మోసపూరిత మెయిళ్ల వలలో పడొద్దంటూ పౌరులను హెచ్చరిస్తోంది
హెచ్చరిక
ఆదాయపు పన్ను విభాగం అధికారిక లోగోను వాడుతూ వచ్చే మోసపూరిత మెయిళ్ల వలలో పడొద్దంటూ పౌరులను హెచ్చరిస్తోంది ఆ శాఖ. పన్ను రిఫండ్‌కోసం పాన్ కార్డు, క్రెడిట్ కార్డు నంబర్లు కావాలంటూ వచ్చే మెయిళ్లను ఏమాత్రం విశ్వసించొద్దు అంటోంది. ఈతరహా ఈమెయిళ్లను మేం పంపం. కాబట్టి పన్ను చెల్లింపుదార్లు ఆ మెయిళ్లకు స్పందించొద్దు. ఒకవేళ అలా చేస్తే బాధ్యత మీదే' అని స్పష్టం చేసింది ఐటీ విభాగం. చాలామంది పన్ను చెల్లింపుదార్లు రిఫండ్ కోసం ఒకేసారి దరఖాస్తు చేసుకున్నపుడు సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగి మోసపూరిత మెయిళ్లను పంపే అవకాశం ఉంటుంది. వీరు ఆదాయ పన్ను విభాగం పేరును, లోగోను సైతం ఇందుకు వాడుకుంటున్నారని ఐటీ సెక్యూరిటీ సంస్థ ఒకటి తెలిపింది. గత కొద్ది రోజులుగా వేలకొద్దీ వ్యక్తులకు, కంపెనీలకు ఈ తరహా మెయిళ్లు అందుతూ ఉండటం గమనార్హం. ప్రతి ఏడాదీ ఈ సమయంలో హాకర్లు ఆదాయపు పన్ను విభాగం వెబ్‌సైట్‌లో చొరబడటానికి ప్రయత్నించడం మామూలేనని ఐటీ అధికార్లు అంటున్నారు.