మెజారిటీ వాటాల విక్రయానికి ఒప్పందం ఖరారు
కడప (ఆన్‌లైన్): కడప జిల్లా ఉక్కు కంపెనీ బ్రహ్మణి స్టీల్స్‌లో మెజారిటీ వాటా జిందాల్ గ్రూప్ పరమైనట్లు తెలిసింది. బ్రహ్మణి స్టీల్స్‌లో 51 శాతం వాటా తీసుకుని యాజమాన్య బాధ్యతలు స్వీకరించేందుకు జిందా ల్ గ్రూప్ అంగీకరించినట్లు తెలిసింది. ఈ మేరకు ఉభయ పక్షాల మధ్య ఒప్పందం కూడా పూర్తయినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
బ్రహ్మణి స్టీల్స్ ప్రమోటర్ గాలి జనార్దన్‌రెడ్డికి సంబంధించిన ఓబులాపురం మైనింగ్ వివాదం ఏర్పడ్డాక బ్రహ్మణి స్టీల్స్‌లో పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జిందాల్ యాజమాన్యం బ్రహ్మణి స్టీల్స్‌లో మేజర్ వాటాను తీసుకునేందుకు ముందుకు రావడంతో చర్చలు కొనసాగాయి. ఒక దశలో ఏకమొత్తంగాబ్రహ్మణి స్టీల్స్‌ను కొనుగోలు చేయడానికి జిందాల్ ముందుకు వచ్చినట్టుగా చెబుతున్నారు.
అయితే గాలి జనార్ధన్‌రెడ్డి వర్గం అందుకు విముఖత చూపిందని అంటున్నారు. బ్రహ్మణి బాధ్యతలను జిందాల్ గ్రూప్ చేపట్టడం ఇక లాంఛనమేనని బ్రహ్మణి స్టీల్స్ వర్గాలు తెలిపాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, బ్రహ్మణి స్టీల్స్‌లో కీలకమైన స్థానా ల్లో తమ వ్యక్తుల నియామకాన్ని కూడా జిందాల్ ఖరారు చేస్తున్నట్టు చెబుతున్నారు.
కంపెనీ విలువ ఎంతకు మదింపు వేశారు. ఎంత మొత్తానికి మెజార్టీ వాటాలను విక్రయిస్తున్నారనే విషయం మాత్రం తెలియలేదు. కొద్ది రోజుల క్రితమే జిందాల్ గ్రూప్‌కు చెందిన ఆడిటర్లు, ఇంజనీరింగ్ నిపుణులు బ్రహ్మణి ప్లాంట్‌ను సందర్శించి ఇప్పటి వరకు చేపట్టిన పనుల విలువ మదింపు వేసినట్టుగా తెలిసింది. 4,500 కోట్ల వ్యయంతో 20 లక్షల టన్నుల ఉక్కు కర్మాగారాన్ని 18 నెలల్లో నిర్మించనున్నట్టుగా 2007 జూలైలో గాలి జనార్ధన్‌రెడ్డి అట్టహాసంగా ప్రకటించారు. 32 నెలలు గడిచినా ఉక్కు ఫ్యాక్టరీ వ్యవహారం నత్తనడకే నడుస్తోంది.