్లకే ప్రభుత్వం ఆసక్తి
'ఎత్తిపోతలు' తోడైతే అంధకారమే
హైదరాబాద్ - న్యూస్‌టుడే
దీర్ఘకాలిక అవసరాలకు అనుగుణంగా విద్యుదుత్పాదన ప్రణాళికలను అమలు చేయకపోవడంతో... రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఆనవాయితీగా మారిపోయింది. రోజురోజుకీ అవసరాలు పెరిగిపోతున్నా... ప్రభుత్వం మాత్రం అందుకు తగినస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించడం లేదు. కొత్త ప్రాజెక్టులను అమలు చేయడం లేదు... నిర్మాణంలో ఉన్నవాటిని శరవేగంగా పూర్తిచేయడం లేదు. సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం తరచుగా తాత్కాలిక పరిష్కారాలపైనే ఆధారపడుతోంది. ఏటా అధిక ధర చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయడానికే మొగ్గుచూపుతోంది. లోటు కారణంగా ప్రభుత్వం గత నాలుగేళ్లలో ఏకంగా రూ.12 వేల కోట్లను కరెంటు కొనుగోళ్లకే ఖర్చు చేసింది. అంతిమంగా ఈ భారం పడేది ప్రజలపైనే! ఈ మొత్తాన్ని వెచ్చిస్తే 3 వేల మెగావాట్ల ప్రాజెక్టు పూర్తవుతుంది. ప్రస్తుతం ఉన్న డిమాండు భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్న ప్రభుత్వం... అందుకు ఏం చేయబోతున్నదీ చెప్పడం లేదు. రాష్ట్రంలో చేపట్టిన ఎత్తిపోతల పథకాలు పూర్తయితే... ఇప్పుడున్న డిమాండ్‌కు తోడు అదనంగా 9 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం. అప్పటికి కూడా ఉత్పత్తి సామర్థ్యం ఏమాత్రం పెరగకపోతే... రాష్ట్రం అంధకారంలో చిక్కుకోవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


*ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 600 మెగావాట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి 2007లోనే నిర్ణయం తీసుకున్నారు. పక్కనే బొగ్గు గనులున్నాయి. నీరు, భూమీ లభించాయి. 2008 జనవరిలో బొగ్గు కేటాయింపుల కోసం ఏపీజెన్‌కో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు డబ్బులు డిపాజిట్ చేసి దరఖాస్తు చేసింది. 2008 నవంబరులో సీఎం లేఖకూడా రాశారు. రెండేళ్లవుతున్నా బొగ్గు కేటాయింపులు లభించలేదు.
*కరీంనగర్ జిల్లాలో 2100 మెగావాట్లతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టును 2005లోనే ప్రతిపాదించారు. 2007లో ఏపీజెన్‌కో చేపట్టింది. భూమి, నీరు అందుబాటులో ఉన్నాయి. కేజీ బేసిన్ నుంచి గ్యాస్ కేటాయించేందుకు రిలయన్స్ అంగీకారం తెలిపింది. కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ రెండేళ్లుగా మొండిచేయి చూపుతోంది. ఇదే కాలంలో ప్రైవేటు కంపెనీలు యంత్రాల తయారీ కంపెనీలకు నామమాత్రంగా చెల్లింపులు చేసి గ్యాస్ పొందాయి.
*నెల్లూరు జిల్లాలోని ఓడరేవు వద్ద 4వేల మెగావాట్ల ప్రాజెక్టు కోసం 2009 ఆగస్టులోనే బొగ్గు కోసం దరఖాస్తు చేసినా అనుమతి లభించలేదు.
*వీటీపీఎస్ 182 మెగావాట్ల ప్రాజెక్టు కోసం 2008 డిసెంబరులో దరఖాస్తు చేసింది. బొగ్గు కేటాయింపు రాలేదు.
సహకారం సున్నా: రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (ఏపీ జెన్‌కో) భారీగా చేపట్టిన ప్రాజెక్టులు అయిదేళ్లలో పూర్తిచేయడానికి రూ.88 వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఇంత మొత్తం ఏపీజెన్‌కో సొంతంగా సమకూర్చుకోలేదు. బ్యాంకు రుణాలు తీసుకున్నా కనీసం 10 శాతం అయినా జెన్‌కో తనవంతుగా పెట్టుకోవాలి. ప్రస్తుతం జెన్‌కోకి అంత సామర్థ్యం కూడా లేదు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు.
భారీ ప్రాజెక్టులు అనుమానమే: ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు విస్తరణ, కొత్త ప్రాజెక్టుల్లో తక్కువ సామర్థ్యం గల యూనిట్లను పూర్తి చేయగలిగినా భారీ ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. వేలకోట్లను రుణంగా పొందడం జెన్‌కోకు అసాధ్యం. ఒకవేళ సాధ్యమైనా అప్పుల్లో నిండా మునగడం ఖాయమని ఓ ఉన్నతాధికారి 'న్యూస్‌టుడే'తో వ్యాఖ్యానించారు. పది, పదకొండో పంచవర్ష ప్రణాళికల్లో భారీ లక్ష్యాలను ప్రకటించినా అమలు చేయడంలో విఫలమైందనడానికి పక్కనున్న వివరాలే నిదర్శనం.

*విశాఖపట్నంలో 1064 మెగావాట్లతో హిందూజాకు 18 ఏళ్ల కిందట ప్రాజెక్టును మంజూరు చేయగా నేటి వరకూ అది ప్రారంభం కాలేదు. ఈ మధ్యే అనుమతులను పునరుద్ధరించగా... విద్యుత్ మొత్తం బయట అమ్ముకుంటామంటూ హిందూజా పట్టుబడుతోంది.
*కరీంనగర్ జిల్లాలో బీపీఎల్ కంపెనీకి 1994లో 500 మెగావాట్లతో ప్రాజెక్టు మంజూరు చేస్తే దాన్నింత వరకూ పూర్తి చేయలేదు. అనుమతులను అయిదునెలల కిందట మళ్లీ పునరుద్ధరించినా పనులు చేపట్టలేదు.
*రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో 1400 మెగావాట్లతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టును చేపట్టి ఆ తర్వాత జెన్‌కో వెనక్కి తగ్గింది.