అద్భుతాన్ని ఆవిష్కరించిన ఇంజినీర్
పాలమూరు యువకుడి ఘనత
న్యూస్‌టుడే, హైదరాబాద్: వేసవిలో... నిప్పుల కొలిమిగా మారే మహా నగరంలో ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేం. నాలుగడుగులు వేస్తే... ఒళ్లంతా వేడెక్కి... ఉక్కపోతతో ఉడికిపోయే పరిస్థితి. అదే... వణికించే చలిలో... స్వెట్టరో... మందమైన వస్త్రాలో ఉంటే కానీ బయటకు వెళ్లలేం. వేసవిలో చల్లగా... చలికాలంలో వెచ్చగా ఉంచే జాకెట్ ధరించే అవకాశం ఉంటే...? భలే ఉంటుంది కదా! ఆశకు అంతు లేకుండా పోతుందని అనుకోవద్దు. జేమ్స్‌బాండ్ సినిమాలో సిత్రం కాదు... విఠలాచార్య మార్క్ మంత్రమేమీ కాదు... మన హైదరాబాదీ ఇంజినీర్ ఒకరు 'క్త్లెమేకాన్' పేరుతో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఏప్రిల్‌లోనే 43 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్న వేళ... వేడితో విసిగిపోతున్న వాళ్లకి చల్లటి కబురు. కలలాంటి ఓ నిజాన్ని ఇరవై తొమ్మిదేళ్ల విస్తాకుల క్రాంతికిరణ్ సృష్టించాడు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు చల్లగా, చల్లటి రోజుల్లో నులివెచ్చని వెచ్చదనాన్ని ఇస్తూ శరీరానికి హాయి కలిగించే జాకెట్‌ని తయారు చేశారు.
నగరంలోని జె.ఎన్.టి.యు.లో 1996-2001లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈ యువ ఆవిష్కర్త తెలంగాణాలో వెనుకబడిన మహమూబ్‌నగర్ (పాలమూరు) జిల్లాకు చెందినవాడు కావడం విశేషం. 'కృషి ఉంటే మనుషులు రుషులవుతారు' అంటే ఇదే కదా! ఇక్కడ ఇంజినీరింగ్ పూర్తిచేశాక మాస్టర్ డిగ్రీ కోసం బోస్టన్ వెళ్లాడు. అక్కడే ఈ జాకెట్‌కు అంకురార్పణ జరిగింది. ఇది ఇప్పుడు సాంకేతిక ఆవిష్కరణల్లో సంచలనం సృష్టిస్తోంది. 'టెక్నాలజీ రివ్యూ ఇండియా' మార్చి సంచికలో క్రాంతికిరణ్‌ను భారతదేశ వైవిధ్య ఆవిష్కర్త శాస్త్రవేత్తగా పేర్కొంది. పెల్టీర్ సిద్ధాంతం స్ఫూర్తితో ఈ జాకెట్‌ను తయారు చేసినట్లు క్రాంతి చెప్పారు.
'బోస్టన్‌లో చలి మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. వేడి 40 డిగ్రీల వరకు ఉంటుంది. కాలేజీకి వెళ్లేటప్పుడు మందపాటి వస్త్రాల్ని ధరించి వెళ్లేవాడిని. క్లాస్‌రూంలోకి వెళ్లాక జాకెట్‌ను తీసేయాల్సి వచ్చేది. ఎందుకంటే అక్కడి తరగతి గది వేడిగా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉంటుంది. బయటకు వెళ్లేటప్పుడు కోటు వేసుకోవాలి. క్లాస్‌రూంకి రాగానే తీసేయాలి. ఏమిటీ అవస్థలు? దీనికి పరిష్కారం లేదా? అని అనుకునేవాడిని. అప్పటి నుంచి మస్తిష్కంలోని ఒక అరను ఈ పరిశోధన కోసం కేటాయించా. రెండో అరను చదువుకు కేటాయించా'నంటూ క్రాంతి మంగళవారం 'న్యూస్‌టుడే'తో చెప్పారు. ఆ శోధన ఫలితమే 'క్త్లెమేకాన్ జాకెట్'గా రూపాంతరం చెందింది.
చార్లెస్ పెల్టీర్ పాఠమే ఆదర్శం
ఉష్ణోగ్రతలను నియంత్రించే సిద్ధాంతాన్ని 1834లో భౌతిక శాస్త్రవేత్త జీన్ చార్లెస్ పెల్టీర్ ఆవిష్కరించారు. ఆదే నాకు స్ఫూర్తి. ఆ సిద్ధాంతం వెంటే నా పరిశోధన నడిచింది. రెండు వేర్వేరు లోహాల మధ్య తక్కువస్థాయిలో విద్యుత్తును నడిపించగలిగితే ఉష్ణోగ్రతల్ని నియంత్రించవచ్చు. ఉష్ణోగ్రతల్ని మార్చే సుమారు ఇరవై పెల్టీర్ చిప్‌లను జాకెట్‌లో ఏర్పాటు చేశాం.వీటిని లిథియం పాలిమర్ బ్యాటరీలు రీఛార్జ్ చేస్తుంటాయి.
మూడు కిలోల నుంచి....
తొలిసారి రూపొందించిన జాకెట్ బరువు మూడు కిలోలు వచ్చింది. దశలవారీగా ఐదు రకాలలో వీటిని 650 గ్రాములకు తీసుకొచ్చి, భారత సైన్యానికి అందించారు. కొరియన్, యూఎస్ ఆర్మీతోనూ వాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఆహ్మాదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ)లో వీటికి తుదిమెరుగులు దిద్దారు.
ఆ చలే కసిని పెంచింది: క్రాంతికిరణ్
''అనుభవమే పాఠాలను నేర్పుతుందంటారే.. అలాగే ఆ వాతావరణమే నాలో కసి పెంచింది. పోస్టు గ్రాడ్యుయేషన్ చేసేందుకు అమెరికాలోని బోస్టన్ నగరానికి వెళ్లాను. అసలే కొత్త ప్రాంతం. వాతావరణం మరింత ఆందోళనను రేకెత్తించింది. చిన్నప్పుడు చదువుకున్న పెల్టీర్ ఎఫెక్ట్ వెంట ఆలోచనలు సాగాయి. వాతావరణాన్ని భయపడకుండా ఎంజాయ్ చేసేందుకు దీనికేదో పరిష్కారం కనుక్కోవాలనుకున్నాను. అయిదేళ్లు పట్టింది. చివరకు సాధించగలిగాను. చిన్నప్పటి నుంచి ఏవోక కొత్త వస్తువులను తయారుచేయటం అలవాటు. అది కూడా ఉపకరించింది. ఈ జాకెట్ గుర్తింపు వచ్చింది. సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావాలన్నదే ఆలోచన. ఈ కృషి ఫలితంగానే 'ఇండియా టాప్ ఇన్నోవేటర్' అవార్డు దక్కింది. 'ఇండియా ఇన్నోవేషన్' అవార్డూ వచ్చింది.''