మహిళల పేరుతోనే పట్టాలు
ఐదో విడతలో పంపిణీ లక్ష ఎకరాలే
50 శాతం ఎస్‌సీ, ఎస్టీలకు
14న షాద్‌నగర్‌లో ప్రారంభించనున్న సీఎం హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అయిదో విడత భూ పంపిణీ కింద దాదాపు లక్ష ఎకరాలను పంపిణీ చేయనున్నారు. వాటికి సంబంధించిన పట్టాలు మహిళల పేరుపైనే ఇస్తారు. ఈనెల 14న ముఖ్యమంత్రి రోశయ్య భూ పంపిణీ కార్యక్రమాన్ని మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ప్రారంభించనున్నారు. 1,00,615 ఎకరాలను పంపిణీకి గుర్తించామని, 69,506 మంది లబ్ధిపొందనున్నారని సీఎం తెలిపారు. అంతకుముందు నాలుగు విడతల్లో 6.03 లక్షల ఎకరాలను 4.33 లక్షల మందికి అందజేశామని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, పంపిణీ చేస్తున్న భూమిలో 50 శాతం ఎస్‌సీ, ఎస్టీలకు ఇస్తున్నామని వెల్లడించారు. సీఎం నివాసంలో జరిగిన సమీక్షలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.వి.ప్రసాద్, భూ పరిపాలన ముఖ్య కమిషనర్ పంకజ్‌ద్వివేది, రెవెన్యూ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ పాల్గొన్నారు. పేదలకు ఇచ్చిన భూమి అభివృద్ధికి ప్రత్యేక సమగ్ర ప్రణాళికను తయారు చేయాలని సీఎం ఆదేశించారు. భూ పంపిణీ, ప్రజా పథంపై ఈనెల 16న జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించాలని కోరారు. మహిళల పేరుపైన పట్టాలు ఇవ్వాలన్నది వైఎస్ ఆకాంక్ష అని గుర్తు చేస్తూ తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును ఆదేశించారు. పంపిణీకి ముందే లబ్ధిదారుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచేటట్లు చూడాలని సూచించారు. పర్యవేక్షణ, సమన్వయం కోసం రెండు మూడు జిల్లాలకో అధికారిని నియమించామని సీఎం చెప్పారు. పంపిణీ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు అందరినీ ఆహ్వానించాలని, ప్రొటోకాల్ పాటించాలని కలెక్టర్లకు సూచించారు. ఉపాధి హామీ, ఇందిర ప్రభ తదితర పథకాల కింద భూమి అభివృద్ధికి నిధుల వినియోగంపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
40 వేల ఎకరాలు తగ్గనుందా: అయిదో విడతలో 1.41 లక్షల ఎకరాలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫిబ్రవరిలో ప్రకటించారు. అయితే సీఎం జరిపిన సమీక్షలో దాదాపు లక్ష ఎకరాలు మాత్రమే ఇప్పటి వరకూ గుర్తించినట్లు వెల్లడైంది. తొలుత ప్రకటించిన దాని కంటే దాదాపు 40 వేల ఎకరాలు తగ్గినట్లుగా స్పష్టమవుతోంది.