క్రయోజెనిక్ ఇంజిన్ విషయంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు ఇది రెండో ఎదురు దెబ్బ! 1992లో అమెరికా ఆంక్షలకు భయపడి.. రష్యా ఈ కీలక పరిజ్ఞానాన్ని ఇవ్వడానికి నిరాకరించినప్పుడు మొదట దెబ్బ తగిలింది. తరువాత 18 ఏళ్ల పాటు చెమటోడ్చి దీన్ని సొంతంగా తయారుచేసుకున్నాం. కోటి ఆశల మధ్య దీన్ని జీఎస్‌ఎల్‌వీ-డి3 రాకెట్‌లో పెట్టి పంపాం. రాకెట్ నింగిలోకి లేచిన కొద్దిసేపటికే మన ఉత్సాహం ఆవిరైంది. రాకెట్ నిర్దేశిత పథం నుంచి పక్కకు జారిపోయింది. కారణం.. క్రయోజెనిక్ ఇంజిన్ దశలో తలెత్తిన లోపం..!అసలేమిటీ క్రయోజెనిక్ ఇంజిన్.. మనకెందుకు ఇంత కొరకరాని కొయ్యగా మారింది? 18 ఏళ్లపాటు శ్రమించినా.. విజయం ఎందుకు వరించలేదు? అంతరిక్ష రంగం అంటే అనేక సంక్లిష్టమైన పరిజ్ఞానాల సమ్మేళనం. ఒక రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాలంటే వేలాది వ్యవస్థలు నిర్దేశిత సమయంలో అత్యంత కచ్చితత్వంతో పనిచేయాలి. ఎక్కడ చిన్నలోపం తలెత్తినా సరిదిద్దుకోవడానికి అవకాశమే ఉండదు. అందుకే అంతరిక్ష రంగంలో ఎదురుదెబ్బలు అగ్రదేశాలకూ సుపరిచితమే. ఆ మాటకొస్తే రష్యాకు చెందిన 11డి56 క్రయోజెనిక్ ఇంజిన్ వరుసగా నాలుగుసార్లు విఫలమైంది. ఈ వైఫల్యాల నుంచి కోలుకుని ముందుకు నడవడం రోదసి రంగంలో షరామామూలే!
| శీతల యంత్రం క్రయోజెనిక్స్ అనేది అత్యంత తక్కువ ఉష్ణోగ్రతకు సంబంధించిన శాస్త్రం. సాధారణంగా క్రయోజెనిక్ ఇంజిన్లలో హైడ్రోజన్ ఇంధనంగాను, దీన్ని మండించడానికి ఆక్సిజన్‌ను ఆక్సిడైజర్‌గాను వాడతారు. ఈ రెండింటినీ వాడటం వల్ల రాకెట్‌కు అత్యంత గరిష్ఠస్థాయిలో తోపు లభిస్తుంది. క్రయోజెనిక్ ఇంజిన్ల ఇంధన సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలు ఇంజిన్లతో ఇది సాధ్యం కాదు. జీఎస్‌ఎల్‌వీకి అమర్చిన క్రయోజెనిక్ ఇంజిన్ 73 కిలోన్యూటన్ల తోపును అందిస్తుంది. 2200 కిలోల ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టగలదు. హైడ్రోజన్, ఆక్సిజన్‌లు ప్రకృతిలో విరివిగా దొరుకుతాయి. పర్యావరణ అనుకూలమైనవి, పరికరాలకు ఎలాంటి హాని తలపెట్టవు. అయితే ఈ ఇంజిన్‌లో ఇంధన ట్యాంకులు భారీగా ఉంటాయి. బాహ్య ఉష్ణోగ్రత నుంచి రక్షించడానికి వీటికి పెద్దమొత్తంలో ఇన్సులేషన్ అమర్చాల్సి ఉంటుంది. ఇంధన సామర్థ్యం, గరిష్ఠ ప్రయోజనం కోణంలో చూస్తే ఈ ఇబ్బందులన్నీ నామమాత్రమే. హైడ్రోజన్ ద్రవ రూపంలోకి మారాలంటే మైనస్ 253 డిగ్రీలు, ఆక్సిజన్‌కు మైనస్ 183 డిగ్రీల ఉష్ణోగ్రతకు శీతలీకరించాలి. ఇదే ఇక్కడ అతిపెద్ద సవాల్. ఇంధనంతోపాటు ఇంజిన్‌లోని పరికరాలను కూడా శీతలీకరించాలి. లేకుంటే హైడ్రోజన్, ఆక్సిజన్ మళ్లీ వాయు రూపంలోకి మారిపోతాయి. |
19వ శతాబ్దం నుంచే.. శాశ్వత వాయువులను ద్రవ రూపంలోకి మార్చడానికి శాస్త్రవేత్తలు 19వ శతాబ్దం నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. * 1845లో మైఖేల్ ఫారడే అనే శాస్త్రవేత్త అనేక వాయువులను ద్రవ రూపంలోకి మార్చడంలో విజయం సాధించారు. పొడి ఐస్‌లో వాయువును ముంచి.. ఆ తరువాత అది ద్రవ రూపంలోకి మారే వరకూ దాని పీడనం పెంచుతూఉండేవారు. * ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, నైట్రిక్ ఆక్సైడ్ అనే ఆరు వాయువులు మాత్రం ద్రవ రూపంలోకి మారడానికి మొరాయించాయి. * వీటిలో ముఖ్యంగా ఆక్సిజన్, నైట్రోజన్‌లను ద్రవ రూపంలోకి మార్చడానికి శాస్త్రవేత్తలు అనేక ప్రయత్నాలు చేశారు. 1883లో ఎస్.ఎఫ్.వాన్ వాన్ వ్రాబ్లెస్కి అనే శాస్త్రవేత్త గణనీయ స్థాయిలో ఆక్సిజన్‌ను ద్రవ రూపంలోకి మార్చారు. ఇది మైనస్ 183 డిగ్రీ సెల్సియస్ వద్ద ద్రవ రూపంలోకి మారుతున్నట్లు గుర్తించారు. స్కాట్లాండ్‌కు చెందిన జేమ్స్ దీవర్ అనే శాస్త్రవేత్త 1898లో తొలిసారిగా హైడ్రోజన్‌ను ద్రవరూపంలోకి మార్చారు. ఇది మైనస్ 253 డిగ్రీ సెల్సియస్ వద్ద ఈ రూపాన్ని సంతరించుకుంటోందని తేల్చారు. * ఆ తరువాత అనేక దేశాలు వీటిని శీతలీకరణ కోసం ఉపయోగించాయి. * తొలిసారిగా ద్రవ ఆక్సిజన్, హైడ్రోజన్‌లను 1963లో అమెరికా.. తన 'అట్లాస్ సెంచార్' రాకెట్‌లో ఉపయోగించింది. * జపాన్ (1977), ఫ్రాన్స్ (1979), చైనా (1984)లో క్రయోజెనిక్ ఇంజిన్లను విజయవంతంగా అభివృద్ధి చేశాయి. * అంతరిక్షంలోకి తొలిసారి ఉపగ్రహాన్ని, మానవుడ్ని పంపిన రష్యా ఈ విషయంలో బాగా వెనుకపడిపోయింది. ఈ దేశం 1987లో మాత్రమే క్రయోజెనిక్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించింది. |
భారత్‌కూ ఆసక్తి క్రయోజెనిక్ ఇంజిన్ ప్రయోజనాలను భారత్ ముందే గమనించింది. దీని ద్వారా శక్తిమంతమైన ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చని గుర్తించింది. దీనిపై అధ్యయనానికి 1982లో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఇంజిన్‌ను అభివృద్ధి చేస్తే 10 టన్నుల తోపును ఉత్పత్తి చేయవచ్చని కమిటీ సూచించింది. ఆ తరువాత భారత్ డోలాయమానంలో పడిపోయింది. దీన్ని సొంతంగా అభివృద్ధి చేయాలా? పరిజ్ఞానాన్ని కొనుగోలు చేయాలా? అన్నది తేల్చుకోలేకపోయింది. చివరకు విదేశాల నుంచి కొనుగోలు చేయాలనే నిర్ణయించుకుంది. |
| ఆంక్షలు 1991లో రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ గ్లోవ్‌కాస్మోస్‌తో 12 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికింద రష్యా.. రెండు కేవీడీ-1 క్రయోజెనిక్ ఇంజిన్లతోపాటు వీటికి సంబంధించిన పూర్తి పరిజ్ఞానాన్ని భారత్‌కు అందించాల్సి ఉంటుంది. * దీనిపై అమెరికా గుడ్లురిమింది. క్రయోజెనిక్ పరిజ్ఞానాన్ని భారత్ క్షిపణుల కోసం వాడుతోందని ఆరోపించింది. దీంతో క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ ఒప్పందం (ఎంటీసీఆర్)ను తెరపైకి తెచ్చింది. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ గ్లోవ్‌కాస్మోస్, ఇస్రోలపై ఆంక్షలు విధించింది. దీంతో నాటి రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్ వెనకడుగు వేశారు. పరిజ్ఞానాన్ని మినహాయించి కేవలం రెండు కేవీడీ-1 క్రయో ఇంజిన్లను మాత్రమే ఇచ్చేలా ఒప్పందాన్ని మార్చివేశారు. * ఆంక్షలు విధించేనాటికే భారత ఇంజినీర్లు రష్యా నుంచి కొంత పరిజ్ఞానాన్ని పొందారు. దీని ఆధారంగా దేశీయంగా క్రయోజెనిక్ ఇంజిన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. * తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎస్‌ఎస్‌పీసీ)లో క్రయోజెనిక్ ఇంజిన్ల తయారీని చేపట్టారు. 7200 సెకన్లపాటు భూమి మీద ప్రయోగాత్మకంగా ఇంజిన్‌ను మండించారు. |
జఠిలం క్రయోజెనిక్ దశ అంటే కేవలం ఇంజిన్ మాత్రమే కాదు.. దానికి సంబంధించిన నియంత్రణ వ్యవస్థలు, సున్నితమైన వైరింగ్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటివి ఉంటాయి. అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కలిగిన ద్రవాలను నిల్వచేయడం, పంపింగ్ చేయడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియలు. వీటిని నిల్వ చేసే ట్యాంకులు, పంప్ చేసే పైపులకు సాధారణ లోహాలు వాడితే అవి పెళుసుబారిపోతాయి. సాధారణ కందెనలు గడ్డకడతాయి. అందువల్ల ప్రత్యేక మిశ్రమ లోహాలు అవసరం. * క్రయోజెనిక్ ద్రవాలను రవాణా చేయడానికి భిన్న రకాల లోహాలను వాడతారు. వీటిని కలిపి వెల్డింగ్ చేస్తారు. అల్యూమినియంతో తయారైన పైపులకు స్టెయిన్‌లెస్ స్టీల్‌పైపులను అతికించాల్సి ఉంటుంది. అలాగే రాగితో తయారైన పైప్‌కు నికెల్ పైప్‌ను జోడించాల్సి ఉంటుంది. పైపులు వ్యాసం 6 నుంచి 42 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటాయి. * హైడ్రోజన్ చాలా తేలిగ్గా లీకవుతుంది. అందువల్ల రెండు లోహాలతో తయారైన పైపులకు బోల్టులు బిగించడానికి బదులు వెల్డింగ్‌ను జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. * క్రయోజెనిక్ ఇంధనాలు పైపుల గుండా ప్రవహించేటప్పుడు.. పైపుల ద్వారా వాతావరణంలోని ఉష్ణోగ్రతను చాలా తేలిగ్గా గ్రహిస్తాయి. ఫలితంగా వాటిలో పీడనం పెరిగిపోతుంది. ఇంధనం ఆవిరైపోతుంది. అందువల్ల ఇంధనాలను పైపుల్లోకి పంప్ చేసేముందు వాటి ఉష్ణోగ్రతను కూడా ఇంధనాల ఉష్ణోగ్రతల స్థాయికి శీతలీకరించాలి. * క్రయోజెనిక్ ఇంజిన్ కోసం శక్తిమంతమైన అల్యూమినియం మిశ్రమలోహంతో తయారైన ట్యాంకులను ఇస్రో రూపొందించింది. రష్యా ట్యాంకులతో పోలిస్తే వీటి బరువు 100 కిలోల మేర తక్కువగా ఉండడం విశేషం. * క్రయోజెనిక్ దశ కోసం 95 శాతం లోహాలను హైదరాబాద్‌కు చెందిన మిథాని సరఫరా చేసింది. * క్రయోజెనిక్ దశ కోసం హైస్పీడ్ టర్బో పంపులను తయారు చేయడం అత్యంత సవాల్‌తో కూడుకున్న అంశం. ఎందుకంటే హైడ్రోజన్ సాంద్రత చాలా తక్కువ. అందువల్ల పంపులు నిమిషానికి 45వేల సార్లు పరిభ్రమిస్తేకాని ఇంధనం ముందుకు కదలదు. * ఒకవేళ హైడ్రోజన్ లీకైతే వెంటనే మంటలు అంటుకుంటాయి. ఇంత శీతల ఉష్ణోగ్రత వద్ద మంటలు కంటికి కనిపించవు. అందువల్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. |
పౌర అవసరాల్లోనూ వినియోగం క్రయోజెనిక్ పరిజ్ఞానాన్ని కేవలం రాకెట్లలోనే కాక ఇతర రంగాల్లో వాడతారు. * వీర్యకణాలు, పిండాలను ద్రవ నైట్రోజన్‌లో భద్రపరచవచ్చు. * జీవశాస్త్రానికి సంబంధించిన నమూనాలను యాంత్రిక ఫ్రిజ్‌లలో ఉంచితే మరమ్మతులకు లోనయ్యే ప్రమా దం ఎక్కువగా ఉంది. ఫలితంగా నమూనాలు చెడిపోతాయి. వీటిని ద్రవ నైట్రోజన్‌లో భద్రపరిస్తే ఈ ప్రమాదం రాదు. * రక్తం నిల్వ చేయడానికి, నెలలు నిండని శిశువులను ఉంచే ఇంక్యూబేటర్లలోనూ క్రయో పరిజ్ఞానం అక్కరకొస్తుంది.  పనిచేయని క్రయోజనిక్ ఇంజిన్ జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం విఫలం బంగాళాఖాతంలో కూలిన వాహకనౌక | ''భారతీయులందరికీ క్షమాపణలు చెబుతున్నా.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ దశ విఫలమవడంతో జీఎస్‌ఎల్‌వీ-డీ3 ప్రయోగం విజయవంతం కాలేదు.'' -శ్రీహరికోటలో ఇస్రో ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ | విషణ్ణవదనంతో చెప్పిన మాటలివీ.. శాస్త్రవేత్తల కరతాళ ధ్వనులు, వీక్షక్షుల కేరింతల మధ్య ఠీవీగా పైకి లేచిన జీఎస్‌ఎల్‌వీ-డి3 ఉపగ్రహ వాహకనౌక అంతలోనే నేల మీదకు జారిపోయింది. 18 ఏళ్ల శ్రమ, ప్రాజెక్టు కోసం వెచ్చించిన రూ.330 కోట్లు సముద్రంపాలయ్యాయి. సగర్వంగా అగ్రరాజ్యాల సరసన దేశాన్ని నిలబెట్టాలని అహోరాత్రులు శ్రమించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలకు తీవ్ర నిరాశ ఎదురైంది. చరిత్రాత్మక ప్రయోగంతో బోణీ కొడదామనుకున్న సంస్థ ఛైర్మన్ రాధాకృష్ణన్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. 29 గంటల కౌంట్‌డౌన్‌ను పూర్తిచేసుకున్న జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (జీఎస్‌ఎల్‌వీ-డి3) గురువారం సాయంత్రం 4.27 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. భూమికి 36వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భూస్థిర కక్ష్యలో ఇది జీశాట్-4 అనే సమాచార ఉపగ్రహాన్ని వదిలిపెట్టాల్సి ఉంది. 50 మీటర్ల ఎత్తు, 416 టన్నుల బరువు ఉండే జీఎస్‌ఎల్‌వీ-డీ3 వాహకనౌకలో మూడు దశలుంటాయి. తొలిదశలో ఘన ఇంధనాన్ని, రెండోదశలో ద్రవ ఇంధనాన్ని వాడారు. కీలకమైన మూడోదశలోని ద్రవీకృత హైడ్రోజన్, ఆక్సిజన్‌లను మండించేందుకు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజిన్‌ను వాడారు. తొలి రెండు దశలు విజయవంతమయ్యాయి. దీంతో శ్రీహరికోటలోని మిషన్ కంట్రోల్ గదిలో పండుగ వాతావరణం నెలకొంది. ఆ తరువాత మూడోదశలో క్రయోజెనిక్ ఇంజిన్ పని ప్రారంభించిందని తెలియగానే శాస్త్రవేత్తలు ఒక్కసారిగా కరతాళ ధ్వనుల్లో మునిగిపోయారు. ఈ ఆనందం ఎక్కువసేపు నిలబడలేదు. నిర్దేశిత పథంలో సాగాల్సిన రాకెట్ గమనం... ఉన్నట్లుండి పక్కకు జారిపోతున్నట్లు కంప్యూటర్ తెరపై కనపడింది. దీంతో అక్కడ ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. అప్పటిదాకా చప్పట్లతో మారుమోగిపోయిన గదిలో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం అలముకుంది. ప్రయోగించిన 504 సెకన్లకు జీఎస్‌ఎల్‌వీతో పాటు అందులోని 2200 కిలోల బరువైన జీశాట్-4 కూడా సముద్రంపాలైంది. ప్రయోగం విఫలమైందని ధ్రువపరచుకున్న ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ వెంటనే ప్రకటన చేశారు. ఈ ప్రయోగం తాత్కాలిక విజయం మాత్రమే సాధించిందని, మూడో దశలో క్రయోజెనిక్ ఇంజిన్‌లో భాగంగా ఉన్న రెండు వెర్నియర్ ఇంజిన్లు మొరాయించడం వల్లే రాకెట్ దిశ కోల్పోయిందని చెప్పారు. ప్రధాన క్రయోజెనిక్ ఇంజిన్ పనిచేసి ఉండొచ్చని తెలిపారు. ప్రయోగం విఫలం కావడానికి పూర్తి కారణాలను రెండు మూడు రోజుల్లో నిర్ధరిస్తామన్నారు. దేశీయ పరిజ్ఞానంతో క్రయోజెనిక్ ఇంజిన్‌తో కూడిన మరో జీఎస్‌ఎల్‌వీని ఏడాదిలో పరీక్షిస్తామని చెప్పారు. రష్యా నుంచి ఏడు క్రయోజనిక్ ఇంజిన్లను పొందామని, వాటిలో అయిదింటిని వాడుకున్నామని.. ఇంకా రెండు ఉన్నాయని వాటిని జీశాట్5, 6 ఉపగ్రహ ప్రయోగాలకు వినియోగిస్తామని రాధాకృష్ణన్ వెల్లడించారు. ''1993 నుంచి క్రయోజనిక్ ఇంజిన్‌ను అభివృద్ధి చేయడానికి ఇస్రో ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ పరిజ్ఞానం కలిగి ఉన్న అమెరికా, రష్యా తదితర దేశాలకు సైతం ఈ పరిజ్ఞానాన్ని పొందడానికి 10 నుంచి 15 సంవత్సరాలు పట్టింది. 2013లో చంద్రయాన్-2 ప్రయోగం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన క్రయోజనిక్ ఇంజిన్‌ను వాడే జీఎస్‌ఎల్‌వీ వాహకనౌక ద్వారానే జరుగుతుంది. జీఎస్‌ఎల్‌వీ వాహకనౌక కోసం రూ.175 కోట్ల నుంచి రూ.185 కోట్లు ఖర్చుకాగా, జీశాట్4 ఉపగ్రహం తయారీకి రూ.150 కోట్లు ఖర్చు అయ్యాయి'' అని తెలిపారు. జీశాట్4 కేవలం ప్రయోగాత్మక ఉపగ్రహమేనని, ఈ ప్రయోగం విఫలమవడంతో ఎలాంటి నష్టం కలగదని వెల్లడించారు. శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం విఫలం కావడంతో రాధాకృష్ణన్ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రాలేదు. ముందుగా నిర్ణయించిన మేరకు ఛైర్మన్ గురువారం రాత్రికి తిరుమలకు చేరుకుని శుక్రవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొనాల్సి ఉంది. | | రెండుకు చేరిన జీఎస్‌ఎల్‌వీ వైఫల్యాలు సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష ప్రయోగకేంద్రం 'షార్' నుంచి ఇప్పటివరకు 54 ప్రయోగాలు జరగ్గా.. అందులో జీఎస్‌ఎల్‌వీ వాహకనౌక ద్వారా జరిగినవి అయిదు. వీటిలో ఒకటి విఫలమవగా, గురువారంనాటి ఆరో జీఎస్‌ఎల్‌వీ-డీ3 ప్రయోగం కూడా విఫలమైంది. *2001 ఏప్రిల్ 18న జీఎస్‌ఎల్‌వీ-డీ1 ద్వారా జీశాట్1 ఉపగ్రహాన్ని ప్రయోగించగా అది విజయవంతమైంది. *2003 మే 8న జీఎస్‌ఎల్‌వీ-డీ2 ద్వారా జీశాట్2 ఉపగ్రహాన్ని ప్రయోగించగా, అది కూడా విజయవంతమైంది *2004 సెప్టెంబరు 20న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్01 ద్వారా జీశాట్3(ఎడ్యుశాట్) ప్రయోగాన్ని విజయవంతం నిర్వహించారు. *2004 జులై 10న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్02 వాహకనౌక ద్వారా ఇన్‌శాట్-4సిని ప్రయోగించగా, అది విఫలమైంది *2007 సెప్టెంబరు 2న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్04 ద్వారా ఇన్‌శాట్-4సిఆర్ ప్రయోగించి మళ్లీ విజయం నమోదుచేశారు. *తాజాగా దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్‌తో గురువారం జీఎస్‌ఎల్‌వీ-డీ3 ద్వారా జీశాట్4ను ప్రయోగించగా.. విఫలమైంది. *తక్కువ బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వాడే పీఎస్‌ఎల్‌వీ కూడా అపజయాలతోనే ఖాతా ప్రారంభించింది. 1993 సెప్టెంబర్ 20న ఐఆర్‌ఎస్-1ఈతో పయనమైన ఈ వాహకనౌక కక్ష్యలోకి చేరలేదు. | |
|