Friday, April 9, 2010

అనంతపురంలో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టు

600 కోట్ల రూపాయల పెట్టుబడి

40 మెగావాట్ల ఉత్పత్తి
గల్ఫ్ కంపెనీతో ఆదిత్య సోలార్ ఒప్పందం

జెడ్డా నుంచి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో 604 కోట్ల రూపాయల పెట్టుబడితో 40 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం గల్ఫ్‌కు చెందిన ముల్క్ హోల్డింగ్స్‌తో బెంగళూరుకు చెందిన ఆదిత్య సోలార్ పవర్ ఇండస్ట్రీస్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. రెండేళ్ళలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తారు. ఈ భాగస్వామ్య సహకారంతో మరింతగా విస్తరించి తదుపరి దశలో మరిన్ని సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలలో చేపడతారు. ఉభయ సంస్థలు భారతీయ కాన్సల్ జనరల్ సంజయ్ వర్మ సమక్షంలో ఈ మేరకు ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి.

భారత ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన జవహర్‌లాల్ నెహ్రూ సోలార్ మిషన్ కార్యక్రమం కింద 2022 నాటికి 25 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యమని, ఈ లక్ష్యసాధనకు ఇలాంటి భాగస్వామ్యాలు అత్యంత అవసరమని సంజయ్ వర్మ ఈ సందర్భంగా అన్నారు. తొలిదశలో షార్జాలోనే యంత్ర పరికరాలు ఉత్పత్తి చేసి భారత్‌కు ఎగుమతి చేస్తామని, తర్వాత ఇండియాలోనే ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభిస్తామని ముల్క్ హోల్డింగ్స్ చైర్మన్ నవాబ్ షాజీ ఉల్ ముల్క్ తెలిపారు.

ముల్క్ సంస్థ అధిపతి కర్నూలు నవాబు
కర్నూలు నవాబు అయిన షాజీ ఉల్‌ముల్క్ తన వంశంపేరు మీద దుబాయ్‌లో నెలకొల్పిన ముల్క్ హోల్డింగ్‌లో భాగమే ఈ ముల్క్ ఎనర్జీ. సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఎనలేని కృషి చేసినందుకు గాను ఉత్తమ విదేశీ సంస్థగా ఎంపికైన ముల్క్ ఎనర్జీ దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్‌రాషద్ చేతులు మీదుగా పురస్కారాన్ని అందుకుంది. కర్నూలులోని తుంగభద్ర నదీ తీరాన ఉన్న వీరి కోటలో నవాబు సోదరుడు ఒకరు ఉండగా మిగిలిన వారు చాలా కాలం క్రితం దుబాయ్‌లో స్థిర పడ్డారు.