పరిశ్రమలకు కరవైన ప్రోత్సాహం
రాష్ట్రంలో నూటికి 90 శాతం మంది చిన్న తరహా పారిశ్రామికవేత్తలే. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునే వారు పరిశ్రమలను స్థాపిస్తున్నారు. దీనికి 9 నుంచి 15 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి రావడం భారంగా మారింది. మరోవైపు వడ్డీకి భయపడి కొత్తగా పరిశ్రమలు స్థాపించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. వడ్డీ భారం తగ్గించేందుకు తమకూ పావలా వడ్డీ పథకాన్ని చేపట్టాలని పారిశ్రామికవేత్తలు అభ్యర్థించడంతో ప్రభుత్వం అప్పట్లో అంగీకరించింది. 2008 ఆగస్టు 20న జీవో జారీ కూడా చేసింది. హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లు మినహాయించి ఇతర ప్రాంతాల్లో మూలధన పెట్టుబడి కోసం రూ. అయిదు కోట్ల వరకూ రుణాలు తీసుకున్న వారి కోసం 2008 ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొంది. వెంటనే ఈ పథకానికి 120 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. 2008-09 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంతో ఆ ఏడాది అమల్లోకి కాలేదు. 2009-10 సంవత్సరానికి రూ. 5 కోట్లు కావాలని పరిశ్రమల శాఖ అభ్యర్థిస్తే కేవలం కోటి రూపాయలను కేటాయించారు. 2008-09 ఆర్థిక సంవత్సరం కింద దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోగా పాత వారికి ఇది వర్తించదని అధికారులు తిరస్కరించారు. 2009-10 కింద కొత్తగా 180 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి మార్చి 31 వరకు నిధులే విడుదల కాలేదు. నిధులను మంజూరు చేస్తూ ఆర్థిక సంవత్సరం చివరలో జీవో ఇచ్చినా నిధులు విడుదల కాలేదు. దరఖాస్తుదారులంతా పరిశ్రమల కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయారు. 2010-11 నుంచి కొత్త పారిశ్రామిక విధానం ప్రారంభమవుతున్నందున ఈ పథకానికి కేటాయింపులు పెంచి, పెద్దఎత్తున ప్రచారం కల్పించాలని పరిశ్రమల శాఖ ప్రతిపాదించింది. ప్రభుత్వం ఈ ఏడాదికి కోటి రూపాయలు మాత్రమే కేటాయించి అందులోనే సర్దుబాటు చేసుకోవాలని సూచించింది.
నిబంధనలే అడ్డంకి: ఆయా ఆర్థిక సంవత్సరాల్లో ప్రారంభించే పరిశ్రమలకే ఈ పథకంలో అర్హత కల్పించడం, అరకొరగా నిధులు కేటాయించడం... ఈ పథకం అమలుకు అడ్డంకిగా మారాయని చిన్నతరహా పారిశ్రామిక సంఘాల సమాఖ్య (ఫ్యాప్సియా) అధ్యక్షుడు విజయ్‌కుమార్ ఆదివారం 'న్యూస్‌టుడే'కి తెలిపారు. రెండేళ్ల కిందట చేపట్టిన వాటికీ, కొత్తగా విస్తరించే వాటికీ దీన్ని వర్తింపజేయాలని కోరినా ప్రభుత్వం స్పందించడంలేదన్నారు. బడ్జెట్‌లో నిధులను కేటాయించినా విడుదల చేయకుండా, వాటిని మిగిల్చుకునేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మరో పారిశ్రామికవేత్త వి.హన్మంతారావు విమర్శించారు. వెంటనే నిధులను విడుదల చేసి కొత్త పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలని వారు కోరుతున్నారు.