అధ్యయనానికి వెళ్లొచ్చిన అధికార్ల బృందం
వచ్చే వేసవి నుంచి అమలు!
హైదరాబాద్, న్యూస్‌టుడే:పరిశ్రమలు విద్యుత్ సెలవు నుంచి విముక్తి పొందే రోజులు రానున్నాయి. ఏటా వేసవిలో కరెంటు కష్టాల నుంచి పరిశ్రమలు బయటపడే మార్గాలను ఏపీ ట్రాన్స్‌కో అన్వేషిస్తోంది. పారిశ్రామిక వర్గాల సమన్వయంతో ఇప్పటికే ఈ దిశగా కసరత్తు ప్రారంభించింది. కరెంటు కొరత ఎక్కువగా ఉన్న రోజుల్లో పరిశ్రమల కోసం బయట నుంచి కొనుగోలు చేసి అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రాబోయే సీజన్ నుంచి కొత్త పద్ధతి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విధానంలో కరెంటు కొనుగోలుకయ్యే ఖర్చు పరిశ్రమలే చెల్లించాల్సి ఉంటుంది. దీనికి పారిశ్రామికవర్గాల నుంచి కూడా సానుకూలత వ్యక్తమవుతోంది. తమిళనాడులో ఈ పద్ధతిలో పరిశ్రమలకు కరెంటు అందుతోంది. ఏపీ ట్రాన్స్‌కో, కరెంటు పంపిణీ సంస్థ(డిస్కం)ల నుంచి ఉన్నతస్థాయి అధికారుల బృందం తాజాగా అక్కడ పర్యటించి వచ్చింది. ఇతరసంస్థల నుంచి కొనుగోలు చేసిన కరెంటును పరిశ్రమలకు సరఫరా చేసి పరిశ్రమల నుంచి యూనిట్‌కు రూ.7 వసూలు చేస్తోంది. అక్కడ అమలవుతున్న తీరు, ఛార్జీల నిర్ణయంపై అధికారుల బృందం పారిశ్రామికవర్గాలతో కలిసి విశ్లేషిస్తోంది. ఏ సీజన్‌లో కరెంటు కొరత ఏర్పడుతుంది? ఆ సమయంలో కరెంటు కొనుగోలు చేసి సరఫరా చేయడానికి ఎలాంటి అవకాశాలున్నాయి?... తదితర అంశాలను పరిశీలిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం వారంలో రెండు రోజుల విద్యుత్ సెలవు అమలవుతోంది. పరిశ్రమలు జనరేటర్లపై ఆధారపడుతున్నాయి. ఫలితంగా యూనిట్‌కు రూ.14పైగా భారం పడుతోంది. ఇదే సమయంలో రాష్ట్ర అవసరాల కోసం ఏపీట్రాన్స్‌కో కొనుగోలు చేస్తోన్న కరెంటు యూనిట్ రూ.8 చొప్పున పడుతోంది. ఈ లెక్కన ట్రాన్స్‌కో కరెంటు కొనుగోలు చేస్తున్న ధరను చెల్లించడమే మేలనే భావనకు పారిశ్రామిక వర్గాలు వచ్చాయి. ప్రస్తుత సీజన్‌లోనే కొన్ని పరిశ్రమలు ఇలా కొనుగోలుచేసిన కరెంటు ఇస్తే ఖర్చు భరించడానికి ముందుకొచ్చినా అమలుకాలేదు. తమిళనాడులో యూనిట్ రూ.7 చొప్పున ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఇక్కడ మాత్రం కొనుగోలు ధర ఎంతయితే అంతే మొత్తాన్ని ఛార్జీగా విధించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. మరోవైపు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని, కొనుగోలు సీజన్‌కు ముందే టెండర్లు పిలిస్తే యూనిట్ రూ.2 నుంచి రూ.4కే కరెంటు దొరికే అవకాశాలున్నాయని ట్రాన్స్‌కో ఉన్నతాధికారి ఒకరు 'న్యూస్‌టుడే'తో పేర్కొన్నారు. గత డిసెంబరులో ట్రాన్స్‌కో టెండర్లు పిలిచిన సమయంలో యూనిట్ రూ.2.50 చొప్పున ఇవ్వడానికి కొందరు కరెంటు వ్యాపారులు ముందుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ విధానంలో జనవరి నుంచి మే వరకు కరెంటు ఇచ్చే అవకాశాలున్నాయి. అది కూడా ప్రత్యేక ఫీడర్లు ఉన్న పెద్ద పరిశ్రమలకు మాత్రమే ఇవ్వడానికి సాధ్యమవుతుంది. ఈ తరహాలో కరెంటు సరఫరా చేయడానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి తీసుకోవాలి. ఈ కసరత్తు అంతా పూర్తయితే వచ్చే సీజన్ నుంచి ఈ కొత్త విధానం అమలు చేస్తారు.