Tuesday, April 6, 2010

వూపందుకున్న నియామకాలు


వూపందుకున్న నియామకాలు
బారులు తీరుతున్న కంపెనీలు
మాంద్యం ముందునాటి పరిస్థితులు మాత్రం లేవు
నైపుణ్యమున్న విద్యార్థులకే ప్రాధాన్యం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
మాంద్యం మసకబారింది. ఉద్యోగాలు కాంతులీనుతున్నాయి. క్యాంపస్‌ ఇంటర్వ్యూలు విద్యార్థుల్లో కొత్త ఆశలు చిగురింపచేస్తున్నాయి. పరిమిత సంఖ్యలో డిసెంబరు నుంచే క్యాంపస్‌ ఇంటర్వ్యూల హడావుడి మొదలుకాగా.. గత రెండునెలల్లో ఈ ప్రక్రియకు 'జోష్‌' వచ్చింది. రానున్న రోజుల్లో ఈ జోరు మరింత పుంజుకుంటుందని భావిస్తున్నారు. 'గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉద్యోగాలు ఇస్తామంటూ సంప్రదిస్తున్న కంపెనీల సంఖ్య పెరిగింది. పెద్ద కంపెనీలు కూడా విద్యార్థుల్ని తీసుకునేందుకు ముందుకొస్తున్నాయి'' అని హైదరాబాద్‌ జేఎన్‌టీయూ ఉపకులపతి డీఎన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఆర్థిక మాంద్యం కారణంగా.. గత రెండేళ్లలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు బాగా తగ్గాయి. మొదటి శ్రేణికి చెందిన ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనే నియామకాలు జరిగాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి కళాశాలల్లో బాగా తగ్గాయి. ఈ ఏడాది పరిస్థితిలో మార్పు వచ్చింది. గత రెండేళ్లలో పోలిస్తే ఈ ఏడాది క్యాంపస్‌ ఇంటర్వ్యూలు పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మాంద్యం కన్నా ముందున్న స్థాయిలో మాత్రం నియామకాలు జరగటంలేదు. ఇన్ఫోసిస్‌, సీటీఎస్‌, విప్రో, టీసీఎస్‌, డెలాయిట్‌, మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ సంస్థలు విద్యార్థులను చేర్చుకునేందుకు ముందుకు వస్తున్నాయి. ఐటీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఈసీఈ, మెకానికల్‌, సివిల్‌ విద్యార్థులకు ఆఫర్లు లభిస్తున్నాయి. బోధనపరంగా, మౌలిక సదుయాలు మెరుగ్గా ఉన్న కళాశాలల్లో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు ఎక్కువగా జరుగుతున్నాయి.

* హైదరాబాద్‌లోని సీబీఐటీ కళాశాలలో ఇప్పటివరకు 500 మంది విద్యార్థులకు ఆఫర్లు వచ్చాయని, ఇంటర్వ్యూల ప్రక్రియ వచ్చేనెల వరకు కొనసాగుతుందని ప్రిన్సిపాల్‌ చెన్నకేశవరావు తెలిపారు.

* బీవీఆర్‌ఐటీ వ్యవస్థాపకుడు విష్ణురాజు మాట్లాడుతూ 'కిందటేడాది 160 మంది విద్యార్థులకు ఆఫర్లువస్తే ఈ ఏడాది ఆ సంఖ్య 110కు చేరుకుంది. త్వరలో మరింత పెరగనుంది. ఈ ఏడాది నుంచి జీఎస్‌ఎస్‌ అమెరికా, మెరికల్‌సాఫ్ట్‌ వంటి ద్వితీయశ్రేణి కంపెనీలు రిక్రూట్‌మెంట్లకు వస్తున్నాయి. వచ్చేఏడాది నాటికి పరిస్థితి మరిం త మెరుగుపడుతుంది'అని ఆశాభావాన్ని పేర్కొన్నారు.

* ఇదే వాతావరణం మరో 50 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కనిపిస్తోంది. జీఎన్‌ఐటీఎస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో కిందటేడాది 268 మంది ఉద్యోగ అవకాశాలు లభించగా ఈ సంఖ్య ఇప్పటికే 164కు చేరుకుందని సీనియర్‌ అధ్యాపకుడు రామలింగారెడ్డి తెలిపారు.

* కిందటేడాది 11వేల మందిని నియమించుకోగా ఈ ఏడాది నియామకాల సంఖ్య 12వేలకు చేరిందని ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదింకా మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

జేకేసీల్లోనూ జోరు
రాష్ట్రంలోని 505 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో జవహర్‌ విజ్ఞాన కేంద్రాలు (జేకేసీ) ఉన్నాయి. వీటి ద్వారా 2008-09లో 946 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. 2009-10లో ఇప్పటివరకు 516 మందికి ఇన్ఫోసిస్‌లోనే ఉద్యోగాలు లభించినట్లు జేకేసీ వర్గాలు తెలిపాయి. క్యాంపస్‌ ఇంటర్వ్యూలు ప్రక్రియ మొత్తం ముగిసేసరికి 2వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయనే ఆశాభావం వ్యక్తంచేశాయి. ఆర్థిక మాంద్యానికి ముందు జేకేసీల ద్వారా సుమారు 3500 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి.

'బి' స్కూళ్లలోనూ
బీటెక్‌ విద్యార్థులే కాక బిజినెస్‌ స్కూళ్లలోనూ ఉపాధి అవకాశాలు పెద్దఎత్తున వస్తున్నాయి. కోర్సులు పూర్తయ్యే నాటికి మొత్తం వంద శాతం విద్యార్థులు ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని తేల్చి చెబుతున్నారు. ఉస్మానియా వర్సిటీలోని ఐపీఈ (ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజస్‌)లో మరో రెండునెలల్లో పీజీ కోర్సుల్ని పూర్తి చేస్తున్న విద్యార్థుల్లో చాలా మంది ఉపాధి అవకాశాలు చేజిక్కించుకున్నారు. ''గతేడాది కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల్లో 70శాతం మంది క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఎంపికయ్యారు. ఈ ఏడాది కోర్సు పూర్తయ్యే నాటికి వందశాతం విద్యార్థులకు ఉద్యోగాలు రావటం ఖాయం'' అని ఆ సంస్థ ప్లేస్‌మెంట్‌కో-ఆర్డినేటర్‌ ఎ.జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. మరో నెలలో తమ వద్ద ఎంబీఏ పూర్తి చేయనున్న విద్యార్థులకు కూడా నూటికి నూరుశాతం ఉద్యోగాలు వస్తాయని ఉస్మానియా బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ స్కూలు ప్రిన్సిపల్‌ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు.

'నైపుణ్యం'లో రాజీలేదు
అవకాశాలు పెరుగుతున్నాయని చెబుతున్నా కంపెనీలు వ్యవహరిస్తున్న తీరు గతంలో మాదిరిగా లేదు. ఎక్కువ మందిని ఎంపిక చేసుకునేలా కంపెనీలు వ్యవహరించేవి. విద్యార్థుల్లో సమాచార నైపుణ్యం (కమ్యూనికేషన్‌ స్కిల్స్‌), సాఫ్ట్‌స్కిల్స్‌ పెద్దగా లేకున్నా ఆయా విషయాల్లో శిక్షణ ఇవ్వచ్చన్న భావన వ్యక్తమయ్యేది. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించటం లేదు. ''అన్నీ అంశాల్లోనూ విద్యార్థులు నైపుణ్యం చూపించాలని కంపెనీలు చెబుతున్నాయి. ఇంగ్లిష్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి'' అని సాఫ్ట్‌వేర్‌ రంగం నిపుణుడొకరు పేర్కొన్నారు.