తాజ్‌కూ మాంద్యం సెగ!
గణనీయంగా తగ్గిన ఆదాయం
న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: ఏడు వింతల్లో ఒకటైన పాలరాతి కట్టడం తాజ్‌మహల్‌కూ ఆర్థిక మాంద్యం సెగ తప్పలేదు. దీంతో దీని ప్రవేశ రుసుం వసూలు గణనీయంగా తగ్గిపోయింది. ఈ తగ్గుదల రూ.3 కోట్ల మేర ఉందంటే.. కాస్తంత ఆశ్చర్యమే అనిపించినా నమ్మక తప్పని పరిస్థితి. 2007 నుంచి 2009 వరకు వసూలైన ప్రపంచ వారసత్వ కట్టడాల ప్రవేశ రుసుం వివరాలను పురావస్తు శాఖ మంగళవారం విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం కేంద్రం ఆధీనంలో ఉన్న 16 ప్రపంచ పర్యాటక కేంద్రాలకు ప్రవేశ రుసుం ద్వారా వచ్చే ఆదాయం 2009లో గణనీయంగా తగ్గింది. 2007లో రూ.64.70 కోట్లు వసూలవగా 2009కి రూ.50.04 కోట్లకు పడిపోయింది. ఆర్థిక మాంద్యం ప్రభావం వల్ల దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గడంతో 2009లో తాజ్‌మహల్ ప్రవేశ రసుం రూ.14.87 కోట్లకే పరిమితమైంది. 2007లో మాత్రం రూ.17.27 కోట్లు వసూలైంది. తాజ్‌మహల్ సమీపంలోని ఆగ్రాకోట, ఫతేపురి సిక్రీ తదితర పర్యాటక ప్రాంతాలపై మాంద్యం ప్రభావం పడింది. కుతుబ్‌మినార్, చంపనేర్-పావగడ్, ఎలిఫెంటా గుహలు, మహాబలిపురం, కోణార్క్ సూర్యదేవాలయం తదితర ప్రాంతాలకు మాత్రం ఆదాయం పెరగడం విశేషం. భారత్‌లోని 22 సాంస్కృతిక, అయిదు పాకృతిక స్థలాలు యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో ఉన్నాయి.