Wednesday, April 14, 2010

ప్రహసనంగా రాష్ట్ర ఆర్థిక సంఘం

ఐదేళ్ల గడువు పూర్తి
అమలుకాని సిఫార్సులు
స్థానిక సంస్థలకు అందని నిధులు
తీవ్రంగా పరిగణించిన 13వ ఆర్థిక సంఘం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
దమూడవ ఆర్థిక సంఘం సిఫార్సులు ఎప్పుడెప్పుడా అని రాష్ట్రం కళ్లల్లో వత్తులేసుకొని ఎదురుచూసింది. కేంద్ర పన్నుల్లో అధిక వాటాకోసం పాకులాడింది. స్థానిక సంస్థలకు నిధుల్ని ఇవ్వటానికంటూ తానే ఏర్పాటుచేసిన 3వ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని మాత్రం ప్రహసనంగా మార్చేసింది. 3వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలుకావాల్సిన ఐదేళ్ల వ్యవధి ముగిసిపోయింది. అది చెప్పిందేమిటో ఇంతవరకు ఎవరికీ తెలియదు. రాష్ట్రం మాదిరిగానే స్థానిక సంస్థలు కూడా రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల కోసం ఎదురు చూడటం సహజం. వాటిని బలోపేతం చేస్తున్నట్టుగా పాలకులిచ్చిన ఊకదంపుడు ఉపన్యాసాలు మాత్రమే చివరికి మిగిలాయి.

రాష్ట్రంలో గ్రామ పంచాయితీలు, మండల పరిషత్‌లు, మున్సిపాల్టీలు వంటి స్థానిక సంస్థలన్నీ కలిపి ప్రస్తుతం 23,052 ఉన్నాయి. వీటికి రాష్ట్ర పన్నుల్లో వాటాలు, గ్రాంటులు తదితరాలను ఏ విధంగా ఇవ్వాలో చెప్పేందుకు రాజ్యాంగం ప్రకారం ఐదేళ్లకోసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటుచేసి, అదిచ్చే సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయాలి. ఇందులో భాగంగా 2004, డిసెంబరు 29వ తేదీన రాష్ట్రం 3వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటుచేసింది. ఇది సుదీర్ఘకాలం కొనసాగి 2009, జనవరి 31వ తేదీన తన నివేదికను సర్కారుకు అందజేసింది. తొలుత ఇచ్చిన గడువు ప్రకారమైతే నివేదిక కొద్ది నెలల వ్యవధిలోనే ప్రభుత్వానికి రావాలి. అందుకు భిన్నంగా ఏకంగా నాలుగేళ్లకు పైగా వ్యవధి తీసుకొన్నా సర్కారు మౌనం దాల్చింది. పోనీ నివేదిక రాగానే దాన్ని అమల్లోకి తెచ్చిందా? అంటే అదీలేదు. 3వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలు గడవు 2010 మార్చితో ముగిసిపోయింది. నిబంధనల ప్రకారమైతే అవి 2005-06 నుంచి అమల్లోకి రావాలి. ఇప్పుడు 4వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటుచేయాల్సిన సమయం వచ్చేసింది. సర్కారు మొండి వైఖరి కారణంగా గత ఐదేళ్ల కాలంలోనూ స్థానిక సంస్థలు అదనపు ఆర్థిక వనరులను కోల్పోవాల్సివచ్చింది.

ఇతర రాష్ట్రాల్లో వేగం
* పలు రాష్ట్రాలు ఇక్కడి మాదిరి కాకుండా చాలా వేగంగా కదిలాయి. తాము ఏర్పాటుచేసిన 3వ ఆర్థిక సంఘం నివేదికలను వెంటవెంటనే తెప్పించుకొని సిఫార్సులను అమల్లోకి తెచ్చాయి.

* సరిగ్గా ఇక్కడ ఆర్థిక సంఘం ఏర్పాటైన సమయంలోనే తమిళనాడులోనూ వచ్చింది. అక్కడ కేవలం 21 నెలల్లోనే నివేదిక సర్కారుకు చేరింది. సిఫార్సులను ఎలా అమలుచేస్తున్నదీ 2007 మే నెలలోనే అక్కడి ప్రభుత్వం అసెంబ్లీకి తెలిపింది.

* తమిళనాడు మాదిరిగానే వేగంగా నివేదికను అందుకొని అమలుచేసిన రాష్ట్రాల్లో.. మహారాష్ట్ర(18 నెలలు), పశ్చిమబెంగాల్‌(32), రాజస్థాన్‌ (29 నెలలు), కేరళ(33), ఒరిస్సా(27), హర్యానా(26) తదితర రాష్ట్రాలు ఉన్నాయి.

* రాష్ట్రంలో ప్రస్తుతం 2వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా నిధులను ఇస్తున్నట్టుగా చెప్పటమేతప్ప అవేమీ ఏ మాత్రం అమలు కావటంలేదు. కేవలం ఏడాదికి రూ.200 కోట్లు చొప్పున బడ్జెట్‌లో చూపించి అందులో సగమే విడుదలచేస్తున్నారు. సిఫార్సు ప్రకారమైతే వేలకోట్లు మొత్తం వీటికి వెళ్లాలి. ఇలా పాత సిఫార్సులను అమలు చేయటం నిబంధనలకు విరుద్ధం.

రాష్ట్రాల కట్టడికి ఇవీ కొత్త నిబంధనలు
* నివేదికల తయారీలో వేగాన్ని, నైపుణ్యాన్ని పెంచేందుకు జాతీయ 13వ ఆర్థిక సంఘం కొన్ని సిఫార్సులు చేసింది. వాటి ప్రకారం.. రాష్ట్రాలు ఇక తమ ఆర్థిక సంఘాల్లో నిపుణులను మాత్రమే నియమించాలి. సభ్యుల ఎంపిక ఆర్హతలను పేర్కొంటూ చట్టాన్ని తేవాలి.

* రాష్ట్రాలు నిర్ధిష్ట వ్యవధిలో నివేదికలను తెప్పించుకొని ఎటువంటి చర్యలు తీసుకొన్నది శాసనసభకు తెలియజేయాలి. అన్ని రాష్ట్రాల నివేదికలు ఒకే రకంగా ఉండేందుకు వీలుగా తన కొత్త నమూనా పత్రాలను అనుసరించాలి. గణాంకాల్లో నాణ్యత పెంచాలి.

* పాలన సంస్కరణల నిబంధనల్లో కొన్ని మార్పులు అవసరం. 'ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా' అనే చోట 'సిఫార్సులను పరిగణనలోకి తీసుకొన్న మీదట' అనే మార్పురావాలి. 'ప్రతి ఐదేళ్లకు' అనేచోట 'లేదా ముందుగా' అని మార్పుచేయాలి.