మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు
* ఆంధ్రప్రదేశ్ మనీ లెండర్స్ బిల్-2010 పేరుతో కొత్త చట్టం ముసాయిదా రూపొందించడానికి మంత్రివర్గం ఆమోదించింది.
* మోటారు వాహనాలపై జీవితకాల పన్ను పెంచేందుకు వీలుగా ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీచేయాలన్న నిర్ణయం. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందనందున న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండటానికే ఈ నిర్ణయానికి వచ్చారు. కార్లకు 9 నుంచి 12 శాతానికి, కంపెనీ వాహనాలకు 12 నుంచి 14 శాతానికి, రెండు అంతకంటే ఎక్కువ వ్యక్తిగత వాహనాలకు 12 నుంచి 14 శాతానికి పన్ను పెంచనున్నారు.
* రోడ్డు రోలర్లతో సమానంగా నిర్మాణ పరికరాల వాహనాలను జీవితకాల పన్ను పరిధిలోకి తెచ్చారు.
* గతేడాది పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారులు, సిబ్బందిని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను, తిరుమల తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్ సెక్యూరిటీ విభాగాన్ని విభజించే ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేశారు.
* నిజమాబాద్ జిల్లా బోధన్ డిగ్రీ కళాశాలలో ఉర్దూ మాధ్యమం కోసం ఐదు లెక్చరర్ల పోస్టుల మంజూరుకు నిర్ణయం తీసుకున్నారు.
* ఆంధ్రప్రదేశ్ మాంస అభివృద్ధి సంస్థను మూసివేస్తూ దాని స్థానంలో ఏపీ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం.
* మచిలీపట్నం పోర్టు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంపెనీలో లీడ్ ప్రమోటర్‌ను మార్చి...సవరించిన రాయితీ (రివైజ్‌డ్ కన్సెషన్ అగ్రిమెంట్) ఒప్పందం కుదుర్చుకునే ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభం వల్ల లీడ్ ప్రమోటర్‌గా ఉన్న మేటాస్ ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించ లేకపోయినందునఅడ్వొకేట్ జనరల్ న్యాయసలహాపై నవయుగ ఇంజినీరింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించారు.
* విశాఖపట్నంలో ఇండో జర్మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సంస్థకు5.28 ఎకరాల భూమి, నిర్మించిన భవనాన్ని లీజుకు ఇచ్చే ప్రతిపాదనను ఆమోదించారు. ఇందుకు 25 ఏళ్లపాటు ఏడాదికి లక్షరూపాయల వంతున నామమాత్రపు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
* కర్నూలు జిల్లా దిన్నెవరప్పాడు గ్రామంలో ఆర్టీసీ ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘానికి మార్కెట్ విలువ ప్రకారం ఎకరాకు రూ.2 లక్షలతో 30.05 ఎకరాల భూమి కేటాయింపు
* గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని కోనంకి గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూలు ఏర్పాటుకు ఉచితంగా 4.24 ఎకరాల భూమి కేటాయింపు
* నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ఎల్లారెడ్డి గూడెంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు 59.23 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం లభించింది.
* కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ఏర్పాటుకు అనంతపురం జిల్లాలోని ఐదు గ్రామాల్లో ఉచితంగా 11.38 ఎకరాల భూమికేటాయింపు.