Tuesday, April 6, 2010

స్టీల్‌ ధరలకు రెక్కలు

ముంబాయి : దేశీయ స్టీల్‌ సంస్థ ఉత్తమ్‌ గల్వా రూ.6000 ప్రతి టన్ను స్టీల్‌ ధరలను పెంచినట్టుగా తెలిపింది. స్పాట్‌ మార్కెట్‌, నెలవారి కాంట్రాక్టుల్లో ఈ ధరలను టన్నుకు 6వేల రూపాయలుగా పెంచింది. తాజాగా ప్రకటించిన ధరలు ఏప్రిల్‌ 1వ తేదీ నుండే అమల్లోకి వచ్చాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే మాసం నుండి త్రైమాసిక కాంట్రాక్టుల ద్వారా రూ.9000ల ప్రతి టన్ను స్టీల్‌ ధరలను పెంచే లక్ష్యం కూడా ఉందని పేర్కొంది. దేశ స్టీల్‌ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఉత్తమ్‌ గల్వా సంస్థ ఎగుమతులను కూడా ఈ చేపడుతోంది. దేశీయ మార్కెట్లో ఆటోమోబైల్‌ రంగానికి ముఖ్య సరఫరాదారుగా ఉత్తమ్‌ గల్వా సంస్థ వ్యవహరిస్తోంది. దీనితో పాటు వైట్‌ గూడ్స్‌, సాధరణ ఇంజనీరింగ్‌, నిర్మాణ పరిశ్రమలకు కూడా సరఫరాదారుగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం 142 దేశాలతో పాటు ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, జర్మనీ, గ్రీస్‌, లండన్‌, అమెరికా దేశాలకు ఎగుమతులను ఉత్తమ్‌ గల్వా చేస్తోంది.


టన్ను ధర రూ.3000లకు పెంచేసిన ఇస్పాత్‌..
ఇదే బాటలో స్టీల్‌ రంగ సంస్థ ఇస్‌పాట్‌ ఇండస్ట్రీస్‌ తమ ఉత్పత్తుల ధరలను రూ.3000ల టన్నుకు పెంచేసింది. సంస్థ విస్తరణలో ప్రాజెక్టులకై భవిష్యత్‌లో రూ.700కోట్లను సమీకరించనున్నట్టుగా పేర్కొంది. యావరేజ్‌గా రూ.2,500 లను టన్నుకు పెంచినట్టు, ఈ కొత్త ధరలు ఏప్రిల్‌ 1వ తేదీ నుండే అమ వుతాయని తెలిపారు.

స్టీల్‌ విభాగాల ఆధారంగా రూ.2000, రూ.3000లు ప్రతి టన్నుకు పెంచుతున్నామని ఇస్‌పాట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ అనిల్‌ సురేఖా తెలిపారు. 2009-10 సంవత్సరంలోని మూడవ త్రైమాసికంతో పోలిస్తే, గత త్రైమాసికంలో మెరుగైన 5శాతం విక్రయ వృద్ధి నమోదైందని తెలిపారు. 2009-10 మూడవ త్రైమాసికంలో ఇస్‌పాట్‌ సంస్థ రూ.2,104.7కోట్ల విక్రయాలను, 18.9కోట్ల రూపాయల నికర లాభాలను ప్రకటించింది. పరిశ్రమలో ఐరన్‌ ఓర్‌, బొగ్గు ధరలు అధికం కావడంతో రూ.5000 టన్ను భారం పడుతుందనీ, తద్వారా వచ్చే నెలలో స్టీల్‌ ధరలను మరోసారి పరిశీలించే అవకాశం ఉందనీ పేర్కొన్నారు.

దేశీయంగా 7.6శాతం పెరిగిన స్టీల్‌ వినియోగం..
న్యూఢిల్లీ: దేశీయ స్టీల్‌ ఉత్పత్తుల వినియోగం పెరిగింది. 2010 ఆర్థిక సంవత్సరంలో 7.6శాతానికి దేశ స్టీలు వినియోగం పెరిగి 56.32మిలియన్‌ టన్నులుగా(ఎంటీ) నమోదైంది. గత ఏడాది ఇదే కాలానికి స్టీల్‌ వినియోగం 52.35ఎంటీగా ఉంది. ఆటోమోబైల్‌, వైట్‌గూడ్స్‌, నిర్మాణరంగాల్లో పెరిగిన డిమాండ్‌ కారణంగా ఈ వృద్ధి శాతం నమోదైంది. స్టీల్‌ మంత్రిత్వ శాఖ అందించిన గణాంకాల ఆధారంగా దేశ స్టీలు ఉత్పత్తి గత ఏడాది కన్నా 4.2శాతం పెరిగి 59.57ఎంటీగా నమోదైంది. దిగుమతులు కూడా ప్రోత్సాహకరంగా 23శాతం వృద్ధితో 7.18ఎంటీగా నమోదయ్యాయి.

తద్వారా దేశీయంగా రాబోయే రోజుల్లో స్టీల్‌ వనియోగం మరింత పెరిగి ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఈ రంగ ఎగుమతులు మాత్రం యథావిధిగా 28.7శాతానికి తగ్గి 3.16ఎంటీగా 2010 ఆర్థికంలో నమోద య్యాయి. ప్రాథమిక మార్కెట్లో డిమాండ్‌ నెమ్మదించడంతో పాటు పశ్చిమ మార్కెట్లు ఇంకా మాంద్య పరిస్థుల నుండి కోలుకోని కారణంగా ఎగుమతులు ఆశాజనకంగా నమోదవలేదు. దేశ స్టీల్‌ రంగ దిగ్గజాలైన టాటా స్టీల్‌ 10.5శాతం వృద్ధితో 5.02ఎంటీ విక్రయాలను నమోదు చేయగా, రాష్ట్రీయ ఇస్‌పాట్‌ నిగమ్‌ సంస్థ 15.7శాతం వృద్ధితో 2.9ఎంటీల వృద్ధిని గత ఆర్థిక ఏడాది కన్నా ప్రోత్సాహకరంగా నమోదు చేశాయి.