హైదరాబాద్ గురువు అమెరికా శిష్యురాలికి సంగీతం నేర్పిస్తాడు.. సింగపూర్ అభిమాని ముంబై టీచర్ సాయంతో జాకీర్ హుస్సేన్‌లా తబలా వాయిస్తాడు. ఇంగ్లండ్ ఎన్నారై చెన్నై మాస్టారి చలవతో ఎం.ఎస్. సుబ్బులక్ష్మిలా పాడాలనుకుంటుంది. ఈ పరంపరలో గురుశిష్యుల మధ్య దూరం వేల కిలోమీటర్లు. ఉండేది మాత్రం ఎదురెదురుగానే. అక్కడి ఆశను ఇక్కడి ఆశయాన్ని కలిపేది ఆన్‌లైన్ సంగీతం. ఈ కొత్త తరహా ట్రెండ్‌లో ముఖ్య భూమిక యూత్‌దేనని వేరే చెప్పాలా!సరదాల చాటింగ్ స్థానే సరిగమలు వచ్చి చేరాయి.. మెయిల్స్ కోసమే కదిలే వేళ్లు గమకాలకు చోటిస్తున్నాయి.. లవ్ బ్రౌజింగ్‌కు ఓటేసే వెబ్‌కామ్ మ్యూజిక్ పాఠాలు నేర్పిస్తోంది.. ఇదో నయా ట్రెండ్.. సాంకేతిక అభివృద్ధి, సంప్రదాయ మేళవింపు.. టెక్నికల్‌గా చెబితే 'లైవ్ ఇంటర్నెట్ బేస్డ్ మ్యూజిక్ టీచింగ్'.. మన భాషలో చెప్పాలంటే ఆన్‌లైన్‌లో సంగీత పాఠాల బోధన.. 'నో బౌండరీస్ ఫర్ మ్యూజిక్' అంటున్న ఈ కొత్త సంగతులు ఈవారం మీకోసం..
ఎలా మొదలైందీ ట్రెండ్?
రియాలిటీ షోలు సింగింగ్ క్రేజీని అమాంతం పెంచేస్తున్నాయ్! ఈ మోజు ఎల్లలు దాటి ఎన్నారైలనీ తాకింది. కేవలం ఇదొక్కటేనా కారణం అంటే ఎంతమాత్రం కాదు. వలస బాట పట్టిన వాళ్లకు సహజంగా భారతీయ సంగీతంపై ఉన్న మక్కువా మరో కారణం. మరి ఇక్కడున్నట్టు సంగీత పండితులు అక్కడ లేరు కాబట్టే ఆన్‌లైన్ పాఠాలకు వెల్‌కం పలుకుతున్నారు. ఇప్పుడు ఈ లైవ్ ఐ.బి.ఎం.టి. (ఇంటర్నెట్ బేస్డ్ మ్యూజిక్ టీచింగ్) ప్రపంచమంతా మరింత వేగంగా అల్లుకుంటోంది!
అంతా పేరున్న గురువులే
అక్కడెక్కడో ఉన్నాం కదా? నిపుణులైన గురువులు దొరుకుతారా అన్న బెంగే అక్కర్లేదు. పాఠాలు నేర్పేందుకు ఉద్ధండులే సిద్ధంగా ఉన్నారు. కాసులు మూటకట్టుకోవాలనే ఆశ కొందరిదైతే.. కళను నేర్పాలనే తపన చాలా మందిది. అంతెందుకు తీరికలేని కచేరీలతో బిజీగా ఉండే హైదరాబాద్ బ్రదర్స్ (డి. శేషాచారి, డి. రాఘవాచారి) లాంటి మహామహులు సైతం ఆన్‌లైన్లో పాఠాలు నేర్పుతున్నారు. వయోలిన్‌లో దిట్ట ఆకెళ్ల మల్లిఖార్జునశర్మ రాగాలతో రంజింపజేస్తున్నారు. వైజర్సు బాలసుబ్రహ్మణ్యం, శేషులతా విశ్వనాథ్, నీతా చంద్రశేఖర్, భారతీ సుబ్రహ్మణ్యం, వర్ధని మేడం లాంటి పేరున్న గురువులూ బిజీ అయ్యారు. స్టీల్ సిటీ వైజాగ్ సైతం ఈ ఆన్‌లైన్ సంగీతానికి ఎప్పుడో వేదికగా మారింది.
ఎవరు నేర్చుకుంటున్నారు?
అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, కెనడా, గల్ఫ్ దేశాల్లోని ఎన్నారైలు ఎక్కువగా ఆన్‌లైన్ పాఠాలకు సై అంటున్నారు. వాళ్లలో బడికెళ్లే పిల్లల నుంచి కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులంతా సరిగమల సాధన చేసేవారే. చదువు, ఉద్యోగంతోపాటు సంగీతానికీ అక్కడ సమ ప్రాధాన్యం ఉంది కాబట్టే అంత ఆదరణ. నేర్చుకునేవాళ్లు సైతం సంప్రదాయ వస్త్రధారణతో కంప్యూటర్ల ముందు కూర్చొని అచ్చమైన గురుకుల విద్యార్థులను తలపిస్తున్నారు. చెన్నై మాస్టారు రాజారాం మాటల్లో చెప్పాలంటే 'నా స్టూడెంట్స్‌లో ఎక్కువమంది అమెరికా ఎన్నారైలే. అయినా వాళ్లనెపుడూ మోడ్రన్ దుస్తుల్లో ఉండడం చూడలేదు'.
ఏమేం నేర్పిస్తారు
ఆన్‌లైన్ పాఠాలు గాత్ర సంబంధమైన హిందుస్తానీ, కర్నాటక సంగీతాలకే పరిమితం కాలేదు. తబలా, సరోద్, మృదంగం, వేణువు, వయోలిన్, గిటార్, సితార్, పియానో.. ఇలా నేర్చుకోవడానికి ఎన్నెన్నో. సరిగమలతో మొదలైన పాఠాలు కచేరీలు చేసే స్థాయి వరకూ ఉంటాయి. అయితే ఆన్‌లైన్లో గాత్ర సంగీతం నేర్చుకోవడానికి ఉన్నంత సౌలభ్యం ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్‌కు ఉండదంటున్నారు పండితులు. దీనికోసం ముందు ఆన్‌లైన్ పాఠాలు చెప్పి తర్వాత రికార్డింగ్ చేసిన వీడియోలను పంపుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఇలాంటి ఇబ్బందులేం లేవు. వాళ్లు కేవలం కంప్యూటర్ తెరలకే పరిమితం కాకుండా పెద్దపెద్ద స్క్రీన్‌లు ఏర్పాటు చేసుకొని మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఫీజులెలా ఉంటాయి?
ఈ ఆన్‌లైన్ పాఠాలకు వ్యవధి ఇన్నిరోజులే అనే నియమం లేదు. వాళ్లవాళ్ల వీలును బట్టి నెలలు, సంవత్సరాల కోర్సులుంటాయి. రోజుకో గంట క్లాసుకు ఐదువందల నుంచి రెండువేల వరకు వసూలు చేస్తున్న వారున్నారు. కొన్ని సంస్థలైతే ఐటీ కోర్సుల్లా ప్యాకేజీలూ అందిస్తున్నాయ్. ఏదేమైనా ఈ ఆన్‌లైన్ సంగీత పాఠాల పుణ్యామాని మన భారతీయ సంగీతం సరిహద్దులు చెరిపేస్తూ నలు దిశలా వ్యాపిస్తోంది.
ఏమేం కావాలి?
నేర్చుకోవాలనే తపనతో పాటు ఓ కంప్యూటర్ దానికి 3 ఎం.బి.పి.ఎస్. కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. దాంతోపాటే వెబ్‌కెమెరా, మైక్రోఫోన్ ఉంటే చాలు వీడియో కాన్ఫరెన్స్ పాఠాలకు సిద్ధం కావచ్చు. వాయిస్, వీడియో చాటింగ్‌లకు అనుకూలంగా ఉండే ఏదైనా ఓ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరి. ఆన్‌లైన్ పాఠాలు చెబుతున్న తెలుగువాళ్లు ఎక్కువగా యాహూ మెసెంజర్, స్కైప్ లాంటివి యూజ్ చేస్తున్నారు.
విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువాళ్లు సంగీతం అంటే అభిమానం ఎక్కువ చూపిస్తున్నారు. మన విలువలు, సంప్రదాయాలు నిలుపుకోవాలనే తపన వారిలో కనపడుతోంది. అందుకే ఈ ఆన్‌లైన్ పాఠాలకు క్రేజ్. నేను 20 మందికి సంగీతం నేర్పిస్తున్నా. అమెరికా, మలేసియా, సింగపూర్, దుబాయ్‌లతోపాటు తమిళనాడు, బెంగళూరు, ఉత్తరాంచల్‌లో నా విద్యార్థులున్నారు. వాళ్లలో ఎక్కువమంది కాలేజీ స్టూడెంట్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. ఆదాయంతోపాటు సంగీతాన్ని నలుగురికి పంచాలనే నా కోరిక నెరవేరుతోంది. - వైజర్సు బాలసుబ్రహ్మణ్యం |
| - రామాచారి, సంగీత గురువు |

