ఉద్యోగినుల జీవితంలో వివాహం పెద్ద మలుపైతే, పండంటి బిడ్డను కన్నాక మొదలవుతుంది అసలైన పరీక్ష. అటు కెరియర్... ఇటు పాపాయి సంరక్షణ. ఎటు మొగ్గాలి? తొలి దశలో పిల్లల పెంపకానికి ప్రాధాన్యం అధికమవుతున్న ఈ రోజుల్లో కెరీర్‌కు కొంత విరామం ఇవ్వడం సముచితమే అంటూ... మున్ముందు ఉద్యోగంలో చేరడానికి తగిన పరిజ్ఞానం పెంచుకోవడంపై దృష్టి నిలపాలంటున్న ముగ్గురు మహిళలతో 'వసుంధర' మాట్లాడింది.
దగ్గర పడుతున్న ప్రాజెక్టు డెడ్‌లైన్, ఆఫీసులో ఎడతెగని పని, అనారోగ్యంతో ఉన్న బిడ్డ... ''నాకివాళ మరో మీటింగ్ ఉంది, రావడం లేటవుతుంది'' అంటూ భర్త నుంచి ఫోన్, ''బాబుకి జ్వరం ఎక్కువైంది'' అంటూ కేర్ సెంటర్ నుంచి మరో ఫోన్... ఇలాంటి పరిస్థితులు ఉద్యోగం చేస్తున్న మహిళకు ఏదో ఒకరోజు ఎదురయ్యేవే! ''వెధవ ఉద్యోగం మానేస్తే బాగుండు'' అనిపించే బలహీన క్షణాలు కూడా ఉద్యోగినుల జీవితంలో అరుదేమీ కాదు. జీవిత రథానికి రెండు చక్రాలు భార్యాభర్తలైతే ఒక చక్రం సంపాదనకు పరిమితమైతే, మరొకటి ఇల్లు చూసుకోవడం అన్నది పాత మాట. మహిళకు ఆర్థిక స్వాతంత్య్రం ఉండి తీరాల్సిన ఈ రోజుల్లో ఉన్నత విద్యావంతులైన మహిళలు వివాహం తరవాత ఇంటికీ, కెరీర్‌కీ సమ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలని కేర్ సెంటర్లలో చేర్చి ఆఫీస్‌కి వెళ్లడం సర్వసాధారణంగా మారింది. అయితే వ్యష్టి కుటుంబాలు ఎక్కువైన కారణంగా ఉన్న ఒకరిద్దరు పిల్లలు ఇంట్లో ఎవరూ ఉండని సమయాల్లో ఒంటరితనంతో బాధపడటం, దాని ప్రభావం వారి ప్రవర్తన మీద, చదువు మీద పడటం నెమ్మదిగా ప్రారంభమైంది. ఇది చాపకింద నీరులా విస్తరిస్తూ తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఓ పలుచని పొరను సృష్టిస్తోంది. మరోపక్క ఉద్యోగం చేస్తున్న మహిళల్లో ఒక కొత్త ఆలోచనా ధోరణి అంకురించడానికి ఇది తెరతీసింది.
ఆర్థిక స్వాతంత్య్రం అవసరమే అయినా, పిల్లలకు మించిన ప్రాముఖ్యం దానికి ఇవ్వనక్కర్లేదనే దిశగా కొందరు విద్యావంతులైన తల్లులు భావిస్తున్నారు. ఉన్న ఒకరిద్దరు పిల్లలు తమ సొంత పెంపకంలో పెరగాలనీ, వారి భావాలను అర్థం చేసుకుని వారికి తల్లి ప్రేమ లోటు రాకుండా చూడాలని యోచిస్తున్నారు. ఆలోచనలు, భావాలు వికసించే వయసులో వారిని పని మనుషుల మీదో, కేర్ సెంటర్లలోనో వదలడం వారి భవిష్యత్తు మీద, ఆలోచనా విధానం మీద తప్పక ప్రభావం చూపిస్తుందని వీరి వాదన! ఉన్నత విద్యావంతులై, పిల్లల కోసం కెరీర్‌ని త్యాగం చేసి పూర్తిగా వారి ఆలనాపాలన మీదే దృష్టి కేంద్రీకరిస్తున్న మన రాష్ట్రానికే చెందిన మహిళల దృక్కోణాలు చదవండి.
ఆలనాపాలనకే ప్రాధాన్యం... శ్రీలక్ష్మి కమల పమ్మి,ఎమ్మెస్సీ కంప్యూటర్స్
నాకు ఇద్దరు పిల్లలు. మా అమ్మగారు ప్రభుత్వ ఉద్యోగిని. చిన్నప్పుడు అమ్మ ఇంట్లో లేని సమయాల్లో ఆమెను మేమెంతగానో మిస్ అవడం నాకింకా గుర్తుంది. సెలవు రోజొస్తే పండగలా ఉండేది. రోజూ అమ్మ ఇలా ఇంట్లో ఉంటే ఎంత బావుండునో అనిపించేది. అందుకే వివాహం అయిన తరవాత అటువంటి పరిస్థితి, నా పిల్లలకు రాకూడదని అనుకున్నాను. భార్యాభర్తల్లో ఒకరికి మంచి సంపాదన ఉన్నప్పుడు రెండో వారు తప్పక ఉద్యోగం చేసి తీరాల్సిన అవసరం లేదని భావిస్తాను. మా వారు ఐటీ రంగంలో ఉన్నతోద్యోగంలో ఉన్నారు. అందుకే పిల్లల బాధ్యత పూర్తిగా నేను తీసుకున్నాను. వాళ్ల పెంపకంలోని ప్రతి క్షణాన్నీ ఎంతో ఆనందిస్తాను. అమ్మతో గడపాల్సిన పిల్లల బాల్యం మళ్లీ తిరిగి రాదు. అది వారి జీవితంలో ఒక లోటుగా మిగలకూడదు సరికదా, ఒక మధుర జ్ఞాపకంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేనూ ఐటీ రంగంలోకి ప్రవేశిస్తే పిల్లలకు కావలసిన సమయాన్ని కేటాయించలేకపోవచ్చు. కాబట్టి భవిష్యత్తులో ఉద్యోగం చేయాలనుకుంటే బోధనా రంగాన్ని ఎంచుకుంటాను. |
పరిజ్ఞానం అప్‌డేట్... అనుభా గోయల్, బీఈ ఎలక్ట్రానిక్స్
నాకు ఇద్దరు పిల్లలు. పెళ్లికి ముందు ఆరేళ్లు టీసీఎస్‌లో పని చేశాను. పాప పుట్టాక ఒకటిన్నర ఏడాది ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేశాను. కానీ పాపకు నా అవసరం మరింత ఉందని భావించి ఉద్యోగం వదిలేశాను. తరవాత బాబు పుట్టాడు. నా సమయమంతా వీరిద్దరి కోసమే వెచ్చించడాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నాను.కేర్ సెంటర్లలో ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, పసి వయసులో పిల్లల ఆలోచనా విధానం సక్రమ మార్గంలో వికసించడానికి తల్లి అవసరం ఎంతో ఉంది. ఉద్యోగం వదిలేసినంత మాత్రాన ఖాళీగా ఉంటున్నామని బాధపడక్కర్లేదు. ఎప్పటికప్పుడు, సబ్జెక్ట్‌లో వస్తున్న మార్పులను గమనిస్తూ ఉద్యోగ సంబంధిత పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటే ఎప్పుడైనా సంపాదించడం కష్టమేమీ కాదు. ఎప్పుడూ అప్‌డేటెడ్‌గా ఉండటం మాత్రం ముఖ్యం! నా మటుకు నేను పిల్లల్ని చూసుకుంటూనే 5-7 ఏళ్ల వయసు గల పిల్లల కోసం సులభంగా గణితాన్ని బోధించడానికి ఒక సీడీని ఈ మధ్యనే విడుదల చేశాను. నేనింట్లో లేకపోయినా తమ పనులు తాము స్వతంత్రంగా చూసుకోగల్గిన వయసు వచ్చాక తిరిగి ఉద్యోగం గురించి ఆలోచిస్తాను. |
అందమైన బాల్యం అందించడానికే... మానసీ జోషి: ఎంబీఏ
వివాహానికి పూర్వం, వివాహమయ్యాక పాప పుట్టే వరకూ ఒక ప్రముఖ సంస్థలో ఫైనాన్షియల్ అనలిస్టుగా పని చేశాను. పాప పుట్టాక కొద్ది నెలలు తన పెంపకంలో నిమగ్నమయ్యాక, నా కంటే తనను ఇంకెవరూ బాగా చూసుకోలేరనిపించింది. కేర్ సెంటర్లలోనూ, కేర్ టేకర్ల పెంపకంలోనూ పెరిగిన కొంతమంది పిల్లలను పరిశీలించాను. వారిలో కొంతమంది అంతర్ముఖులుగా ఉంటే మరికొందరు మొండిగా తయారవడం గమనించాను. కనీసం పాపకు స్కూలుకెళ్లే వయసు వచ్చే వరకూ నా సమయాన్ని పూర్తిగా తనకే కేటాయించాలనుకున్నా. ఆ తరవాతా ఇంటి నుంచి పని చేయగలిగే సౌలభ్యం ఉండే ఉద్యోగానికే ప్రాధాన్యం ఇస్తాను. ఖాళీగా సమయాన్ని గడుతున్నాననో, ప్రొడక్టివ్‌గా లేననో నేను భావించను. అమ్మ ఒడిలో గడిపే అందమైన బాల్యం పిల్లలందరి సహజమైన హక్కు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమైనా సరే, పిల్లల్ని సరైన రీతిలో వారు నిరాశపడకుండా పెంచడం అంతకంటే ముఖ్యం. నేను అనుభవించిన అందమైన, నిశ్చింతకరమైన బాల్యం నా బిడ్డకు కూడా అందాలి. కేవలం ఇల్లు చూసుకునే గృహిణిగా మాత్రమే కాక, బాధ్యత గల తల్లిగా కొత్త జీవితాన్ని గడుపుతున్నాను.I am not just a housewife, Im proud that Im a mother too. పిల్లల కోసం కెరీర్‌ని త్యాగం చేసిన మహిళలు ఖాళీగా ఉంటున్నామని, ఏమీ చేయడం లేదని నిరాశపడటం సహజం. ఉమ్మడి కుటుంబాలు కరవైన కారణంగా ఒంటరితనం ఫీలవుతున్న పిల్లలు తల్లిదండ్రుల సమక్షాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం అవసరం లేని ఆర్థిక స్థిరత్వం ఉన్న మహిళలు కొన్నాళ్లపాటు విరామం తీసుకుని పిల్లల పెంపకం మీద దృష్టి నిలిపే ప్రయత్నం చేయొచ్చు. చేతిలో విద్య, మనసులో ఆత్మవిశ్వాసం ఉన్నంత వరకూ ఉద్యోగం ఎప్పుడైనా చేయొచ్చు. కాకపోతే ఎప్పటికప్పుడు తమ పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటూ అప్‌డేటెడ్‌గా ఉండటం మాత్రం తప్పనిసరి. |