
ఎవరికి వారు నుంచి ఒకరి కోసం ఒకరు బతికేలా చేసేది కల్యాణం. పెళ్లి ప్రమాణాలను పంచుకున్నట్లే ఆర్థికంగా కూడా ఒకరి బాధ్యతను మరొకరు పంచుకోవాల్సిన సమయం ఇది. వివాహంతో ముడిపడి.. మధుర జ్ఞాపకాలతో మొదలయ్యే ఇద్దరి జీవితం కలకాలం సంతోషంగా నిలవాలంటే పక్కా ప్రణాళికలుండాలి.

పెళ్లయిన వెంటనే పొదుపు, మదుపు అంటే ఎవరికీ రుచించకపోవచ్చు. కానీ, మొదట్లోనే ఒక కచ్చితమైన అభిప్రాయానికి వస్తే.. ఇక ఎప్పుడూ ఇబ్బంది పడాల్సిన అవసరం రాదనే విషయాన్ని విస్మరించకూడదు.
వెంటనే ఎందుకు?
కొత్త జంటకు వెంటనే ఆర్థిక ప్రణాళిక ఎందుకు అవసరం? ముందే చెప్పుకున్నట్లు వారి ఇద్దరి ఆర్థికలవాట్లు వేర్వేరుగా ఉంటాయి. అప్పటి వరకూ వచ్చిన ఆదాయాన్ని ఒక్కరే ఖర్చు చేస్తే ఇప్పుడు ఇద్దరి కోసం వ్యయం చేయాల్సి ఉంటుంది. పైగా అనుకోని ఖర్చులూ వస్తుంటాయి. ఏడాదికో రెండేళ్లకో పండంటి పాపాయి వస్తుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆర్థిక ప్రణాళిక ఉండాలి. లేకపోతే సంపాదించిందంతా వృథా ఖర్చులకే ఎక్కువగా పోవచ్చు. సాధించాలనుకున్న లక్ష్యాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు.
కలిసి నడవండి
* వివాహం కాగానే సాధ్యమైనంత తొందరగా రిజిస్ట్రేషన్ చేయించాలి. విదేశాలకు వెళ్లాలనుకుంటే వివాహ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. అంతేకాకుండా భవిష్యత్తులో మీ పెట్టుబడులకు ఆస్తులకు, వారసత్వానికి సంబంధించి ఎలాంటి వివాదాలూ రాకుండా ఉంటాయి. ఒకరి పేరు మీద ఒకరు పవర్ ఆఫ్ అటార్నీ కూడా తీసుకోవచ్చు. దీనివల్ల ఆర్థిక పరమైన అంశాల నిర్వహణ సులభం అవుతుంది.
* ఇప్పటి వరకూ ఆదాయాలు, బ్యాంకు ఖాతాలు వేర్వేరుగా ఉంటాయి. వివాహ బంధంతో ఒక్కటైన తర్వాత వాటిని కలపాలా వద్దా అనేది చాలామందికి వచ్చే సందేహం. దీనికి కచ్చితంగా ఇలా చేయాలన్న నియమం ఏదీ లేదు. కాకపోతే దీనిగురించి కూడా దంపతులిద్దరూ ఒక అభిప్రాయానికి రావడం ముఖ్యం. ఎవరి ఆదాయాన్ని ఎలా ఖర్చు చేయాలి? ఎవరి సంపాదనను పొదుపు/మదుపులకు కేటాయించాలన్నది నిర్ణయించుకోవాలి. ఇంటి నిర్వహణ కోసం ఎవరెంత కేటాయించాలన్నది కూడా ముఖ్యమే.
* ఎలాంటి దాపరికాలు లేకుండా మాట్లాడుకోవడం వల్ల సగం సమస్యలు మొగ్గలోనే పరిష్కారం అవుతాయి. ఆర్థిక విషయాల్లోనూ అంతే. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్థులైతే ఎవరికి ఎంతెంత ఆదాయం వస్తుందో మరొకరికి తెలిసి ఉండాలి. దంపతుల్లో ఒక్కరే ఆర్జనపరులైతే దీని గురించి మరింత స్పష్టత అవసరం. లేకపోతే ఆదాయం గురించి తెలియకుండా.. ఖర్చు అంచనాలు పెరిగే ప్రమాదం ఉంది.
* సొమ్ముకు సంబంధించిన విషయాల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుకోవాలి. మీ ఇద్దరిలో సొమ్ము నిర్వహణ గురించి ఎవరికి ఎక్కువ ఆసక్తి ఉంటుందో వారే ఆ బాధ్యతను నిర్వహించవచ్చు. అయితే, ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నామన్న విషయాన్ని భాగస్వామికి చెప్పడం మాత్రం విస్మరించవద్దు. అనుకోని నష్టాలు ఎదురయినప్పుడు ఒకరిమీద ఒకరు నిష్ఠూరమాడటం ఎట్టి పరిస్థితుల్లోనూ తగదు.
* కొత్త ఇల్లు కొనడం.. విదేశాలకు విహార యాత్రలకు వెళ్లడం.. ఇవన్నీ కొత్త జంట కనే కలలు. వీటిని నిజం చేసుకోవడానికి ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి రావాలి. దానికి తగ్గట్టుగా సొమ్ముకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి. అందుకోసం ఎంత మొత్తం ప్రత్యేకించాలి అనేది తెలిస్తే.. దానిని బట్టి మీ ఖర్చులను తగ్గించుకోవడం లాంటి విషయాలపై దృష్టి పెట్టడానికి వీలవుతుంది.
అత్యవసర నిధి ఏర్పాటు
పెళ్లయిన కొత్తలో సొమ్ము మంచినీళ్లలా ఖర్చవుతుంది. ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో ఊహించడం కూడా సాధ్యం కాదు. ఈ ఆర్థిక అత్యవసరాలను తట్టుకోవాలంటే.. దానికి తగ్గట్టుగా కొంత నిధిని ఏర్పాటు చేసుకోవడమే మార్గం. ఆర్థిక మాంద్యం తర్వాత ఉద్యోగ భద్రత అంతంత మాత్రంగానే ఉంది. అనుకోని పరిస్థితుల్లో చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి, కొత్త దాన్ని వెతుక్కోవాల్సి రావచ్చు. అలాంటప్పుడు ఇది ఆదుకుంటుంది. అంతేకాకుండా ఇద్దరి సంపాదన ఒక సంపాదనగా మారినప్పుడు జీవనశైలిలో మార్పు రావచ్చు. ఇలాంటి వాటిని తట్టుకోవాలంటే ఈ నిధి అవసరం.
* కనీసం ఆరు నెలలకు సరిపోయే సొమ్మునైనా అత్యవసర నిధి కింద ఏర్పాటు చేసుకోవాలి. ఈ సొమ్మును తేలికగా తీసుకునేందుకు వీలుగా ఉండే పథకాల్లో జమ చేయాలి. బ్యాంకు సేవింగ్ ఖాతా లేదా లిక్విడ్ ఫండ్లలో మదుపు చేయవచ్చు. వీటిల్లో బ్యాంకు డిపాజిట్ కన్నా ఎక్కువ వడ్డీ గిట్టుబాటు అవుతుంది.
బడ్జెట్ ఉండాలి
వచ్చేదెంత? ఖర్చయ్యేదెంత? కచ్చితమైన అవగాహన ఉంటేనే మీరు కోరుకున్న విధంగా జీవించగలరు. ఈ విషయాన్ని కొత్త దంపతులు ముందుగా గుర్తించాలి. కొత్తగా కుటుంబ బాధ్యతలు వస్తాయి కాబట్టి, ఖర్చుల గురించి మీకు అవగాహన ఉండకపోవచ్చు. అందుకే మీరు చేయాల్సింది ఏమిటో తెలుసా? ఇంటి బడ్జెట్‌ను తయారు చేయడం. కొత్తగా పెళ్లయిన వారికి బోలెడు ఖర్చులుంటాయి. తర్వాత ఈ ఖర్చులుండవుగా? అనే సందేహం మీకు రావచ్చు. చేసిన ఖర్చు గురించి రాయడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు కదా! అందుకే వీలైనంత వరకూ ఏదీ దాచకుండా.. అన్ని వివరాలూ నమోదు చేయండి. తొలినాళ్ల నుంచే ఇంటి బడ్జెట్ వేసుకోవడం అలవాటయితే, తర్వాత కాలంలో ఇబ్బందులు ఉండవు కదా! మీ నెలవారీ ఖర్చుల లెక్కలు తెలియడం వల్ల వృథా తగ్గుతుంది. అలా మిగిలిన సొమ్మును మీరు మీ ప్రత్యేక లక్ష్యాల సాధనకు వినియోగించుకోవచ్చు.
మరవకూడనిది
పెళ్లికి ముందు చాలామంది బీమా పాలసీల గురించి పట్టించుకోరు. కానీ, ఇప్పుడు ప్రాధాన్యం ఇవ్వాల్సిన మొదటి పని ఇద్దరూ సరైన మొత్తానికి బీమా తీసుకోవడం. తక్కువ మొత్తానికి ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్ పాలసీని తీసుకోవడం ఆర్జనపరులకు తప్పనిసరి. జీవిత భాగస్వామి గృహిణి అయినా, ఆమె పేరుమీద కూడా తగిన బీమా పాలసీ తీసుకోవాలి. దీంతోపాటు ఆరోగ్య, వ్యక్తిగత ప్రమాద బీమా కూడా ముఖ్యమే. పిల్లలు పుట్టిన తర్వాత, తల్లిదండ్రులను కూడా పోషించాల్సిన బాధ్యత వచ్చినప్పుడు జీవిత బీమా మొత్తాన్ని పెంచుకోవాలి.
* ఇప్పుడు ప్రతి సంస్థా ఉద్యోగులకు ఆరోగ్య బీమా పాలసీ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అయితే, దీనిమీదే పూర్తిగా ఆధారపడకుండా సొంతంగా మరో పాలసీ తీసుకోవడం మంచిది. దీనికి ఫిజికల్ డిజేబిలిటీ/క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ల వంటి వాటిని జోడించుకోవాలి.
లక్ష్య సాధన...
ఇల్లు కొనాలన్నది మీ లక్ష్యమా? అయితే, ఈ రోజుల్లో నగరాల్లో కనీసం రూ. 20-30 లక్షలు కావాలి. కొత్త కారు కొనాలనుకుంటే.. కనీసం రూ. 4-6 లక్షలు కావాలి. దీర్ఘకాలిక లక్ష్యాలను తీసుకుంటే పిల్లల చదువు, వారి పెళ్లిళ్లు, పదవీ విరమణ ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి.
లక్ష్యం ఏదైనా దాన్ని సాధించాలంటే.. సంపాదించడం ఒక్కటే మార్గం కాదు. ఆర్జించి మిగిల్చిన సొమ్మును జాగ్రత్తగా మదుపు చేయాలి. దానికోసం సరైన పథకాలను ఎంచుకోవాలి. నష్టభయాన్ని భరించే సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడుల కేటాయింపు ఉండాలి. పోస్టాఫీసు పొదుపు పథకాలు, బ్యాంకు టర్మ్ డిపాజిట్లు, బంగారం, మ్యూచువల్ ఫండ్స్, కంపెనీల షేర్లు, స్థిరాస్తి ఇలా పెట్టుబడులను ఎన్నుకోవాలి. ఫలితంగా నష్టభయం తగ్గుతుంది. ఒక పథకం నష్టాలను మిగిల్చినా, మరో పథకం రాబడులను అందిస్తుంది. రూపాయికి సంపాదించడం నేర్పినప్పుడే సాధించాలనుకున్న లక్ష్యాలను చేరుకోగలం అన్నది మర్చిపోకండి.
| |
| |